ప్రకృతి రమణీయతకు, అద్భుతమైన బీచ్‌లకు పెట్టింది పేరు ఆస్ట్రేలియా... ఏటా లక్షలాది మంది పర్యాటకులు ఇక్కడి ప్రకృతి అందాలను చూసేందుకు వస్తుంటారు. అయితే ఇటీవల ఒక ప్రముఖ ట్రావెల్ వెబ్‌సైట్ చేసిన చిన్న పొరపాటు పర్యాటకులను విస్తుపోయేలా చేసింది.
ఆస్ట్రేలియాలోని టాస్మేనియా ప్రాంత పర్యటనలకు సంబంధించిన ఒక వెబ్‌సైట్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో లేని ప్రదేశాన్ని ఉన్నట్లుగా చూపించి పర్యాటకులను తప్పుదోవ పట్టించింది. ఈ ఏఐ ఫీచర్ ఈశాన్య టాస్మేనియాలోని అడవుల్లో ‘వెల్డ్‌బరో హాట్ స్ప్రింగ్స్’ (వేడినీటి బుగ్గలు) ఉన్నాయని, ఆ ప్రాంతం ప్రశాంతతకు నిలయమని వర్ణించింది. దీంతో పర్యాటకులు అక్కడికి క్యూ కట్టారు.
వెబ్‌సైట్ ఇచ్చిన సమాచారాన్ని నమ్మి ప్రకృతి ఒడిలో హాయిగా సేద తీరవచ్చని భావించిన పర్యాటకులు టాస్మేనియాకు చేరుకున్నారు. తీరా అక్కడికి వెళ్ళాక పర్యాటకులు అక్కడి సీన్ చూసి అవాక్కయ్యారు. వెబ్‌సైట్‌లో చెప్పినట్లుగా అక్కడ ఎటువంటి వేడినీటి బుగ్గలు లేకపోవడమే కాకుండా, ఆ ప్రాంతం వెబ్‌సైట్‌లోని వివరణకు పొంతన లేకుండా ఉంది. దీంతో సుదూర ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై 'ఆస్ట్రేలియన్ టూర్స్ అండ్ క్రూయిజెస్' యజమాని స్కాట్ హెన్నెస్సీ స్పందించారు. తమ వెబ్‌సైట్‌లోని ఏఐ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని, దీనివల్ల తప్పుడు సమాచారం ప్రచురితమైందని ఆయన అంగీకరించారు. మార్కెటింగ్ కంటెంట్ కోసం ఒక థర్డ్ పార్టీ సంస్థకు బాధ్యతలు అప్పగించామని, సాధారణంగా తానే స్వయంగా ప్రతి పోస్ట్‌ను తనిఖీ చేస్తానని, అయితే తాను విదేశీ పర్యటనలో ఉండటం వల్ల ఈ పొరపాటు జరిగిందని ఆయన వివరించారు.
తమది మోసపూరిత సంస్థ కాదని, కేవలం సాంకేతిక కారణాలతోనే ఇలా జరిగిందని సంస్థ వివరణ ఇచ్చింది. ఈ పొరపాటు కారణంగా తమ వ్యాపార ప్రతిష్ట దెబ్బతినడంపై స్కాట్ హెన్నెస్సీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌లో వస్తున్న విమర్శలు తమను మానసికంగా కుంగదీస్తున్నాయన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై అతిగా ఆధారపడటం వల్ల కలిగే ప్రమాదాలకు ఈ ఘటన ఒక హెచ్చరికగా నిలిచింది.
ఇది కూడా చదవండి: విద్యార్థుల దాడి.. చూపు కోల్పోయిన బాలుడు


