బైక్ నుంచి బంగ్లా వరకు ఒకటే రూల్
హైవాల్యూ డీల్ అయితేనే పాన్...
కొత్త రూల్స్‌తో రిలీఫ్ సీన్
హైదరాబాద్‌కి మెట్రో హోదా. ఇక హెచ్‌ఆర్‌ఏలో బెనిఫిట్
ప్రాపర్టీ ధర 20 లక్షలు మించినప్పుడే పాన్
కారు ధర రూ.5 లక్షలు మించితేనే
నగదు డిపాజిట్, ఉపసంహరణలు రూ.10 లక్షలు దాటితేనే
ముసాయిదా నిబంధనలు వెల్లడి
మార్చిలో నోటిఫికేషన్
పాన్ రూల్స్ రీలోడెడ్
న్యూఢిల్లీ: ప్రాపర్టీ, వాహన కొనుగోళ్లు, బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు, ఉపసంహరణలకు ఇకపై ప్రతిసారీ పాన్ సమర్పించాల్సిన అవసరం రాదు! ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఆదాయపన్ను చట్టం కింద పాన్ విషయమై పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట దక్కనుంది. ఇందుకు సంబంధించి ముసాయిదా నిబంధనలను ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) సోమవారం విడుదల చేసింది. సంప్రదింపుల అనంతరం తుది నిబంధనలను మార్చి మొదటి వారంలో సీబీడీటీ నోటిఫై చేస్తుంది. క్రిప్టో ఎక్సే్ఛంజ్‌లు ఆదాయపన్ను శాఖతో సమాచారం పంచుకోవడాన్ని తప్పనిసరి కానుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ఆమోదనీయమైన ఎలక్ట్రానిక్ చెల్లింపుల మాధ్యమంగా మారనుంది.
కొత్త నిబంధనలు ఇవే..
→ ప్రస్తుతం బ్యాంకుల్లో ఒకరోజులో రూ.50,000కు మించి నగదు డిపాజిట్ చేస్తుంటే పాన్ కాపీ ఇవ్వడం తప్పనిసరి. అలాగే, ఆర్థిక సంవత్సరం మొత్తం మీద జమలు, ఉపసంహరణలు రూ.20 లక్షలు మించినప్పుడు కూడా ఇవ్వాల్సి వచ్చేది. కొత్త నిబంధనల ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు డిపాజిట్, ఉపసంహరణల మొత్తం రూ.10 లక్షలకు మించినప్పుడే శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) ఇస్తే సరిపోతుంది. ఒక వ్యక్తికి ఒకటికి మించిన ఖాతాలున్నా సరే.. అన్నింటికీ ఉమ్మడిగా రూ.10 లక్షల పరిమితే వర్తిస్తుంది.
→ ప్రాపర్టీ (ఇల్లు లేదా భూమి) కొనుగోలు లేదా విక్రయం లేదా బహుమతిగా ఇవ్వడం లేదంటే ఉమ్మడిగా అభివృద్ధి చేసేందుకు చేసుకునే ఒప్పందం విలువ రూ.10 లక్షలకు మించితే ప్రస్తుతం పాన్ ఇవ్వాల్సి వస్తోంది. ఇకపై (ఏప్రిల్ 1 నుంచి) రూ.20 లక్షలకు మించినప్పుడే ఈ నిబంధన అమలవుతుంది.
→ వాహనం కొనుగోలు విలువ రూ.5లక్షల్లోపు ఉంటే ఇకపై పాన్ అవసరం పడదు. కొనుగోలు ధర రూ.5లక్షలకు మించినప్పుడే పాన్ సమర్పించాల్సి ఉంటుంది. అన్ని వాహనాలకూ ఇకపై ఇదే అమలుకానుంది. ప్రస్తుతం ద్విచక్ర వాహన కొనుగోళ్లకు పాన్ నుంచి మినహాయింపు ఉంది. ఇతర అన్ని వాహనాల కొనుగోళ్ల సమయంలో ధరతో సంబంధం లేకుండా ప్రస్తుతం పాన్ ఇవ్వాలన్న నిబంధన అమల్లో ఉంది.
→ హోటల్/రెస్టారెంట్ బిల్లు, కన్వెన్షన్ సెంటర్లు లేదా బాంక్వెట్ హాళ్ల (వేడుకల కేంద్రాలు)కు చేసే చెల్లింపులు రూ.లక్షకు మించితే ఇక మీదట పాన్ తప్పనిసరి. హోటల్/రెస్టారెంట్ బిల్లు రూ.50వేలు మించినప్పుడే ప్రస్తుతం పాన్ ఇవ్వాల్సి వస్తోంది.
→ ఇకపై జీవిత బీమా పాలసీ కొనుగోలు సమయంలో పాన్ ఇవ్వడం తప్పనిసరి. ప్రస్తుతం వార్షిక ప్రీమియం రూ.50,000 మించిన పాలసీలకే ఇది అమలవుతోంది.
→ ప్రథమ శ్రేణి మెట్రోలుగా హైదరాబాద్, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్‌లను సైతం గుర్తించింది. ఈ నగరాల్లో నివసించే వారికి ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ)పై మినహాయింపుల పరిమితి రూ.40వేల నుంచి రూ.50వేలకు పెరగనుంది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలకే ఈ గుర్తింపు ఉంది.
→ అధికారిక వాహనాలు, ఉద్యోగులకు సంస్థలు సమకూర్చే భోజనాలకు సైతం పన్ను మినహాయింపుల పరిమితులు పెరగనున్నాయి. వాహనం కోసం ప్రతి నెలా రూ.8,000, ప్రతి భోజనం రూ.200కు పన్ను ఉండదు.
→ కొత్త ఆదాయపన్ను చట్టం అమల్లోకి వచి్చన తర్వాత పన్ను రిటర్నుల దాఖలు కూడా సులభతరం కానుంది.
→ ప్రస్తుతం రూ.2 లక్షలకు మించి చేసే బంగారం కొనుగోళ్లకు (ఆభరణాలు, కాయిన్లు, ఇతర రూపాల్లోని బంగారం) పాన్ తప్పనిసరి. దీనితోపాటు జాబితాలో లేని ఇతర అన్ని లావాదేవీలకు ప్రస్తుత నిబంధనలే కొత్త చట్టం కింద అమలు కానున్నాయి.


