ఏపీలో అరాచక పాలన | YSRCP Pilli Subhash Chandra Bose Fires On Chandrababu govt | Sakshi
Sakshi News home page

ఏపీలో అరాచక పాలన

Feb 3 2026 5:52 AM | Updated on Feb 3 2026 5:52 AM

YSRCP Pilli Subhash Chandra Bose Fires On Chandrababu govt

శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి 

రాష్ట్రంలో ‘రాష్ట్రపతి పాలన’ విధించండి 

రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌   

కేంద్రం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తోందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఏపీలోని ప్రస్తుత పరిస్థితులను ఎండగట్టారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని, వైఎస్సార్‌సీపీ నేతలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయన్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌ ఇళ్లపై దాడులు చేసి తగులబెట్టారని ఆరోపించారు. వందల మంది తమ పార్టీ కార్యకర్తలను పొట్టనబెట్టుకున్నారని, ఇళ్లను దహనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తమకు మద్దతుగా ఉందన్న ధీమాతోనే చంద్రబాబు ప్రభుత్వం ఇంతటి అరాచకానికి తెగబడుతోందని విమర్శించారు. ఏపీలో కనీసం ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రిని కోరారు.  

రైతులకు తీరని అన్యాయం.. పీఎం కిసాన్‌ను పెంచండి  
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను చంద్రబాబు ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా రద్దు చేసిందని మండిపడ్డారు. దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, 2019 నుంచి రైతులకు ఇస్తున్న రూ.6 వేలు ’పీఎం కిసాన్‌’ సాయం ఏమాత్రం సరిపోవడం లేదని బోస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని కనీసం రూ.9 వేలకు పెంచాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.  

బాబు మోసం.. పథకాలన్నీ బంద్‌! 
గతంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రైతులకు ఏటా రూ.13,500 పెట్టుబడి సాయం అందించి ఆదుకుందని, కానీ ప్రస్తుత సీఎం చంద్రబాబు ఎన్నికల్లో రూ.20 వేలు ఇస్తానని హామీ ఇచ్చి, ఇప్పుడు మొండి చేయి చూపించారని విమర్శించారు. గత ప్రభుత్వం ప్రీమియం చెల్లించి అమలు చేసిన ’ఉచిత పంటల బీమా’ పథకాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని, దీనివల్ల 74 శాతం మంది రైతులు బీమా అర్హత కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

చిన్న, సన్నకారు రైతులకు వరంలా ఉన్న ఉచిత బోరు బావుల పథకాన్ని కూడా నిలిపివేశారని, పాడి రైతులకు ఇచ్చే లీటరుకు రూ.4 బోనస్‌ను, కోల్డ్‌ స్టోరేజీల సబ్సిడీలను ఎత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరించేందుకు (పీపీపీ మోడల్‌) చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, దీనిపై కోటి సంతకాలతో గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చామని, కేంద్రం తక్షణం జోక్యం చేసుకుని ప్రైవేటీకరణను ఆపాలను పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement