breaking news
New Income tax act 2025
-
కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025: అమల్లోకి ఎప్పుడంటే?
ఒకప్పుడు స్వాతంత్రం రాక ముందు ఆదాయపు పన్ను చట్టం 1922, స్వాతంత్రం వచ్చిన తరువాత చట్టం 1961 అమలులోకి వచ్చింది. మధ్యలో ఎన్నో మార్పులు, చేర్పులు, కూర్పులు, నాలుగైదు సార్లు పెనుమార్పులు. తీసివేతలు, కలిపివేతలు, 65 సార్లు 4,000 మార్పులు చేశారు. ఈ సంవత్సరం కొత్త చట్టాన్ని అమల్లోకి తెస్తున్నారు.ఆదాయపు పన్ను చట్టం 2025.. 47 చాప్టర్లను 23కు కుదించారు. 819 సెక్షన్లను 536కి తగ్గించారు. ఇప్పుడు షెడ్యూళ్లు లేవు. ఇప్పుడు వాటి సంఖ్య 16. ప్రస్తుతం అంకెలకు ఇంగ్లీషు అక్షరాలు తగిలించి.. మూడు అక్షరాల రైలుబండిలా పెట్టి వ్యవహారం నడుపుతున్నారు. ఇకపై అలా ఉండదు. కేవలం నంబర్లే... సెక్షన్ 10లో ఉండే అన్ని మినహాయింపులను షెడ్యూల్స్‌లో అమర్చారు. క్లారిటీ కోసం కొన్ని టేబుల్స్, ఫార్మూలాలు ప్రవేశపెట్టారు. అదేదో సినిమా డైలాగు గుర్తొస్తోంది. ‘అయితే నాకేంటి’? ఈ మార్పుల వలన మనకు ఒరిగేది ఏమిటి? 1.4.2026 నుంచి అమల్లోకి వచ్చే ఈ చట్టం ప్రత్యేకతలు ఏమిటంటే...?సరళీకృతంగా ఉంటుంది. వాడుకలో లేనివాటిని తీసివేశారుకొన్ని అంశాలను నెంబరింగ్ ఇచ్చి క్రమబద్ధీకరించారు. కొన్ని అంశాలను పునర్నిర్మాణం చేశారు. రాబోయే పదం ‘‘పన్ను సంవత్సరం’’. ప్రస్తుత అకౌటింగ్ సంవత్సరం, ఫైనాన్సియల్ సంవత్సరం, ఆదాయపు సంవత్సరం, గత సంవత్సరం, ఇవన్నీ మనకు అర్ధం అయ్యేలా చెప్పాలంటే మనం ఆదాయం సంపాదించిన సంవత్సరం. ఈ ఆదాయాన్ని సంవత్సరం తరువాత అస్సెస్సుమెంట్ సంవత్సరం అంటే ఆ తరువాత సంవత్సరంలో అస్సెస్సు చేస్తారు. కాబట్టి ఈ సంవత్సరం అస్సెస్సుమెంట్ సంవత్సరం అని అంటారు.రామాయణం అంతా విని రాముడికి సీత ఏమి అవుతుందని అడిగినట్లు... 64 ఏళ్లు దాటినా టాక్స్ ప్లేయర్‌కి ఈ రెండు సంవత్సరాల మధ్య తేడా తెలియదు. కన్ఫ్యూజన్ పోలేదు. ఎన్నో పొరపాట్లు జరిగేవి. ఇన్‌కం టాక్స్ చెల్లించేటప్పుడు చలాన్లో సంవత్సరానికి సంబంధించిన కాలమ్ నింపేటప్పుడు తికమక అయ్యేవారు. ఇకపై తికమక అవసరం ఉండదు. 1.4.2026 నుంచి నుంచి ఒకే పదం వాడుకలోకి వస్తుంది. అదే ‘‘పన్ను సంవత్సరం’’. టీడీఎస్‌కి సంబంధించిన అంశాలను చాలా పద్ధతి ప్రకారం ఎటువంటి తికమక రాకుండా చేశారు. ఒక సెక్షన్ ద్వారా జీతాలకు సంబంధించిన అంశాలు పొందుబరిచారు. ఒకే ఒక సెక్షన్ ద్వారా మిగతా అన్ని టీడీయస్ అంశాలు పొందుబరిచారు. ఈ పట్టిక సమగ్రం.., సంపూర్ణం. క్రమసంఖ్య ఏ ఆదాయం మీద చేయాలి? ఎవరికి వర్తిస్తుంది? పరిమితులు... ఇలా ఉంటాయి వివరాలు... రెసిడెంట్లకు, నాన్ రెసిడెంట్లకు, టీసీఎస్.. ఎవరికి అక్కర్లేదు.? ఇలా అన్నీ టేబుల్స్ ద్వారా చక్కగా వివరించారు. పాతకాలపు పదజాలానికి స్వస్తి పలికారు. పాతవాటికి మంగళం పలికి, ప్రపంచంలో ఆచరించే మంచి పద్ధతులకు చట్టంలో చోటిచ్చారు.