ఏఐ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. వీలైనన్ని ఎక్కువ మార్గాల్లో వినియోగించుకుంటున్నారు యూజర్లు. ఈ క్రమంలో అమెరికాలో సంచలనం చోటు చేసుకుంది. అమెరికా సైబర్ ఏజెన్సీ అధికారి ఒకరు చాట్‌జీపీటీ వినియోగంతో చిక్కుల్లో పడ్డారు. ఆయన భారతీయ మూలాలు, అందునా తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి కావడం ఇక్కడ విశేషం.
అమెరికా ప్రభుత్వ నెట్‌వర్క్‌లను రక్షించే బాధ్యత కలిగిన సీఐఎస్‌ఏ(Cybersecurity & Infrastructure Security Agency) చూసుకుంటుంది. దానికి తాత్కాలిక డైరెక్టర్ ఉన్న డాక్టర్ మధు గొట్టుముక్కల(Madhu Gottumukkala) ఏఐతో కొత్త తలనొప్పి తెచ్చి పెట్టుకున్నారు. చాట్‌జీపీటీలో ఆయన సంస్థకు చెందిన కీలకమైన పత్రాలను అప్‌లోడ్ చేశారట. అది పబ్లిక్ వెర్షన్‌లో కావడంతో వివాదం రాజుకుంది.
పొలిటికో నివేదిక ప్రకారం.. కిందటి ఏడాది జులై-ఆగస్టు మధ్యకాలంలో మధు గొట్టుముక్కల కాంట్రాక్టింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన పత్రాలను చాట్‌జీపీటీకి అప్‌లోడ్ చేశారు. అవి అంత గోప్యమైనవి కాకపోయినా.. కేవలం అధికారిక సంబంధిత పత్రాలే(For Official Use Only) కావడంతో రచ్చ మొదలైంది. ఆయన అలా అప్‌లోడ్ చేయగానే.. ఆటోమేటెడ్ సెక్యూరిటీ అలర్ట్ మోగింది. దీంతో డీహెచ్‌ఎస్ (Department of Homeland Security) అప్రమత్తమైంది.
మధు గొట్టుముక్కల చేసిన పని వల్ల ఏదైనా నష్టం జరిగిందా? అనేదానిపై డీహెచ్‌ఎస్ సమీక్ష జరిపింది. అయితే ఆ ఇంటర్నల్ రివ్యూలో ఏం తేలిందో మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఆయనపై ఏమైనా చర్యలు ఉంటాయా? అనేదానిపైనా స్పష్టత రావాల్సి ఉంది.
సాధారణంగా.. డీహెచ్‌ఎస్ పరిధిలోని ఉద్యోగులకు చాట్‌జీపీటీ, ఇతర ఏఐ టూల్స్‌ను ఉపయోగించడానికి యాక్సెస్ ఉండదు. కానీ, మధు గొట్టుముక్కల మాత్రం ప్రత్యేక అనుమతి తీసుకున్నారట. ప్రత్యేక అనుమతులతో పరిమితంగా ఉపయోగించేందుకు వీలుందట. అయితే అందులో డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయడం అభ్యంతరాలకు దారి తీసింది. ఈ క్రమంలో ఆయనపై సస్పెన్షన్ వేటు లేదంటే బదిలీ వేటులాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. లేదంటే.. ఏఐ టూల్స్ వినియోగంపై మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తోంది.
మధు గొట్టుముక్కల.. భారతీయ మూలాలు కలిగిన అమెరికన్ అధికారి. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంగా తెలుస్తోంది. కుటుంబం గురించి వివరాలు తెలియాల్సి ఉంది. రష్యా, చైనా వంటి దేశాల నుండి వచ్చే అధునాతన సైబర్ ముప్పులను సీఐఎస్‌ఏ డైరెక్టర్ ఎదుర్కోవడం ఆయన బాధ్యత. డకోటా స్టేట్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ, డల్లాస్‌లో ఎంబీఏ, అర్లింగ్టన్‌లో ఎంఎస్, విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో బీఈ చేశారు. ఆయన చేసిన పని అమెరికా సైబర్ సెక్యూరిటీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రభుత్వ సున్నితమైన పత్రాలను AI ప్లాట్‌ఫారమ్‌లలో ఉపయోగించడం ఎంతవరకు సురక్షితం అనే ప్రశ్న ముందుకు తెచ్చింది.


