పాత ప్రాజెక్టుల పాటనే వినిపించిన కేంద్రం
సాక్షి, అమరావతి: కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చక్రం తిరగలేదు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన రైల్వే బడ్జెట్‌లోనూ రాష్ట్రానికి ఈసారీ మొండిచెయ్యే మిగిలింది. ఆంధ్రప్రదేశ్‌కు రెడ్ సిగ్నల్ చూపిస్తూ కేంద్ర రైల్వే బడ్జెట్ బైపాస్‌లో వెళ్లిపోయింది. కేంద్రంలో చక్రం తిప్పుతున్నామని గొప్పగా చెప్పుకుంటున్న సీఎం చంద్రబాబు రాష్ట్రానికి కొత్త రైల్వే ప్రాజెక్టుల సాధనలో మాత్రం చేతులెత్తేశారు. ఒక్కటంటే ఒక్క కొత్త ప్రాజెక్టును కూడా రాష్ట్రానికి సాధించలేకపోయారు. రాష్ట్రం నుంచి ఎన్డీఏకు చెందిన 21 మంది లోక్‌సభ సభ్యులు ఉన్నప్పటికీ రైల్వే ప్రాజెక్టుల సాధనలో పూర్తిగా విఫలమయ్యారు.
2026–27 వార్షిక బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రూ10,134 కోట్లు కేటాయించినట్టు రైల్వే శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. గత బడ్జెట్ కంటే ఇది కేవలం రూ.717 కోట్లు మాత్రమే అధికం. పెరిగిన వ్యయంతో పోలిస్తే.. ఆ నిధులు కూడా ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులను నత్తనడకన సాగించేందుకే సరిపోతాయి. అంతేగానీ ప్రాజెక్టులను పూర్తి చేయడంగానీ.. కొత్త ప్రాజెక్టుల పనులు మొదలు పెట్టడంకానీ సాధ్యం కాదనే విషయం స్పష్టమైంది. బడ్జెట్ కేటాయింపుల్లో కనికట్టు చేసేందుకు రైల్వే శాఖ యత్నించింది.
2009–10 వార్షిక బడ్జెట్ కంటే పది రెట్లు అధికంగా నిధులు కేటాయించినట్టు రైల్వే శాఖ చెప్పుకోవడం విశేషం. పదేళ్ల క్రితం నాటి బడ్జెట్ కేటాయింపులతో పోలుస్తూ ప్రస్తుత బడ్జెట్‌లో కొత్త ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపలేదనే విషయాన్ని మరుగుపరిచేందుకు యతి్నంచింది. బడ్జెట్ కేటాయింపులను వివరిస్తూ రైల్వే శాఖ పింక్ బుక్ విడుదల చేస్తేనే కొంత స్పష్టత వస్తుంది.
పాత పాటే.. కొత్తగా పాడి..
చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల విషయంలో రైల్వే శాఖ ఎలాంటి ప్రకటనా చేయలేదు. రాష్ట్రంలో 73 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ రైల్వే స్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి అమృత్ భారత్ పథకం కింద ఆ 73 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు మూడేళ్ల క్రితమే రూ.3,418 కోట్ల వ్యయంతో అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమయ్యాయి.
సూళ్లూరుపేట, రాయనపాడు (విజయవాడ శివారు), కాకినాడ టౌన్, మంగళగిరి, తుని రైల్వేస్టేషన్ల పనులు పూర్తయ్యాయి. ఆ విషయాన్నే రైల్వే శాఖ కనికట్టు చేసేందుకు యత్నించింది. 2014 నుంచి రాష్ట్రంలో 1,700 కి.మీ. మేర రైల్వే ట్రాక్‌లను నిర్మించినట్టు తెలిపింది. కవచ్ ప్రాజె క్టు కింద గతంలోనే ఆమోదించిన 3,137 కి.మీ. పను ల్లో 130 కి.మీ. పనులు పూర్తయ్యాయి. మరో 2,507 కి.మీ. పనులు కొనసాగుతున్నాయని వెల్లడించింది.
కొత్త రైళ్లు లేవు
⇒ రాష్ట్రానికి కొత్త రైళ్ల కేటాయింపులోనూ రెడ్ సిగ్నలే చూపించింది. ఒక్క కొత్త రైలు కూడా వేయలేదు. రాష్ట్రం మీదుగా ఇప్పటికే నాలుగు వందే భారత్ రైళ్లు, 4 అమృత్ భారత్ రైళ్లు నిర్వహిస్తున్న విషయాన్నే రైల్వే శాఖ ప్రస్తావించింది. అంటే కొత్త రైళ్లు కేటాయించడం లేదని తేల్చి చెప్పింది.
ఈ ప్రాజెక్టులు ప్రశ్నార్థకమే
⇒ రాష్ట్రంలో ఇతర కీలక రైల్వే లైన్ల నిర్మాణాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దాంతో నత్తనడకను తలపిస్తున్న ఆ లైన్ల నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందన్నది అగమ్యగోచరంగా మారింది.
⇒ కాకినాడ–పిఠాపురం, మాచర్ల–నల్గొండ, కంభం–ప్రొద్దుటూరు, గూడూరు–దుగరాజపట్నం, కొండపల్లి–కొత్తగూడెం, భద్రాచలం–కొవ్వూరు, జగ్గయ్యపేట–మేళ్లచెరువు రైల్వే లైన్లకు నిధుల కేటాయింపుపై కేంద్రం చిత్తశుద్ధి చూపించలేదు.
⇒అమరావతి రైల్వే లైన్ గురించి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నది సుస్పష్టం. రూ.2,245 కోట్లతో రైల్వే లైన్ నిర్మాణానికి ఆమోదించినట్టు 2024
అక్టోబర్‌లో ప్రకటించినా నిధుల కేటాయింపుపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
⇒ అత్యంత కీలకమైన కడప–బెంగళూరు (255 కి.మీ.) రైల్వే లైన్‌పై కూడా కేంద్ర ప్రభుత్వం మొహం చాటేసింది.
⇒ కోటిపల్లి–నర్సాపురం, నడికుడి–శ్రీకాళహస్తి, డోన్–అంకోలా రైల్వే లైన్ల గురించి కూడా పట్టించుకోలేదు.
కొత్త డిమాండ్లు బేఖాతరు
కొత్త ప్రాజెక్టును కూడా కేంద్రం పరిశీలించలేదు. రాష్ట్ర అభివృద్ధికి కీలకమైనప్పటికీ ప్రతిపాదనల దశలోనే మగ్గిపోవాల్సిన అనివార్యత ఏర్పడిన ప్రాజెక్టులు ఇవీ..
⇒ విజయవాడ–ఖరగ్‌పూర్, విజయవాడ–నాగ్‌పూర్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు
⇒ తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ ఏర్పాటు
⇒ విజయవాడ–గూడూరు మధ్య నాలుగో లైన్ నిర్మాణం
⇒ కడప–బెంగళూరు రైల్వేలైన్ అలైన్‌మెంట్ మార్పు