వర్చువల్, డిజిటల్ ఆస్తులను నిర్వచించారు. క్రిప్టో కరెన్సీ, టోకనైజ్డ్ ఆస్తులు, టెక్నాలజీ ద్వారా ఏర్పడే హక్కులు మొదలైనవి వివరించారు. వివాదాలకు ఆస్కారం లేకుండా పరిష్కారం చేస్తారు. టెక్నాలజీని ఆసరా తీసుకొని అధికార్లకువిస్తృత అధికారాలు కల్పించారు. ఇన్నాళ్లు సెర్చ్‌లు అంటే ఇంటినో, ఆఫీసునో, ఫిజికల్ ఏరియా మాత్రమే ఉండేవి. ఇక నుంచి మీ ఈ–మెయిల్స్, క్లౌడ్ సర్వర్లు, సోషల్ మీడియా అకౌంట్లు, వెబ్సైట్లు అన్నింట్లోనూ చొరబడతారు ఎగబడతారు. ఇకపై బుకాయించలేము. ఈ నగదు నాది కాదు మా మామగారిది అనలేము. అధికారులకు విస్తృత సమాచారం ఇవ్వడం వల్ల మీకు సంబంధించిన సమాచారం వారి చెంతనే ఉంటుంది. కాబట్టి కొత్త చట్టంలోని అంశాలకు అనుగుణంగా నడుచుకుందాం. చట్ట ప్రకారం మీ విధులను సక్రమంగా నిర్వర్తించండి. ఫిబ్రవరిలో బడ్జెటుకు కసరత్తు జరుగుతోంది. అందులో శ్లాబులు, రేట్లు మారవచ్చు. మారకపోవచ్చు. ఈ రాబోయే మార్పులు తప్ప, మిగతా అంతా కొత్త చట్టం మనకు అందుబాటులో ఉంటుంది.కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి & కె.వి.ఎన్ లావణ్య -
Income tax: కొత్త చట్టం వస్తోంది కానీ...
ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు.. ఆదాయపన్ను చట్టం 1922, ఆ తరువాత చట్టం 1961 ... ఇప్పుడు కొత్తం చట్టం 2025 పేరుతో వస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో రాష్ట్రపతి ఆమోదముద్ర పొందిన ఈ చట్టం 1.4.2026 నుంచి అమల్లోకి రానుంది. కొత్త చట్టం అత్యంత సరళీకృతంగా ఉంది. నిడివి, సెక్షన్లు తగ్గించారు. ‘పన్ను సంవత్సరం’ అనే కొత్త నిర్వచనంతో వర్చువల్ డిజిటల్ ఆస్తులను కూడా కలుపుతూ, సెర్చ్, సీజర్ అధికారాలను విస్తృత పరుస్తూ, ఎన్నో సంస్కరణలతో రూపుదిద్దుకొని ఇది ముస్తాబయింది.ఈ సంవత్సరంలో అన్నీ పూర్తయినా, అమలు మాత్రం 1.4.2026 నుండే ఉంటుంది. అయితే 2025 బడ్జెట్లో తెచ్చిన మార్పులు 2025–26 ఆర్థిక సంవత్సరంలో వర్తిస్తాయి. 