- 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్
- సుదీర్ఘ ఇన్నింగ్స్‌ను ఆరంభించిన మోదీ సర్కారు
- 2026 బడ్జెట్లో ఇన్‌ఫ్రా, తయారీ రంగాలపై ఫోకస్
- 7 హైస్పీడ్ రైల్ కారిడార్లు, 4 రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్ హబ్‌లు
- ఫైనాన్షియల్ మార్కెట్లకు సంబంధించి పలు నిర్ణయాలు
- ఫ్యూచర్స్, ఆప్షన్లపై లావాదేవీల పన్ను భారీగా పెంపు
- భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు
కొత్త ఆదాయపు పన్ను.. జీఎస్‌టీ మార్పుల వంటి అనూహ్య నిర్ణయాలు చూస్తున్న వీక్షకులంతా... బడ్జెట్ కూడా ఈ వారంలో మొదలయ్యే టి–20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లా ఉంటుందనుకున్నారు. తొలి బంతి నుంచే సిక్సర్ల వర్షాన్ని ఆశించారు. అభిషేక్ శర్మ స్థాయి పవర్‌ప్లేకి రెడీ అయిపోయారు.
కానీ... కెప్టెన్ మోదీ తమది టి–20 ధనాధన్ కాదని.. సుదీర్ఘ టెస్ట్ ఇన్నింగ్స్‌తోనే అనుకున్న వృద్ధిని సాధిస్తామని సంకేతాలిచ్చారు. తమ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను ఫుల్‌గార్డ్‌తో పంపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతావనిని సాధిస్తామంటూ రెండు దశాబ్దాల తరువాతి లక్ష్యాన్ని ఆవిష్కరించారు.
ఆ దిశగా టెస్ట్ ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టారు. వీరబాదుడు లేదు.. రిస్కీ షాట్లు లేనే లేవు. బౌండరీలు, సిక్సర్లు అస్సలే లేవు. ప్రతి బంతినీ పద్ధతిగా ఆడుతూ సింగిల్స్‌కు పరిమితమయ్యారు. సునీల్ గవాస్కర్‌ను మరిపించారు. కళ్లు చెదిరే షాట్లు అక్కర్లేదు... క్రీజ్‌లో ఉంటే చాలనే స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ద్వారా కెప్టెన్ నరేంద్ర మోదీ చెప్పింది ఒక్కటే.. ‘నో హిట్టింగ్.. ఓన్లీ డిఫెన్స్... ఇది లాంగ్‌టర్మ్ ఇన్నింగ్స్’’.
ఇన్‌కమ్‌ట్యాక్స్ పిచ్ ఏమాత్రం మారలేదు. అవే శ్లాబ్స్. కాకపోతే టీసీఎస్, టీడీఎస్ విషయాల్లో చిన్నచిన్న ఉపశమనాలిచ్చారు. ఎన్నారైలు, ఫారిన్ అసెట్స్‌కు సంబంధించి పాత తప్పులు దిద్దుకోవటానికి కొన్ని ఫ్రీహిట్స్ ఇచ్చారు. వన్‌టైమ్ డిస్‌క్లోజర్ అనేది ఓ వారి్నంగ్. అంటే... నోబాల్‌గా ప్రకటించిన క్లీన్‌బౌల్డ్ అన్నమాట. 7 రంగాల్లో తయారీ సామర్థ్యాన్ని పెంచటం... 7 కొత్త హైస్పీడ్ రైల్ కారిడార్లు అంటూ మోదీ ‘7’వ నంబర్లో వచ్చే ధోనీ, కపిల్ వంటి కెప్టెన్ల స్థాయిని కళ్లకు కట్టారు.
ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0, బయోఫార్మా శక్తి, కెమికల్ పార్కులు, రేర్ ఎర్త్ కారిడార్లు, కంటైనర్ తయారీ, ఎల్రక్టానిక్ కాంపోనెంట్ల తయారీ వంటి పథకాలన్నీ మున్ముందు స్కోర్‌బోర్డును ముందుకు తీసుకెళ్లబోయే షాట్లు. ఇన్ని ఒత్తిళ్ల నడుమ... ద్రవ్య లోటును 4.3 శాతానికే పరిమితం చేస్తామంటూ... సింగిల్స్‌తోనైనా రన్‌రేటు మాత్రం పడిపోకుండా చూసుకున్నారు.
ఇక స్టాక్ మార్కెట్ల విషయానికొస్తే... ఎస్‌టీటీ రూపంలో మోదీ ప్రభుత్వం ఓ బౌన్సర్ వేసింది. ఆదాయ నష్టాన్ని పూడ్చుకోవాలి కనక స్టాక్ మార్కెట్లలో ఫ్యూచర్లపై సెక్యూరిటీ లావాదేవీల పన్నును 150 శాతం, ఆప్షన్లపై 50 శాతం పెంచారు. మార్కెట్లకిది నచ్చలేదు. బంతిని బలంగానే కొట్టాయి. ప్రస్తుతానికైతే బంతి గాల్లోకి లేచి మార్కెట్లు పడ్డాయి. అది క్యాచో కాదో మున్ముందు తెలుస్తుంది.
ఇవీ చదవండి:
రూ.53.5 లక్షల కోట్ల బడ్జెట్


