ఏఐ సృష్టికర్తకే తప్పని అభద్రతా భావం | OpenAI Sam Altman Testing Codex App For Mac He Felt Little Useless, Know Reasons Inside | Sakshi
Sakshi News home page

ఏఐ సృష్టికర్తకే తప్పని అభద్రతా భావం

Feb 4 2026 10:52 AM | Updated on Feb 4 2026 11:45 AM

Sam Altman testing Codex app for Mac he felt little useless know the reason

కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న ఓపెన్‌ఏఐ అధినేత సామ్ ఆల్ట్‌మాన్ తన సొంత ఉత్పత్తిపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. యాపిల్ కంప్యూటర్ల (మ్యాక్‌) కోసం ఓపెన్‌ఏఐ కొత్తగా ‘కోడెక్స్’ స్టాండలోన్ యాప్‌ను విడుదల చేసిన తరుణంలో ఆయన తన వ్యక్తిగత అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

ఇటీవల కోడెక్స్ టూల్‌ను ఉపయోగించి ఆల్ట్‌మాన్ స్వయంగా ఒక అప్లికేషన్‌ను రూపొందించారు. ఆ ప్రక్రియలో భాగంగా కొన్ని మార్పుల కోసం ఏఐని సలహాలు అడగగా అది ఇచ్చిన ఐడియాలు ఆయన ఊహించిన దానికంటే అద్భుతంగా ఉన్నాయట. ఈ విషయాన్ని ఎక్స్‌(గతంలో ట్విట్టర్)లో పేర్కొంటూ.. ‘ఏఐ ఇచ్చిన ఐడియాలు చూసిన సమయంలో నేను కొంచెం పనికిరాని వాడినని (Useless) భావించాను. అది నన్ను కొంత విచారానికి గురిచేసింది’ అని ఆయన నిజాయితీగా ఒప్పుకున్నారు. ఒక ఏఐ సృష్టికర్త తాను చేసిన యాప్‌ ఇచ్చిన సమాధానం చూసి అభద్రతకు లోనవ్వడం ఇప్పుడు టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

కోడెక్స్ మాక్ యాప్

ఓపెన్‌ఏఐ విడుదల చేసిన ఈ కొత్త మాక్ యాప్ డెవలపర్ల పనితీరును పూర్తిగా మార్చేయనుంది. దీని ప్రత్యేకతలు గమనిస్తే.. ఒకేసారి ఒక చాట్‌బాట్‌తో కాకుండా సమాంతరంగా ఒకటి కంటే ఎక్కువ ఏఐ ఏజెంట్లతో పని చేయవచ్చు. కోడింగ్ కష్టాలను తగ్గించి డెవలపర్లు తమ ఆలోచనలను సులభంగా అమలు చేసేలా ఈ యాప్ రూపొందించినట్లు చెప్పారు. ఈ ఏఐ ఏజెంట్లు కేవలం సలహాలు ఇవ్వడమే కాకుండా వినియోగదారు తరఫున కోడ్ రాయడం, దాన్ని మెరుగుపరచడం, ఇమేజ్ జనరేషన్ వంటి పనులను కూడా చేయగలవు.

మార్కెట్‌లో పెరుగుతున్న పోటీ

గత నెలలో దాదాపు ఒక మిలియన్ మంది డెవలపర్లు కోడెక్స్‌ను ఉపయోగించినట్లు ఓపెన్‌ఏఐ వెల్లడించింది. ఆంత్రోపిక్, కర్సర్ వంటి సంస్థల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో యాపిల్ వినియోగదారుల కోసం ఈ ప్రత్యేక యాప్‌ను తీసుకురావడం వ్యూహాత్మక అడుగుగా కనిపిస్తోంది.

వినియోగదారులకు బంపర్ ఆఫర్

ప్రస్తుతం కోడెక్స్ సేవలు ఓపెన్‌ఏఐ ప్లస్, ప్రో, ఎంటర్‌ప్రైజ్ సబ్‌స్క్రిప్షన్లు ఉన్నవారికి అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ కొత్త యాప్ విడుదల సందర్భంగా ఉచిత వినియోగదారులకు కూడా పరిమిత కాలం పాటు కోడెక్స్ యాక్సెస్‌ను కల్పిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అలాగే ఇప్పటికే ఉన్న పెయిడ్ యూజర్లకు రేట్ లిమిట్స్ రెట్టింపు చేసింది.

ఇదీ చదవండి: ధర తగ్గిందనుకునేలోపే మళ్లీ.. తులం ఎంతంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement