బీజేపీ ఆఫీసులో కలకలం.. పార్టీ నేతపై మహిళ దాడి | UP woman storms BJP office event slaps leader Video Viral | Sakshi
Sakshi News home page

బీజేపీ ఆఫీసులో కలకలం.. పార్టీ నేతపై మహిళ దాడి

Mar 19 2026 12:33 PM | Updated on Mar 19 2026 1:39 PM

UP woman storms BJP office event slaps leader Video Viral

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ఆఫీసులో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. పార్టీ కార్యవర్గ సభ్యుల అభినందన కార్యక్రమంలో ఓ మహిళ.. బీజేపీ నేతపై దాడి చేసింది. అతడిని చెంపదెబ్బ కొట్టి, అతడి కాలర్‌ పట్టుకుని బయటకు లాగేందుకు ప్రయత్నించింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఖంగుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో బుధవారం బీజేపీ కార్యాలయంలో జరిగిన అభినందన కార్యక్రమం గందరగోళానికి దారితీసింది. నామినేటెడ్ కౌన్సిలర్లు, పార్టీ కార్యవర్గ సభ్యులను అభినందించడానికి పార్టీ నేతలు ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభమైన కొద్దిసేపటికే ఆ మహిళ ప్రాంగణంలోకి ప్రవేశించి, ఆర్థిక వివాదంపై పార్టీ నేతను కార్యకర్తను నిలదీసింది. తనను లక్షల రూపాయలు మోసం చేశాడని ఆరోపించి, పార్టీ కార్యకర్తల సమక్షంలో అతనిపై దాడి చేసింది. చెంపదెబ్బ కొట్టి, అతని కాలర్ పట్టుకుని బయటకు లాగడానికి ప్రయత్నించింది. దీంతో ఆ ప్రాంగణంలో కలకలం రేగింది. దీంతో, అక్కడున్న వారంతా జోక్యం చేసుకోవడానికి పరుగెత్తుకొచ్చారు. ఈ ఘర్షణలో తోపులాటలు, మాటల దూషణలు, చెప్పులతో కొట్టుకోవడం వంటివి జరిగినట్లు సమాచారం.

రూ.4.5 లక్షల మోసం ఆరోపణ..
ఈ సందర్భంగా సదరు మహిళ మాట్లాడుతూ.. తాను ఎల్ఐసీ డిపాజిట్ల పేరుతో సుమారు రూ.4.5 లక్షలు అతడికి అప్పగించానని.. అయితే నిందితుడు ఆ డబ్బును జమ చేయకపోగా దుర్వినియోగం చేశాడని ఆరోపించారు. ఆమె చాలా కాలంగా తన డబ్బును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా ఇవ్వడం లేదని మండిపడ్డారు. బుధవారం ఆమె తన కుమారుడితో కలిసి ఆ కార్యక్రమానికి హాజరైనట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ, వారిద్దరూ వెంటనే డబ్బు తిరిగి చెల్లించాలని పట్టుబట్టారు.

పోలీసుల జోక్యం
సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ వివాదంలో పాల్గొన్న మహిళను, ఇతరులను బీజేపీ కార్యాలయం నుంచి బయటకు తీసుకువెళ్లడంతో, దాదాపు గంటపాటు అంతరాయం తర్వాత కార్యక్రమం తిరిగి ప్రారంభమైంది.

పార్టీ స్పందన
ఆర్థిక వివాదం కారణంగా ఈ ఘర్షణ అకస్మాత్తుగా చెలరేగిందని మాజీ జిల్లా అధ్యక్షుడు, మాజీ అభ్యర్థి సమీర్ త్రిపాఠి తెలిపారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ..‘నామినేటెడ్ కౌన్సిలర్లు మరియు మండల అధ్యక్షుల సన్మాన కార్యక్రమం సందర్భంగా, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఒక వివాదం తలెత్తింది. మాకు ముందే సమాచారం అంది ఉంటే, ఈ పరిస్థితిని నివారించే వాళ్లం. వీరిద్దరూ బీజేపీకి చెందినవారే. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరించడానికి కృషి చేస్తాం’ అని చెప్పుకొచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement