33 ఏళ్ల క్రితం సాధారణ వెబ్‌ అడ్రస్‌గా రిజిస్టర్‌.. ఇప్పుడు రూ. 600 కోట్లు! | AI.com Domain Sold For Record Domain Deal 70 Million Dollars, Kris Marszalek Mega Investment In Artificial Intelligence | Sakshi
Sakshi News home page

33 ఏళ్ల క్రితం సాధారణ వెబ్‌ అడ్రస్‌గా రిజిస్టర్‌.. ఇప్పుడు రూ. 600 కోట్లు!

Feb 9 2026 9:35 PM | Updated on Feb 10 2026 11:13 AM

Kris Marszalek Buys AI.com for 70 Million dollars in Record Domain Deal

పేరులో నేముంది అని అనుకుంటే పొరపాటు. ఒక చిన్న పదం. కేవలం రెండే రెండక్షరాలు. కానీ దాని విలువ భారత కరెన్సీలో అక్షరాల 600 కోట్లు. ఆ రెండక్షరాల పదం ఏంటి? దానిని రూ.600కోట్లకు కొనుగోలు చేయాల్సిన అవసరం ఏంటి? దాని కథా కమా మిషు ఏంటో తెలుసుకుందాం పదండి.

ఇంటర్నెట్‌లో డొమైన్‌ అడ్రస్‌ చాలా విలువైంది. వెబ్‌సైట్‌ డొమైన ట్రెండింగ్‌లో ఉన్నా డిమాండ్‌ ఉండే బిజినెస్‌కు చెందినదైనా దాని ధర కోట్లు పలుకుతుంది. ఎంత ధరపెట్టైనా సరే దాన్ని కొనుగోలు చేస్తారు. అలాంటి వెబ్‌సైట్‌ డొమైన్‌ కళ్లు చెదిరే ధరకు అమ్ముడుపోయింది. క్రిప్టో.కామ్‌ వ్యవస్థాపకుడు  క్రిస్ మార్జాలెక్ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ డొమైన్‌ ఏఐ డాట్‌ కామ్‌ను 70మిలియన్‌ డాలర్లు వెచ్చించి మరీ కొనుగోలు చేశారు. అంటే భారత కరెన్సీలో అక్షరాల రూ.600కోట్లు.ఇదే అత్యధికర ధర పలికిన డొమైన్‌లలో తొలి స్థానంలో నిలిచింది.

ఏఐ ఇండస్ట్రీలో ప్రవేశించాలనుకున్నా క్రిప్టో.కామ్‌ సీఈవో క్రిస్ మార్జాలెక్ సూపర్‌ బౌల్‌ సమయంలో ఏఐ.కామ్‌ను అధికారికంగా లాంచ్‌ చేయనున్నారు. ఈ వెబ్‌సైట్‌లో ఏఐ పర్సనల్‌ అసిస్టెంట్‌ లాంచ్‌ కానుంది. ఈ ఏఐ అసిస్టెంట్‌ పర్సనల్‌ మెసేజ్‌లు పంపడంతో పాటు క్రిప్టో ట్రేడింగ్‌,యాప్స్‌ మేనేజ్‌ చేయడంతో పాటు ఇతర కార్యకలాపాల్ని చక్కబెడుతోంది. 


 
చాట్‌జీపీటీ రాకతో టెక్నాలజీ కొంతపుంతలు తొక్కుతోంది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగం ఎప్పటి నుంచో ఉన్నా.. చాట్‌జీపీటీ రాకతో సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చింది. దీంతో ఏఐ వినియోగం రోజురోజుకి పెరిగిపోతుంది. ప్రతిరంగంలో ఏఐ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఈ తరుణంలో ఏఐ.కామ్‌ డొమైన్‌ను అంత భారీ మొత్తంలో వెచ్చించారు. భవిష్యత్‌ మొత్తం ఏఐదేనని,అన్నీ రంగాల్లో ఏఐ పెత్తనం చెలాయిస్తుందంటున్నారు.

ఇది స్ట్రాటజిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అయినప్పటికీ రానున్న 20ఏళ్లలో పెట్టుబడులు అమాంతం పెరుగుతాయని క్రిస్‌ చెబుతున్నారు. ఏఐతో ప్రిమీయం డొమైన్లు బ్రాండింగ్‌ను పెంచుతాయని అంటున్నారు.

2016లో క్రిస్‌.. క్రిప్టో.కామ్‌ను ప్రారంభించారు. అప్పటికే మార్కెట్‌లో క్రిప్టోఫ్లాట్‌ఫారమ్స్‌ ఉన్నాయి. అయినప్పటికీ కంపెనీ వేగంగా వృద్ధి సాధించింది. ప్రస్తుతం, ఏడాదికి 1.5బిలియన్‌ డాలర్ల ఆదాయం వస్తోంది. మార్కెటింగ్‌ బ్రాండింగ్‌పై భారీ ఇన్వెస్ట్‌ చేసింది.2021లో స్టేడియం బ్రాండింగ్‌పై సుమారు 700 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేసింది. ట్రంప్‌ మీడియాతో బిజినెస్‌ డీల్స్‌ కూడా చేసింది. ఇవన్నీ గ్లోబుల్‌ బ్రాండింగ్‌ రికగ్నైజేషన్‌ను పెంచాయి. ఇప్పుడు ఏఐ.కామ్‌ కొనుగోలుతో సరికొత్త రికార్డులు సృష్టించారు క్రిస్‌ మార్స్‌జాలెక్‌.

ఇక క్రిస్‌ మార్స్‌జాలెక్‌ ఏఐ.కామ్‌ డొమైన్‌ను మలేషియన్ టెక్ ఎంట్రప్రెన్యూర్ అర్స్యాన్ ఇస్మాయిల్ నుంచి కొనుగోలు చేశారు. ఈ డొమైన్‌ను ఇస్మాయిల్‌ 1993లో 100 డాలర్లు చెల్లించి రిజిస్టర్‌ చేసుకున్నారు. ఆ సమయంలో ఇది సాధారణ వెబ్ అడ్రస్ మాత్రమే. కానీ కాలక్రమేణా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) ప్రాధాన్యం పెరిగిన కొద్దీ, ఈ డొమైన్‌ విలువ ఆకాశాన్ని తాకింది.

2025 ఏప్రిల్‌లో అర్స్యాన్ ఇస్మాయిల్ ఈ డొమైన్‌ను క్రిస్ మార్జాలెక్‌కి విక్రయించారు. ధర? అక్షరాల 70 మిలియన్ డాలర్లు.అంటే భారత కరెన్సీలో సుమారు రూ.600 కోట్లు. ఇది ఇప్పటివరకు పబ్లిక్‌గా వెల్లడైన అత్యధిక ధర పలికిన డొమైన్‌ ట్రాన్సాక్షన్‌గా గుర్తింపు పొందింది.

ఒకప్పుడు 100 డాలర్ల విలువైన ఈ డిజిటల్ ఆస్తి 30 ఏళ్ల తర్వాత 70 మిలియన్ డాలర్లకు అమ్ముడవడం, ఇంటర్నెట్‌లో డొమైన్‌ల ప్రాధాన్యం ఎంత పెరిగిందో చూపించే అద్భుత ఉదాహరణ. ఏఐ భవిష్యత్తు అన్నీ రంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తుందని భావిస్తున్న ఈ తరుణంలో ఏఐ.కామ్‌పై   వంటి ప్రీమియం డొమైన్‌ను సొంతం చేసుకోవడం ఒక వ్యూహాత్మక పెట్టుబడిగా మారింది. ఇది కేవలం ఒక వెబ్ అడ్రస్ కాదు, భవిష్యత్‌ టెక్నాలజీకి ప్రతీకగా నిలిచే బ్రాండింగ్‌ ఆస్తి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement