సైబర్‌ నేరాల కట్టడికి కిల్‌ స్విచ్‌ | Final decision after RBI meeting with national banks and insurance companies | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరాల కట్టడికి కిల్‌ స్విచ్‌

Feb 3 2026 6:14 AM | Updated on Feb 3 2026 6:14 AM

Final decision after RBI meeting with national banks and insurance companies

బ్యాంకు లావాదేవీలు తక్షణం ఫ్రీజ్‌ చేసే సాధనం

ఈ నేరాలను బీమా పరిధిలోకి తీసుకొచ్చేందుకు కమిటీ సిఫార్సు 

కేంద్ర హోంశాఖ సూత్రప్రాయ నిర్ణయం 

జాతీయ బ్యాంకులు, బీమా సంస్థలతో ఆర్బీఐ సమావేశం అయ్యాక తుది నిర్ణయం  

సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర హోంశాఖ కార్యాచరణ

సాక్షి, అమరావతి: సైబర్‌ నేర ముఠాలు బ్యాంకు ఖాతాలను కొల్లగొట్టకుండా చెక్‌ పెట్టేందుకు కేంద్ర హోంశాఖ సరికొత్త కార్యాచరణకు ఉపక్రమిస్తోంది. ఆన్‌లైన్, డిజిటల్, యూపీఐ చెల్లింపుల ప్రక్రియలో ‘కిల్‌ స్విచ్‌’ను ప్రవేశపెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. డిజిటల్‌ అరెస్టులు, ఇతర సైబర్‌ నేరాల బాధితుల బ్యాంకు ఖాతాల లావాదేవీలను తక్షణం నిలుపుదల చేసేందుకు ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది. సైబర్‌ నేరాల కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై సిఫార్సు చేసేందుకు కేంద్ర హోంశాఖ గత ఏడాది డిసెంబరులో ఓ ఉన్నతస్థాయి కమిటీని నియమించింది.

కేంద్ర హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి నేతృత్వంలోని ఈ కమిటీలో కేంద్ర న్యాయ, ఐటీ–టెలీ కమ్యూనికేషన్లు, వినియోగదారుల వ్యవహారాల శాఖలు, ఆర్బీఐ, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), ఇండియన్‌ సైబర్‌ క్రైం కో–ఆర్డినేషన్‌ సెంటర్‌ (ఐ4సీ) ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ తన సిఫార్సులను ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమరి్పంచింది. ‘కిల్‌ స్విచ్‌’ సాధనాన్ని అందుబాటులోకి తేవడంతోపాటు సైబర్‌ క్రైం నేరాలకు బీమా సౌకర్యం కలి్పంచాలని కూడా ప్రతిపాదించారు. నివేదికలోని ప్రధాన అంశాలివీ..

బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్‌
ఆన్‌లైన్‌ బ్యాంకింగ్, డిజిటల్‌ చెల్లింపులు, యూపీఐ చెల్లింపుల విధానంలో ఈ ‘కిల్‌ స్విచ్‌’ అనే బటన్‌ను ప్రవేశపెట్టాలని కేంద్ర హోంశాఖ కమిటీ ప్రతిపాదించింది. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించి సంతృప్తి వ్యక్తంచేసింది. కంప్యూటర్లు, మొబైల్‌ ఫోన్లలోని బ్యాంకింగ్‌ యాప్‌లు, యూపీఐ యాప్‌లలో ఈ ‘కిల్‌ స్విచ్‌’ బటన్‌ను ఏర్పాటుచేస్తారు. డిజిటల్‌ అరెస్టు, ఇతర సైబర్‌ నేరాల బారిన పడ్డామని గుర్తించగానే ఆ ‘కిల్‌ స్విచ్‌’ బటన్‌ను నొక్కి­తే చాలు.. వారి అన్ని బ్యాంకు ఖాతాలు వెంటనే స్తంభించిపోతాయి.

ఆ ఖాతాల నుంచి ఇతర ఖాతా­లకు నగదు బదిలీగానీ ఇతర లావాదేవీలుగానీ సాధ్యంకాదు. దీంతో.. సైబర్‌ నేర ముఠాలు బెదిరింపులకు పాల్పడి సామాన్యుల బ్యాంకు ఖాతాల నుంచి నగదు బదిలీ చేయించుకోవడానికి అడ్డుకట్ట వెయ్యొ­చ్చని కేంద్ర హోంశాఖ కమిటీ భావిస్తోంది. ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడంతోపాటు సుప్రీంకోర్టుకు నివేదించింది. ఇదే అంశంపై ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రతినిధులతో కూడా సమావేశం నిర్వహించింది. సైబర్‌ నేరాలను బీమా పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని కూడా ఈ కమిటీ సిఫార్సు చేసింది. బ్యాంకు ఖాతాలు ఉన్నవారు బీమా చేసుకుంటే.. సైబర్‌ నేరాలకు గురైతే బీమా పరిహారం పొందవచ్చు. ఈ ప్రతిపాదనపై ఆర్బీఐ దేశంలోని జాతీయ బ్యాంకులు, బీమా సంస్థలతో మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

సుప్రీంకోర్టు ఆగ్రహంతో కేంద్ర హోంశాఖ కార్యాచరణ
దేశంలో సైబర్‌ నేర ముఠాలు 2024–25లో దేశంలో రూ.34,771 కోట్లు కొల్లగొట్టాయి. డిజిటల్‌ అరెస్టులని బెదిరించి వీడియో కాల్స్‌లో గంటల తరబడి బంధించి రూ.3 వేల కోట్లు దోచుకున్నాయి. దీంతో.. తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించింది. డిజిటల్‌ అరెస్టులు, సైబర్‌ నేరాల కట్టడికి ఎలాంటి చర్యలు చేపడతారో చెప్పాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. ఫలితంగా.. కేంద్ర హోంశాఖ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసింది. ‘కిల్‌ స్విచ్‌’ బటన్‌ ఏర్పాటు, సైబర్‌ నేరాలకు బీమా భద్రతతోపాటు మరికొన్ని అంశాలను ప్రతిపాదించింది. సుప్రీంకోర్టు పరిశీలన అనంతరం కేంద్ర హోంశాఖ తదుపరి కార్యాచరణ చేపడుతుంది. 

Advertisement
 
Advertisement
Advertisement