ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేయండి | Electricity bills doubled after installing new meters: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేయండి

Feb 3 2026 5:57 AM | Updated on Feb 3 2026 5:58 AM

Electricity bills doubled after installing new meters: Andhra Pradesh

డిస్కంలకు ఏపీఈఆర్‌సీ ఆదేశం 

కొత్త మీటర్లు పెట్టాక రెట్టింపు విద్యుత్‌ బిల్లులు   

అదనపు కెపాసిటర్ల వల్ల స్మార్ట్‌ మీటర్లలో రీడింగ్‌ నమోదవుతుందంటున్న డిస్కంలు 

స్మార్ట్‌మీటర్లలో మార్పులు చేయాలన్న ఏపీఈఆర్‌సీ 

అదనంగా వసూలు చేసిన డబ్బులు బిల్లుల్లో సర్దుబాటు చేయాలని ఆదేశం

సాక్షి, అమరావతి: విద్యుత్‌ వినియోగదారుల నుంచి స్మార్ట్‌ మీటర్లు పెట్టిన తర్వాత అదనంగా వసూలు చేసిన చార్జీలను వెనక్కి ఇచ్చేయాలని రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లను ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) ఆదేశించింది. ఇకపై కెపాసిటర్లు ఎన్ని ఉన్నా లోడ్‌కి ఎన్ని అవసరమో వాటినే విద్యుత్‌ బిల్లు వేసేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. విద్యుత్‌ పంపిణీ రంగంలో సామర్థ్యం, పార­దర్శకత, విశ్వసనీయతను మెరుగుపరచడాని­కి ఆధునిక మీటరింగ్‌ సాంకేతిక పరిజ్ఞానాలకు మద్దతు ఇస్తూనే వినియోగదారుల ప్రయోజనాల­ను కాపాడటానికి కట్టుబడి ఉన్నామని కమిషన్‌ స్పష్టం చేసింది. 

మేం కట్టలేం 
‘‘స్మార్ట్‌ మీటర్లు పెడతామని ఎవరైనా వస్తే వాటిని పగలగొట్టండి అని ఎన్నికల ముందు టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచం, అవవసరమైతే తగ్గిస్తాం అన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక వినియోగదారుల సమ్మతితోనే విద్యుత్‌ సర్విసులకు స్మార్ట్‌ మీటర్లు బిగిస్తామంటూ మాట మాచ్చారు. ఇప్పుడు స్మార్ట్‌ మీటర్లు పెట్టుకోకపోతే ఉన్న సర్వీసులు తొలగిస్తామంటూ నోటీసులు ఇస్తున్నారు. వీటికి తోడు ప్రజలపై దాదాపు రూ.20 వేల కోట్లకుపైగా విద్యుత్‌ చార్జీల భారం మోపారు.

స్మార్ట్‌ మీటర్లు పెట్టడంతో విద్యుత్‌ బిల్లులు రెండు, మూడింతలు పెరిగిపోయాయి. ఇలా అయితే మేమెలా బిల్లులు కట్టాలి ? వినియోగించని విద్యుత్‌కు చార్జీలు ఎందుకు చెల్లించాలి.’’ అంటూ విద్యుత్‌ వినియోగదారులు ఏపీఈఆర్‌సీకి ఇటీవల మొర పెట్టుకున్నారు. బహిరంగ విచారణలో, ఈమెయిళ్ల ద్వారా, నేరుగానూ తమ సమస్యలను మండలికి చెప్పుకున్నారు. 

అందుకే ఎక్కువ బిల్లు 
వినియోగదారుల ఆందోళనను సీరియస్‌గా తీసుకున్న మండలి ఈ సమస్యకు తమ వంతు పరిష్కారాన్ని అన్వేషించింది. పాత ఎలక్ట్రోమెకానికల్, స్టాటిక్‌ మీటర్లతో పోలిస్తే కొంతమంది వినియోగదారులకు అధిక విద్యుత్‌ బిల్లులు వచ్చాయని గుర్తించింది. ఈ నేపథ్యంలో మూడు సూచనలతో సోమవారం ఆదేశాలు జారీ చేసింది. లో టెన్షన్‌ (ఎల్‌టీ) విద్యుత్‌ సర్విసులకు స్మార్ట్‌ మీటర్లు అమర్చిన తర్వాత విద్యుత్‌ బిల్లులు భారీగా పెరిగాయి. దీనికి కెపాసిటర్లు కారణమంటూ ఏపీఈఆర్‌సీకి డిస్కంలు వెల్లడించాయి. వినియోగదారులు అవసరమైన దానికంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న కెపాసిటర్లను పెట్టుకోవడం వల్ల స్మార్ట్‌ మీటర్లు అదనపు లోడ్‌కి తగ్గట్టుగా యూనిట్లు లెక్కిస్తున్నాయని వివరించాయి. ఈ విషయాన్ని పరిశీలించిన తర్వాత వినియోగదారుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని స్మార్ట్‌ మీటరింగ్‌ ప్రోగ్రామ్‌కు అనుకూలమైన వాతావరణం కల్పించాల్సి ఉందని భావించినట్లు ఏపీ ఈఆర్‌సీ వెల్లడించింది.

ఏపీఈఆర్‌సీ ఆదేశాలు ఇవీ 
స్మార్ట్‌ మీటర్లలో కెపాసిటర్ల ఆధారంగా బిల్లు లెక్కింపు విధానం ఉండాలని గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు నిలిపివేస్తున్నట్లు మండలి తెలిపింది.
⇒ స్మార్ట్‌ మీటర్లు పెట్టిన తర్వాత లీడింగ్‌ రియాక్టివ్‌ ఎనర్జీ (కెపాసిటర్‌) కారణంగా వినియోగదారులు ఇప్పటికే చెల్లించిన అదనపు బిల్లులను ఉపసంహరించుకోవాలని డిస్కంలను ఆదేశించింది.
⇒  అలా వసూలు చేసిన అదనపు మొత్తాలను సంబంధిత వినియోగదారులకు తర్వాతి నెలల విద్యుత్‌ వినియోగ బిల్లులలో సర్దుబాటు చేయాలని సూచించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement