జీసీసీలకు హాట్‌స్పాట్‌గా భారత్‌ | India has become the largest hotspot for GCCs | Sakshi
Sakshi News home page

జీసీసీలకు హాట్‌స్పాట్‌గా భారత్‌

Feb 4 2026 12:46 PM | Updated on Feb 4 2026 12:56 PM

India has become the largest hotspot for GCCs

అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాలకు (జీసీసీలు) ఆకర్షణీయ కేంద్రంగా భారత్‌ స్థానం మరింత బలపడనుంది. 2024 చివరికి దేశవ్యాప్తంగా 1,700 జీసీసీలు ఉంటే, 2030 నాటికి వీటి సంఖ్య2,400కు పెరుగుతుందని ఫిక్కీ, అనరాక్‌ సంయుక్త నివేదిక అంచనా వేసింది. అంతేకాదు వీటి మార్కెట్‌ పరిమాణం 64 బిలియన్‌ డాలర్ల నుంచి 110 బిలియన్‌ డాలర్లకు విస్తరిస్తుందని తెలిపింది. 2024 నాటికి జీసీసీలు 19 లక్షల మంది నిపుణులకు ఉపాధి కల్పించగా, 2030 నాటికి 28 లక్షల మంది నిపుణులకు పెరుగుతుందని అంచనా వ్యక్తం చేసింది. దేశంలో జీసీసీల మార్కెట్‌ గత కొన్నేళ్లలో ఎంతో వేగంగా పెరిగినట్టు అనరాక్‌ చైర్మన్‌ అనుజ్‌ పురి పేర్కొన్నారు.

‘కీలకమైన ఐటీ/ఐటీఈఎస్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, బీమా (బీఎఫ్‌ఎస్‌ఐ), ఆరోగ్య సంరక్షణ, లైఫ్‌ సైన్సెస్, ఇంజనీరింగ్‌ పరిశోధన, అభివృద్ధి (ఈఆర్‌అండ్‌డీ) రంగాల నుంచి డిమాండ్‌ పెరగడం జీసీసీల వృద్ధికి ఇంధనంగా నిలుస్తోంది. ఇదే ధోరణి ఇకముందూ కొనసాగొచ్చు. భారత జీసీసీ మార్కెట్‌ ఏటా 10 శాతం చొప్పున కాంపౌండెడ్‌గా పెరుగుతూ 2030 నాటికి 105–110 బిలియన్‌ డాలర్లకు చేరుకోవచ్చు’ అని అనుజ్‌ పురి తెలిపారు.  

టైర్‌–2 నగరాలకూ విస్తరణ

దేశంలో జీసీసీల కార్యకలాపాలు టాప్‌–7కు వెలుపలి ద్వితీయ శ్రేణి నగరాలకూ విస్తరిస్తున్నట్టు ఫిక్కీ–అనరాక్‌ నివేదిక తెలిపింది. జైపూర్, ఇందోర్, సూరత్, కోచి, కోయింబత్తూర్‌ పట్టణాల్లోనూ జీసీసీలు ఏర్పాటువుతున్నట్టు పేర్కొంది. ‘‘మూడు దశాబ్దాలుగా భారత ఆఫీస్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ నిర్వహణను ఖర్చుగానే చూసే వారు. కానీ, ఇప్పుడు ఇదొక కీలక చోదకం. అంతర్జాతీయ పెట్టుబడులకు, ఉపాధి కల్పనకు కేంద్రాలుగా మారుతున్నాయి. భారత యువతకు ఎంపికలుగా మారుతున్నాయి’’అని ఫిక్కీలో పట్టణాభివృద్ధి, రియల్‌ ఎస్టేట్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్న రాజ్‌ మెండ తెలిపారు. దేశంలోని టాప్‌–7 నగరాల్లో 800 మిలియన్‌ చదరపు అడుగుల (ఎస్‌ఎఫ్‌టీ) గ్రేడ్‌–ఏ ఆఫీస్‌ వసతులు ఉన్నాయని.. సగం మేర బెంగళూరు, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోనే ఏర్పాటైనట్టు ఈ నివేదిక వెల్లడించింది. 2025లో నికర వినియోగం 58 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ కాగా, స్థూల లీజింగ్‌ 80 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా ఉన్నట్టు తెలిపింది.  

హైదరాబాద్‌లో జీఐ ఔట్‌సోర్సింగ్‌ జీసీసీ 

అకౌంట్స్‌ ఔట్‌సోర్సింగ్, నాలెడ్జ్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ జీఐ ఔట్‌సోర్సింగ్‌ తాజాగా హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ టెక్‌ పార్క్‌లో తమ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ (జీసీసీ)ని ప్రారంభించింది. కోవసెంట్‌లో భాగమైన ఎనేబ్లర్‌తో కలిసి దీన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇందులో 50 మంది సిబ్బంది ఉండగా వచ్చే 12 నెలల్లో ఇది 100కి పెరగనున్నట్లు గ్రూప్‌ సీఈవో తారిఖ్‌ హుసేన్‌ తెలిపారు. 2028 నాటికి మరో 100 మందిని తీసుకోనున్నట్లు వివరించారు. ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్‌లో ప్రస్తుతం తమకున్న కార్యకలాపాలకు ఈ సెంటర్‌ అనుబంధంగా ఉంటుందని హుసేన్‌ వివరించారు. గ్లోబల్‌ క్లయింట్లకు ప్రపంచ స్థాయి ఫైనాన్షియల్‌ సొల్యూషన్స్‌ అందించే క్రమంలో ఏఐ ఆధారిత జీసీసీని ఏర్పాటు చేయడంలో జీఐ ఔట్‌సోర్సింగ్‌కి తోడ్పాటు అందించినట్లు కోవసెంట్‌ సీఎండీ సీవీ సుబ్రమణ్యం తెలిపారు.

ఇదీ చదవండి: ధర తగ్గిందనుకునేలోపే మళ్లీ.. తులం ఎంతంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement