రాష్ట్రంలో యథేచ్ఛగా కల్తీ, అక్రమ మద్యం విక్రయిస్తున్న పచ్చమూకలు
ఆ మొత్తం డబ్బు పచ్చబాబుల జేబుల్లోకి
ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు ఈ ఆర్థిక ఏడాదిలో నవంబరు నాటికి 13% వృద్ధి క్షీణించి రూ.1266 కోట్లు తగ్గిన రాబడి
‘కల్తీ’ వ్యవహారం తెలిసినా... ప్రభుత్వ పెద్దల మనసెరిగి మౌనం వహిస్తున్న ఎక్సైజ్ శాఖ కీలక అధికారులు
పొరుగు రాష్ట్రాల్లో ఎక్సైజ్ ఆదాయంలో భారీ వృద్ధి.. ఏపీలో మాత్రం క్షీణత
అదేబాటలో నవంబరు నాటికి జీఎస్‌టీ రాబడి క్షీణత 0.04 శాతం
మంత్రులు, కార్యదర్శుల భేటీలో ఇటీవల వెల్లడించిన ఆర్థిక శాఖ
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో కల్తీ, అక్రమ మద్యం యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం షాపులు, వాటికి అనుబంధంగా పర్మిట్ రూమ్‌లను, బెల్టుషాపులను టీడీపీ సిండికేట్, ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు నడుపుతున్నారు. ఈ కల్తీ, నకిలీ మద్యం పచ్చ నేతల జేబులు నింపుతోంది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. దీనికితోడు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఫలితంగా మందుబాబుల ఆరోగ్యం క్షీణించడంతోపాటు రాష్ట్ర ఖజానాకు భారీగా గండిపడుతోంది.

అదే సమయంలో పచ్చ చొక్కాల జేబులు మాత్రం కాసులతో ఫుల్‌గా నిండుతున్నాయి. గతంతో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ప్రభుత్వ ఖజానాకు ఎక్సైజ్ రాబడి ఏకంగా 13 శాతం క్షీణించడమే ఇందుకు నిదర్శనం. ఇటీవల ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించిన మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతుల సమావేశంలో స్వయంగా ఆర్థిక శాఖ ప్రజెంటేషన్ ద్వారా ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
అంతే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో ఎక్సైజ్ రాబడి పెరుగుతుండగా అందుకు పూర్తి విరుద్ధంగా రాష్ట్రంలో మద్యం ఆదాయం తగ్గిపోతోందని ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఎక్సైజ్ రాబడులు ఝార్ఖండ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో భారీ వృద్ధి సాధించగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎక్సైజ్ ఆదాయం తిరోగమనంలో ఉంది.
‘పెద్దల’ మనసెరిగి.. ఎక్సైజ్‌శాఖ మౌనం
మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఆదాయం పెరగకపోగా తగ్గిపోవడానికి ప్రధాన కారణం పచ్చబాబులు కల్తీ, అక్రమ మద్యం యథేచ్ఛగా విక్రయించి సొమ్ము చేసుకోవడమేనని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పడం గమనార్హం. అయితే అక్రమ మద్యం తయారీ విషయం ఎక్సైజ్ శాఖలోని కీలక అధికారులకు తెలిసినప్పటికీ ప్రభుత్వ పెద్దల మనసెరిగి మౌనం వహిస్తున్నారనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది.
2024–25 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఎక్సైజ్ ద్వారా రాబడి రూ.14,380 కోట్లుండగా ఈ ఆర్థిక ఏడాది (2025–26) ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఎక్సైజ్ రాబడి రూ.13,114 కోట్లే వచ్చింది. అంటే రూ.1266 కోట్ల మేర ఖజానాకు గండిపడింది. ఈ మొత్తం పచ్చ బాబుల జేబుల్లోకి వెళ్లినట్లేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
అలాగే జీఎస్‌టీ రాబడులు కూడా పొరుగు రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రంలో తక్కువగా ఉన్నట్లు ఆర్థిక శాఖ ప్రజెంటేషన్‌లో స్పష్టం చేసింది. ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు జీఎస్‌టీ రాబడులు బీహార్, కర్ణాటక, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వృద్ధి నమోదు కాగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 0.04 శాతం క్షీణత నెలకొందని ఆర్థిక శాఖ పేర్కొంది.


