లోక్‌సభ: దేశ భద్రతపై రాహుల్ ఆరోపణలు.. తిప్పికొట్టిన అమిత్‌ షా | Both Houses to take up motion of thanks on President Murmu's address | Sakshi
Sakshi News home page

లోక్‌సభ: దేశ భద్రతపై రాహుల్ ఆరోపణలు.. తిప్పికొట్టిన అమిత్‌ షా

Feb 2 2026 11:13 AM | Updated on Feb 2 2026 1:58 PM

Both Houses to take up motion of thanks on President Murmu's address

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నాలుగో రోజైన నేడు (సోమవారం) ఉభయ సభలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను కొనసాగిస్తున్నాయి. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ లోక్‌సభలో ఈ చర్చను ప్రారంభించగా, రాజ్యసభలో బీజేపీ ఎంపీ సి సదానందన్ మాస్టర్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ 2026పై చర్చ సందర్భంగా లోక్‌సభలో పెను దుమారం రేగింది. కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. మాజీ సైన్యాధిపతి ఎంఎం నరవణే రాసిన జ్ఞాపకాలలోని కొన్ని ముఖ్యాంశాలను ఉటంకించారు. ఒక మ్యాగజైన్ కథనంలోని ప్రతులను సభలో ప్రదర్శిస్తూ, ప్రభుత్వం దేశ భద్రత విషయంలో అనుసరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. 

తాను ప్రస్తావిస్తున్న అంశాలు విశ్వసనీయమైనవని, దేశ భద్రతకు సంబంధించిన కీలక అంశాలు కాబట్టే వాటిని సభ దృష్టికి తీసుకువస్తున్నానని రాహుల్ గాంధీ గట్టిగా సమర్థించుకున్నారు. అమిత్ షా సైతం జోక్యం చేసుకుంటూ ఆ సమాచార విశ్వసనీయతపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ చర్చను వ్యక్తిగత, రాజకీయ విమర్శల వైపు మళ్లిస్తూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా దాదాపు 95 ఎన్నికల్లో పరాజయం పాలైందని ఆయన ఎద్దేవా చేశారు. ఇన్ని ఓటములు చవిచూసినా వారికి ప్రభుత్వ ఆర్థిక విధానాలను, పరిపాలనను విమర్శించే నైతిక హక్కు లేదని ధ్వజమెత్తారు. బడ్జెట్‌ను నిస్సారమైనదని విమర్శిస్తున్న విపక్షాలకు.. ప్రజలు ప్రధాని మోదీపై ఉంచిన నమ్మకం కనిపించడం లేదని బీజేపీ నేతలు విమర్శించారు.

మరోవైపు బడ్జెట్ 2026 సామాన్యులను, రైతులను విస్మరించిందని విపక్షాలు ఆరోపించాయి. సీపీఐ(ఎం) ఎంపీ అమ్రారం మాట్లాడుతూ ఈ బడ్జెట్ కేవలం అంబానీ, అదానీ వంటి బడా కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసమే రూపొందించారని, రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేశారని విమర్శించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ఈ బడ్జెట్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ బెంగాల్‌కు ఏమీ దక్కలేదని మండిపడ్డారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి వాస్తవ సమస్యలను పరిష్కరించడంలో ఈ బడ్జెట్ విఫలమైందని కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ సహా పలువురు నేతలు ఆరోపించారు.

పార్లమెంటరీ వ్యవహారాల కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగే చర్చకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 4న సమాధానం ఇస్తారని తెలిపారు. సర్బానంద సోనోవాల్ ప్రారంభించే ఈ చర్చలో బీజేపీ నుండి  ఐదుగురు ప్రముఖ వక్తలు పాల్గొంటారని చెప్పారు. కేంద్ర బడ్జెట్‌లోని సానుకూల అంశాలను గుర్తించడానికి నిరాకరిస్తూ, ప్రతిపక్షాలు  ప్రతికూల మనస్తత్వాన్ని ప్రదర్శిస్తున్నాయని ఆయన విమర్శించారు. ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో, సోమవారం నుంచి ఈ కీలక చర్చ ప్రారంభమైంది. గడిచిన జనవరి 28న ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ముర్ము.. జాతీయ భద్రత, 'వికసిత్ భారత్' లక్ష్యం, ‘స్వదేశీ' ఉద్యమం వంటి అంశాలపై ఎంపీలందరూ ఏకతాటిపై నిలబడాలని పిలుపునిచ్చారు.

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ ధన్యవాద తీర్మానంపై జరగనున్న చర్చలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఆయనతో పాటు కాంగ్రెస్ ఎంపీలు తారిక్ అన్వర్, అమరీందర్ రాజా వారింగ్, ఆంటో ఆంటోనీ, జోతిమణి కూడా ఈ చర్చలో తమ గళాన్ని వినిపించనున్నారు. ఈ చర్చకు సంబంధించి లోక్‌సభలో మొత్తం 18 గంటల సమయాన్ని కేటాయించారు. ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో మూడు రోజుల పాటు ఈ చర్చ కొనసాగనుంది. విపక్షాల విమర్శలు, ప్రశ్నలకు ఫిబ్రవరి 11న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చే అవకాశం ఉంది.

మరోవైపు, కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన అంతర్జాతీయ నివేదికలలో ప్రధాని నరేంద్ర మోదీ పేరు ప్రస్తావనకు వచ్చిందని ఆరోపిస్తూ, దీనిపై తక్షణమే చర్చ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అంతర్జాతీయ స్థాయిలో వెలువడిన ఈ నివేదికలు అత్యంత తీవ్రమైనవని, దీనిపై సభలో సమగ్రంగా చర్చించాలని ఆయన తన నోటీసులో పేర్కొన్నారు. ఈ అంశం సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చకు దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి.

 ఇది కూడా చదవండి: ఏఐ ‘దొంగ’ ఫొటోలు.. కంగుతిన్న పర్యాటకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement