ఎక్సైజ్ మంత్రి ఊర్లో రూల్స్ గీల్స్ జాన్తా నై..! | Liquor Sales Under Tents Violating Bar Rules In Machilipatnam | Sakshi
Sakshi News home page

ఎక్సైజ్ మంత్రి ఊర్లో రూల్స్ గీల్స్ జాన్తా నై..!

Mar 15 2026 7:32 PM | Updated on Mar 15 2026 7:32 PM

Liquor Sales Under Tents Violating Bar Rules In Machilipatnam

మచిలీపట్నం:  ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకాలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. ఎక్సైజ్‌ చట్టాలను తుంగలో తొక్కి, బార్‌ రూల్స్‌కి విరుద్ధంగా టెంట్లు వేసి మరీ మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. పందిర్ల కింద బార్ లైసెన్స్ మంజూరు చేసి, మద్యం సిండికేట్‌ల అవినీతి మత్తులో మునిగితేలుతున్నారు కృష్ణాజిల్లా ఎక్సైజ్ అధికారులు. రాష్ట్రం మొత్తం ఒక రూల్‌.. మచిలీపట్నం మరొక రూల్‌ అన్నట్లు ఇక్కడ మద్యం అమ్మకాల నిర్వహణ సాగుతోంది. ‘ ఎక్సైజ్ మంత్రి ఊర్లో రూల్స్‌ గీల్స్‌ జాన్తా నై’ అన్నట్లుగా సాగుతున్నాయి మద్యం విక్రయాలు. 

బార్‌ రూల్స్‌కు విరుద్ధంగా ఖాళీ స్థలంలో టెంట్లు, పందిర్లు వేసి మచిలీపట్నం బీచ్‌ రోడ్‌లో బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఏర్పాటు చేశారు నిర్వహకులు. నిబంధనలు పాటించని బార్ అండ్ రెస్టారెంట్ యజమానులపై కృష్ణా జిల్లా ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. దాంతో స్థానికుల నుంచి తిరుగుబాటు ఎదురైంది. టెంట్లు, పందిళ్ళ కింద బార్ లైసెన్సులు ఎలా  మంజూరు చేశారని ప్రశ్నిస్తున్న స్థానికులు.

గుడారాల్లోనే బార్లు
జనసేనకు చెందిన కొరియర్‌ శ‍్రీను గుడారాల్లోనే బార్‌ నిర్వహిస్తున్నారు. తన అనుచరులతో బార్‌ టెండర్లు పొందిన మచిలీపట్నంకు చెందిన జనసేన నేత కొరియర్‌ శ్రీను.. భవన నిర్మాణాలు చేపట్టకుండానే గుడారాలు వేసి మద్యం విక్రయాలు జరుపుతున్నారు.ఇది ఆబ్కారీ శాఖ వింతపోకడలకు అద్దం పడుతోంది. ఇలా గుడారాల్లో బార్‌ నిర్వహించడం రూల్స్‌కి విరుద్ధమైనా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు.

అబ్కారీశాఖ మంత్రి ఇలాకాలో మద్యం పరవళ్లు..
కృష్ణా జిల్లాలో పరిస్థితి ఎలా ఉన్నా సాక్షాత్తూ అబ్కారీశాఖ మంత్రి కొల్లు రవీంద్ర సొంత నియోజకవర్గంలో మాత్రం మద్యం పగలు, రాత్రి పరవళ్లు తొక్కుతుంది. అదేమంటే మేమింతే అడ్డుకుంటే అంతే అంటూ కూటమి నాయకులు (మద్యం వ్యాపారులు) సంబంధిత అధికారులపై అధికారం చెలాయిస్తున్నారు. సొంత నియోజకవర్గంలోనే మద్యం వ్యాపారాన్ని నియత్రించలేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకేమి కట్టడి చేయగలుగుతారంటూ జనం ప్రశ్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement