బంగారం, వెండి ధరలు తగ్గుతాయి.. తొందరపడి కొనుగోలు చేయకండి అని గ్లోబల్ ఎకనామిక్ అడ్వైజర్స్ చీఫ్ ఎకనామిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'విలియం లీ' హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఆయన మాటలు నిజయమయ్యాయా అనిపిస్తోంది.
గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. దీంతో రేట్లు భారీగా తగ్గిపోయాయి. ధరల తగ్గుదల అటు పెట్టుబడిదారుల్లో.. వ్యాపారుల్లో కూడా ఆందోళన కలిగిస్తోంది. పసిడి ధరల పెరుగుదలను లీ.. నీటి బుడగ(బబుల్)తో పోల్చారు. ఈ బుడగ ఎప్పుడైనా పగిలిపోయే అవకాశం ఉందన్నారు. ఆ గోల్డ్ బబుల్ ఇప్పుడు పేలిపోయింది.
జనవరి 30న బంగారం ధర దాదాపు 9 శాతం తగ్గిపోయి రూ. 1.67 లక్షలకు (10 గ్రాములు) చేరింది. వెండి కూడా రెండు రోజుల్లో కేజీ ధర రూ. 75వేలు తగ్గింది. దీంతో సిల్వర్ రేటు 3.50 లక్షలకు చేరింది. ఈ ధర ఇంకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
వైట్ ఓక్ క్యాపిటల్ ప్రకారం.. బంగారం & వెండి ధరలను భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక వ్యవస్థలోని వ్యవస్థాగత ప్రమాదాలు & కరెన్సీపై ఒత్తిడి వంటివి ప్రభావం చూపుతాయి. నిజానికి వెండి.. బంగారం నిష్పత్తి 80:1గా ఉండేది. కొన్నాళ్లుగా పెరిగిన ధరలు ఈ నిష్పత్తిని 46:1కి చేర్చింది. దీన్నిబట్టి వెండి ఏ స్థాయిలో పెరిగిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
బంగారం, వెండి ధరలు భారీగా తగ్గడం ఇదే మొదటిసారి కాదు. 2011 ఏప్రిల్‌లో కేజీ వెండి ధర రూ.73,288 వద్దకు చేరి, ఆ తరువాత 55 శాతం పడిపోయింది. తిరిగి ఆ స్థాయి నుంచి కోలుకోవడానికి తొమ్మిది సంవత్సరాలు పట్టింది. అదే విధంగా.. 2012 సెప్టెంబర్‌లో బంగారం 10 గ్రాములకు రూ.32,147 వద్ద గరిష్టాన్ని తాకి, 25 శాతం పడిపోయింది. మళ్ళీ మునుపటి స్థాయికి చేరుకోవడానికి ఏడు సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మళ్లీ అదే రిపీట్ అవుతుందా? అని చాలామంది అనుకుంటున్నారు.


