ఇక యూట్యూబర్లకు పండుగే! | Budget 2026 announces 15,000 new labs for creators | Sakshi
Sakshi News home page

ఇక యూట్యూబర్లకు పండుగే!

Feb 2 2026 7:32 AM | Updated on Feb 2 2026 8:32 AM

Budget 2026 announces 15,000 new labs for creators

కేంద్రం యూట్యూబర్లకు పండుగలాంటి వార్త చెప్పింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 బడ్జెట్‌లో దేశీయ క్రియేటివ్ రంగాన్ని ఉ‍న్నత శిఖరాలకు చేర్చేలా విప్లవాత్మక నిర్ణయాలు ప్రకటించారు. దేశవ్యాప్తంగా 15,000 సెకండరీ పాఠశాలల్లో ప్రత్యేక కంటెంట్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (ఐఐసీటీ) ఆధ్వర్యంలో ఇవి పనిచేస్తాయి. ప్రారంభ దశలో 1,500 పాఠశాలలు, 500 కళాశాలల్లో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్  రంగాలలో శిక్షణ అందించనున్నారు.

అంతర్జాతీయ స్థాయి ఇంటర్న్‌షిప్‌లు
అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్‌ కంటెంట్ భారతీయ కంటెంట్ క్రియేటర్లను గ్లోబల్ సెలబ్రిటీలుగా మార్చేందుకు గూగుల్, యూట్యూబ్, మెటా, అడోబ్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా వంటి టెక్ దిగ్గజాలతో ఐఐసీటీ కీలక ఒప్పందాలు చేసుకుంది. దీనివల్ల క్రియేటర్లకు కేవలం వ్యూస్ మాత్రమే కాకుండా, అంతర్జాతీయ స్థాయి ఇంటర్న్‌షిప్‌లు, స్కాలర్‌షిప్‌లు, మెంటర్షిప్ లభించనున్నాయి. దక్షిణ కొరియా మాదిరిగా భారత్‌ను గ్లోబల్ కంటెంట్ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా వేవ్‌ఎక్స్ (WaveX) ఇన్‌క్యుబేటర్ ద్వారా స్టార్టప్‌లకు ప్రపంచస్థాయి శిక్షణ ఇవ్వనున్నారు.

సరికొత్త మౌలిక సదుపాయాలు
సృజనాత్మక రంగంలో పెరుగుతున్న డిమాండ్‌ను అందుకునేందుకు ప్రభుత్వం  కొత్తగా ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్’ (ఎన్‌ఐడీ)ను ఏర్పాటు చేయనుంది. ఇది ‘ఛాలెంజ్ రూట్’ ద్వారా  ఏర్పాటు కానుంది. దీనితో పాటు పారిశ్రామిక కారిడార్ల సమీపంలో ఐదు యూనివర్సిటీ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇక్కడ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు ఒకే చోట ఉండటం వల్ల క్రియేటివ్ రంగంలో పరిశోధనలకు పెద్దపీట వేసినట్లవుతుంది.

పెరగనున్న ఉపాధి అవకాశాలు
ఈ బడ్జెట్ ప్రతిపాదనలతో యూట్యూబర్లు, డిజిటల్ క్రియేటర్లకు అద్భుతమైన అవకాశాలు రానున్నాయి. ప్రభుత్వ ల్యాబ్‌లలో హై-ఎండ్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్, టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో గ్రామీణ ప్రాంత క్రియేటర్లకు కూడా ప్రొఫెషనల్ క్వాలిటీ కంటెంట్ రూపొందించే అవకాశం దక్కుతుంది. అలాగే టెక్ దిగ్గజాలతో కుదిరిన ఒప్పందాల వల్ల తమ ఛానల్స్‌ను మరింతగా మానిటైజ్ చేసుకోవడానికి, మెరుగైన అల్గారిథమ్ సపోర్ట్ పొందడానికి మార్గం సుగమం కానుంది.

చిన్న పట్టణాల్లోని క్రియేటర్లకు వరం
సాధారణంగా ఒక యూట్యూబర్ హై-క్వాలిటీ వీడియోలు చేయాలంటే లక్షల రూపాయల విలువైన ఎడిటింగ్ సిస్టమ్స్, కెమెరాలు, సాఫ్ట్‌వేర్ అవసరం అవుతుంది. ఐఐసీటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే వేల కంటెంట్ ల్యాబ్‌లు ఈ సమస్యను పరిష్కరిస్తాయి. ఇక్కడ క్రియేటర్లకు ఏఐ టూల్స్, హై-ఎండ్ గ్రాఫిక్ కార్డ్స్ ఉన్న కంప్యూటర్లు, లైసెన్స్‌డ్ సాఫ్ట్‌వేర్ అందుబాటులో ఉంటుంది. ఇది ముఖ్యంగా చిన్న పట్టణాల్లోని క్రియేటర్లకు వరంగా మారనుంది.

గౌరవప్రదమైన వృత్తిగా..
గూగుల్, యూట్యూబ్, మెటా వంటి సంస్థలతో ఐఐసీటీ ఒప్పందం చేసుకోవడంతో వల్ల యూట్యూబర్లకు కేవలం ‘వ్యూస్’ ఎలా పెంచుకోవాలో మాత్రమే కాకుండా, యాడ్ రెవెన్యూను ఎలా పెంచుకోవాలి?, కాపీరైట్ ఇష్యూస్ లేకుండా ఎలా ఉండాలో నేరుగా ఆయా సంస్థల ప్రతినిధుల నుండే శిక్షణ అందనుంది. అలాగే లైవ్ స్ట్రీమింగ్ చేసే గేమర్లకు కొత్త టెక్నాలజీపై మరింత అవగాహన పెరగనుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ‘కంటెంట్ క్రియేషన్‌’ను ఒక గౌరవప్రదమైన వృత్తిగా గుర్తించేలా చర్యలు తీసుకుంటున్నది. 

ఇది కూడా చదవండి: స్కూల్‌ నుంచి రిటైర్మెంట్‌ వరకూ.. ‘ముగ్గురు మిత్రులు’

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement