ఫోన్‌ మీది.. ఓటీపీ వారిది.. చివరకు ఖాతా ఖాళీ! | How to escape from call forwarding scam | Sakshi
Sakshi News home page

సైబర్‌ దొంగల కొత్త పంథా.. బహిరంగ ప్రదేశాల్లో భద్రం!

Mar 14 2026 2:34 PM | Updated on Mar 14 2026 3:23 PM

How to escape from call forwarding scam

కోడ్‌లతో కాల్స్‌ మళ్లింపు!

డబ్బులు కాజేసే ‘డయల్‌’ మాయ

పార్వతీపురం రూరల్‌ : మాయమాటల గారడీ.. మాటల వెనుక మర్మం.. వెరసి మీ కష్టార్జితం మాయం! ఆపదలో ఉన్నామంటూ అపరిచితులు అడిగే సాయం, మీ బ్యాంక్‌ ఖాతాకు శాపంగా మారే ప్రమాదముందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆధునిక సాంకేతికతను ఆసరాగా చేసుకుని సైబర్‌ కేటుగాళ్లు సరికొత్త పంథాలో సామాన్యులను బురిడీ కొట్టిస్తున్నారని, ముఖ్యంగా కాల్‌ ఫార్వర్డింగ్‌ ఉచ్చులో పడకుండా జాగ్రత్త వహించాలని  సూచిస్తున్నారు.

అడగడమే ఆలస్యం.. అరచేతిలో వైకుంఠం! 
రద్దీగా ఉండే బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు లేదా బహిరంగ ప్రదేశాల్లో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి..  అర్జంటుగా ఇంట్లో మాట్లాడాలి, ఫోన్లో ఛార్జింగ్‌ అయిపోయింది.. ఒక్క నిమిషం మీ ఫోన్‌ ఇస్తారా? అంటూ ప్రాధేయపడతారు. ఆపన్న హస్తం అందించాలనే ఉద్దేశంతో ఫోన్‌ ఇస్తే, వారు ఫోన్‌ చేసే నెపంతో 21, 61 లేదా 67తో ప్రారంభమయ్యే రహస్య కోడ్లను డయల్‌ చేసి, చివరన వారి మొబైల్‌ నంబరును జత చేస్తారు. దీంతో మీ ప్రమేయం లేకుండానే మీ నంబరుకు వచ్చే ఇన్‌ కమింగ్‌ కాల్స్‌ అన్నీ వారి ఫోన్‌కు మళ్లించబడతాయి.

ఓటీపీల చోరీ.. నిలువు దోపిడీ!   
కాల్‌ ఫార్వర్డింగ్‌ సక్రియం కాగానే అసలు ఆట మొదలవుతుంది. బ్యాంకులు, కొరియర్‌ సంస్థలు లేదా ఇతర సేవల నుంచి వచ్చే ధ్రువీకరణ కాల్స్‌  నేరుగా దుండగుడి చేతికి వెళ్తాయి. మీ మొబైల్‌కు ఎలాంటి సమాచారం రాదు, కానీ సైలెంట్‌గా మీ అకౌంట్ల నుంచి నగదు మాయమవుతుంది. ముసుగులో గుద్దులాట లేకుండా, నిలువు దోపిడీకి ఇదొక సులువైన మార్గంగా నేరగాళ్లు ఎంచుకున్నారని పోలీసులు ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో సైతం అవగాహన కల్పిస్తున్నారు.

చ‌ద‌వండి: ఏసీ క్లీనింగ్‌ ఇలా ఈజీ!

అప్రమత్తతే రక్ష.. కోడ్‌లతో శిక్ష! 
సైబర్‌ దొంగల బారిన పడకుండా ఉండాలంటే అపరిచితులకు ఫోన్‌ ఇచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఒకవేళ పొరపాటున ఎవరికైనా ఫోన్‌ ఇచ్చి ఉంటే లేదా మీ కాల్స్‌ ఫార్వర్డ్‌ అవుతున్నాయని అనుమానం కలిగితే, వెంటనే మొబైల్‌ నుంచి ##002# కోడ్‌ను డయల్‌ చేసి కాల్‌ ఫార్వర్డింగ్‌ సేవలను నిలిపివేయాలి. సైబర్‌ నేరాలకు గురైతే ఆలస్యం చేయకుండా 1930 టోల్‌ ఫ్రీ నంబరుకుగానీ లేదా సైబర్‌ పోర్టల్‌ వెబ్‌సైట్‌లోగానీ ఫిర్యాదు చేయాలి. ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి  ఈ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. 
– బి.వెంకట్రావు, పార్వతీపురం పట్టణ సీఐ  

Advertisement
 
Advertisement
Advertisement