హెచ్–1బీ వీసాపై ఆంక్షలు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ప్రతికూలతలు, స్థానిక ప్రభుత్వ ప్రోత్సాహకర విధానాల నేపథ్యంలో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ)కు హైదరాబాద్ హాట్ ఫేవరెట్‌గా మారుతోంది. – సాక్షి, సిటీబ్యూరో
గత ఏడాది హైదరాబాద్‌లో 1.28 కోట్ల చదరపు అడుగుల ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. ఇందులో 51 శాతం వాటా గ్లోబల్ కేపబులిటీ సెంటర్ (జీసీసీ) విభాగానిదే.. 2025లో నగరంలో జీసీసీలు 65 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్‌ను లీజుకు తీసుకున్నాయి. 2024లో 58 లక్షల చ.అ.లావాదేవీలతో పోలిస్తే ఇది అధికం. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లోని జీసీసీ లావాదేవీల్లో భాగ్యనగరం వాటా ఏకంగా 19 శాతంగా ఉందని వెస్టియాన్ రిపోర్ట్ వెల్లడించింది.
గతేడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 7.82 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. 2024తో పోలిస్తే ఇది 11 శాతం అధికం. ఇక, కొత్తగా మార్కెట్‌లోకి 5.55 కోట్ల చ.అ. ఆఫీసు స్థలం అందుబాటులోకి వచి్చంది. గతేడాది ఆఫీసు స్పేస్ లీజులలో జీసీసీల వాటా ఏకంగా 45 శాతంగా ఉంది. 2025లో 3.49 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్‌ను జీసీసీలు లీజుకు తీసుకున్నాయి. 2024లోని 2.92 కోట్ల జీసీసీ లావాదేవీలతో పోలిస్తే ఏడాదిలో 20 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది.
వేకెన్సీ 18.2 శాతం..
ఏటేటా హైదరాబాద్‌లో కార్యాలయ స్థలాల మార్కెట్ సరికొత్త రికార్డ్‌లను అధిగమిస్తోంది. గత ఏడాది నాల్గో త్రైమాసికం(క్యూ4)లో ఏకంగా 40 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్ లీజులు పూర్తయ్యాయి. అంతకు క్రితం క్వార్టర్ తో పోలిస్తే ఇది ఏకంగా 55 శాతం అధికం. ఇక, నగరంలో లాస్ట్ క్వార్టర్‌లో కొత్తగా 60 లక్షల చ.అ. కార్యాలయ స్థలాల నిర్మాణాలు పూర్తయి, మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం నగరంలో ఆఫీసు స్పేస్ వేకెన్సీ 18.2 శాతంగా ఉంది.
నివాసాలకే కాదు ఆఫీసు విభాగానికీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) విభాగమే కీలకం. టెకీలతో గృహాలకు, ఐటీ సంస్థలతో కార్యాలయ స్థలాలకు డిమాండ్ పెరుగుతోంది. గతేడాది నగరంలో నమోదైన ఆఫీసు స్పేస్ లీజులలో 39.9 శాతం ఐటీ, ఐటీఈఎస్ విభాగానిదే కావడం ఇందుకు ఉదాహరణ. అయితే అంతకు క్రితం ఏడాదిలో ఈ విభాగం వాటా 41.9 శాతంగా ఉండటం గమనార్హం. ఆ తర్వాత హెల్త్‌కేర్ అండ్ లైఫ్‌సైన్సెస్ 11.5 శాతం, ఫ్లెక్సీ స్పేస్ విభాగం 7.8 శాతం వాటాలను కలిగి ఉన్నాయి.
97 శాతం ఆఫీసు స్పేస్ లావాదేవీలు మాదాపూర్, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ వంటి (పెరిఫెరల్ బిజినెస్ట్ డిస్ట్రిక్ట్) పీబీడీ–వెస్ట్ హైదరాబాద్ ప్రాంతాల్లోనే జరిగాయి. నగరంలో హరిత కార్యాలయ భవనాల వాటా క్రమంగా పెరుగుతోంది. నిరుడు నగరంలో గ్రీన్ సర్టిఫైడ్ ఆఫీసు స్పేస్ లావాదేవీల వాటా 77 శాతంగా ఉంది. అంతకు క్రితం ఏడాది ఈ విభాగం వాటా 76 శాతం. దేశంలోని గ్రీన్ స్పేస్ ఆఫీసులలో హైదరాబాద్ వాటా 16 శాతంగా ఉంది.


