న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఆసక్తికర పరిణామాల మధ్య కొనసాగుతున్నాయి. ఒకవైపు రాజ్యసభలో పదవీ విరమణ పొందుతున్న సభ్యులకు వీడ్కోలు పలుకుతూ ప్రధాని మోదీ ప్రసంగించగా, మరోవైపు ఎల్పీజీ సంక్షోభంపై విపక్షాలు కేంద్రాన్ని చుట్టుముట్టాయి.
ఎంపీలకు ప్రధాని వీడ్కోలు
రాజ్యసభ నుంచి పదవీ విరమణ పొందుతున్న ఎంపీలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. దేశ నిర్మాణంలో, పార్లమెంటరీ చర్చల్లో వారు పోషించిన పాత్రను కొనియాడారు. సభలో చోటుచేసుకున్న ఈ మార్పును ఒక పరివర్తన కాలంగా ఆయన అభివర్ణించారు. మరోవైపు దేశంలో నెలకొన్న గ్యాస్ సంక్షోభంపై రాజ్యసభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వివరణ ఇచ్చారు.
భారత్ వినియోగించే ఎల్పీజీలో సుమారు 65 శాతం దిగుమతి చేసుకుంటున్నామని, అందులో 90 శాతం ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ మార్గం గుండానే వస్తుందని వెల్లడించారు. అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ, దేశంలో గ్యాస్ సరఫరా నిరంతరం కొనసాగేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని భరోసా ఇచ్చారు. అయినప్పటికీ, గ్యాస్ ధరలు, కొరతపై విపక్షాలు తమ నిరసనను కొనసాగిస్తూనే ఉన్నాయి.
మిస్సింగ్ కేసులపై ప్రత్యేక అధ్యయనం
ఢిల్లీలో పెరుగుతున్న మిస్సింగ్ కేసుల (ముఖ్యంగా మహిళలు, పిల్లలు)పై పార్లమెంటరీ హోం వ్యవహారాల కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై ప్రముఖ విశ్వవిద్యాలయాలతో కలిసి సామాజిక అధ్యయనం చేయాలని ఢిల్లీ పోలీసులకు సిఫార్సు చేసింది. శాంతిభద్రతల పరిరక్షణకు, సమర్థవంతమైన ట్రాకింగ్ మెకానిజం కోసం ఈ అధ్యయనం తోడ్పడుతుందని కమిటీ తన నివేదికలో పేర్కొంది.
కాంగ్రెస్‌లో రాజీనామా కలకలం
అసోం కాంగ్రెస్ ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్ రాజీనామా అంశం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీనిపై ఎంపీ సుఖ్‌దేవ్ భగత్ స్పందిస్తూ.. రాజీనామాపై కొంత గందరగోళం నెలకొందని, అయితే ఆయన రాజీనామా చేయలేదని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు తెలిపినట్లు పేర్కొన్నారు. అంతర్గత విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతం లోక్‌సభలో బడ్జెట్ పద్దులపై చర్చ కొనసాగుతుండగా, రాజ్యసభలో వివిధ కమిటీల నివేదికల సమర్పణ ప్రక్రియ సాగుతోంది.