2026లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కొన్ని మార్పులు రావడం సహజం. ముఖ్యంగా బేసిక్ లిమిట్, మినహాయింపులు, శ్లాబులు, రేట్లు, ఇవి రావచ్చు. లేదా రాకపోవచ్చు. వచ్చేవి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయి. వాటి గురించి ఇప్పుడు ఆలోచించడం అనవసరం. కొత్త విధానాన్ని ప్రతిపాదించినప్పటి నుంచే ప్రభుత్వం దాన్ని సమర్థిస్తూ, వెనకేసుకొస్తోంది. మధ్య తరగతి వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని శ్లాబులు, రేట్లు తెచ్చారు. దీని ప్రకారం రూ.12,00,000కు పన్ను ఉండదు. శ్లాబులు మార్చారు. రేట్లు మారాయి.రూ.12,00,000 ఆదాయాల విషయంలో శ్లాబులను మార్చకుండా రిబేటును 87 అ ప్రకారం రూ.60వేల వరకు పెంచి ఎంతో ఉపశమనం ఇచ్చారు. నికర ఆదాయం పెరిగితే వైకుంఠపాళి ఆటలో పాము నోట్లో పడినట్లే. శ్లాబుల వారీగా పన్ను కట్టాల్సి వస్తోంది. సాండర్డ్ డిడక్షన్ని కొత్త విధానంలో రూ.75వేలకు పెంచారు.ఈ ఆర్థిక సంవత్సరం నుంచి వ్యక్తులు రెండు సొంత ఇళ్ల మీద పన్ను కట్టాల్సిన అవసరం లేదు. గతంలో ఒక ఇంటికే ఉన్నా.., ఇప్పుడు మినహాయింపుని రెండో ఇంటికీ కల్పించారు.కొత్త విధానంలో ఫ్యామిలీ పెన్షను మినహాయింపుని రూ.25వేలకు పెంచారు. గతంలో ఇది రూ.13,000గా ఉండేది. ఈ విధంగా కొత్త విధానాన్ని సమర్ధిస్తూ.., ఉపశమనం ఇచ్చారు. కొత్త విధానం కొంగు బంగారం అయ్యింది. ఆర్థికపరంగా ఎందరో చిన్న చిన్న అస్సెస్సీలకు పెద్ద రిలీఫ్ ఇచ్చారు. టాక్స్ ప్లానింగ్ పేరుతో ఎటువంటి అక్రమ మార్గాలకు పాల్పడకుండా రాచమార్గంలో రాజహంసలాగా రాజీ పడకుండా, రాంగ్ రూటు వెళ్లకుండా రైట్వే ఇది. యూలిప్ ద్వారా వచ్చే మొత్తాలను క్యాపిటల్ గెయిన్ పరిధిలోకి తీసుకొచ్చారు. మొదటి రూ.25వేలకు మినహాయింపు ఉంది. టీడీఎస్ (టాక్స్ డిడక్షన్ సోర్స్) వర్తించే విషయాల్లో పరిమితిని పెంచారు. దానివల్ల కొంతమంది టీడీఎస్‌కి గురికారు. విదేశాల చెల్లింపుల్లో వర్తించే టీసీఎస్(టాక్స్ కలెక్టెడ్ సోర్స్) విషయంలో పరిమితి పెంచారు.కొన్ని వస్తువుల అమ్మకపు విషయంలో పరిమితి రూ.50,00,000 ఇక నుంచి లేదు.అప్డేటెడ్ రిటర్నులను ఫైల్ చేసుకోవడానికి 24 నెలల నుంచి 48 నెలలకు వెనక్కి వెళ్లవచ్చు. ఇది మంచి అవకాశం. అయితే షరతులకు లోబడి మాత్రమే.రిటర్నులు వేయనివారిని నాన్ఫైలర్స్ అంటారు. గతంలో ఎక్కువ టీడీఎస్/టీసీఎస్ రేట్లు వేసేవారు. ఇప్పుడు ఆ వివక్ష లేదు.భాగస్వాములకు చెల్లించే చెల్లింపుల మీద టీడీఎస్ ప్రవేశపెట్టారు. నాన్ రెసిడెంట్లకి సంబంధించి కొన్ని డిజిటల్ వ్యవహారాల మీద వేసే పన్ను 6% ఎత్తివేశారు. ఈ మార్పులను పెట్టుకొని టాక్స్ ప్లానింగ్ వైపు అడుగులు వేయండి.


