న్యూయార్క్‌లో ఘ‌నంగా మహిళా దినోత్సవ వేడుకలు | FIA Celebrates International Womens Day at India House in New York | Sakshi
Sakshi News home page

న్యూయార్క్‌లో ఘ‌నంగా మహిళా దినోత్సవ వేడుకలు

Mar 10 2026 10:36 PM | Updated on Mar 10 2026 10:42 PM

FIA Celebrates International Womens Day at India House in New York

నిర్వ‌హించిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్

భారతీయ సమాజానికి స్ఫూర్తిగా నిలిచిన మహిళలకు సత్కారం

అతిథిగా భారత కాన్సుల్ జనరల్ బినయ శ్రీకాంత ప్రధాన్

FIA అధ్యక్షుడు శ్రీకాంత్ అక్కపల్లి అధ్య‌క్ష‌త‌న వేడుక‌లు

న్యూయార్క్: అమెరికాలోని ప్ర‌ముఖ ప్రవాస భారతీయుల సంస్థ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA) న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, న్యూఇంగ్లాండ్ చాఫ్ట‌ర్‌ల‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు న్యూయార్క్ నగరంలోని ఇండియా హౌస్‌లో ఘనంగా నిర్వహించారు.

గత ఎనిమిదేళ్లుగా నిర్వహిస్తున్న ఈ వేడుక‌ల్లో వ్యాపారం, మీడియా, ఫైనాన్స్, సామాజిక సేవ తదితర రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచి అమెరికాలో భారతీయ సమాజానికి స్ఫూర్తిగా నిలిచిన మహిళలను ఈ సంద‌ర్భంగా సత్కరించారు.

FIA అధ్యక్షుడు శ్రీకాంత్ అక్కపల్లి మాట్లాడుతూ, మహిళా సాధికారతకు తమ సంస్థ ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. సమాజంలో మహిళలు తీసుకొచ్చిన సానుకూల మార్పులకు కృతజ్ఞతలు తెలుపుతూ అవార్డు గ్రహీతలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన భారత కాన్సుల్ జనరల్ బినయ శ్రీకాంత ప్రధాన్‌ను ప్రత్యేక అతిథిగా పరిచయం చేశారు.

కాన్సుల్ జనరల్ బినయ శ్రీకాంత ప్రధాన్ మాట్లాడుతూ.. దేశ అభివృద్ధికి మహిళా సాధికారత కీలకమని చెప్పారు. 'బేటీ బచావో బేటీ పడావో', 'ఉజ్వల యోజన' వంటి పథకాల ద్వారా భారత్ మహిళా సాధికారతలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. అలాగే 100 మిలియన్ కుటుంబాలను మహిళల స్వయం సహాయక సంఘాలతో అనుసంధానం చేయడం ద్వారా ఆర్థికంగా శక్తివంతం చేయడంపై దృష్టి పెట్టినట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సత్కారం పొందిన మహిళలకు న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ తరఫున గుర్తింపు సర్టిఫికెట్లు, FIA శాలువాలు, ట్రోఫీలు అందజేశారు.

నార్త్‌స్టార్ స్ట్రాటజీస్ COO జోడి లిన్ హెర్క్లోజ్, రోబర్ట్ వుడ్ జాన్సన్ బార్నబాస్ హెల్త్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ బాల్‌ప్రీత్ గ్రేవాల్ విర్క్, ప్రముఖ అమెరికన్ నటి రేష్మా శెట్టి, NYPD ఫస్ట్ డిప్యూటీ కమిషనర్ టానియా కిన్సెల్లా తదితరులు మహిళలు ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ సంద‌ర్భంగా పురస్కార గ్రహీతలు త‌మ అభిప్రాయాలు పంచుకున్నారు. కాన్సుల్ జనరల్ స‌తీమ‌ణి మోనాలిసా శువదర్షిణి ప్రధాన్ కూడా ఈ గుర్తింపుకు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ బల్ప్రీత్ గ్రేవాల్-విర్క్ మాట్లాడుతూ, కమ్యూనిటీ నిర్మాణంలో FIA పాత్రను కొనియాడుతూ, తన విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణమని తెలిపారు. అమెరికన్ నటి రేష్మా శెట్టి.. మాతృత్వం, సాంస్కృతిక వారసత్వం గురించి భావోద్వేగంగా మాట్లాడారు. NYPD ఫస్ట్ డిప్యూటీ కమిషనర్ తానియా కిన్సెల్లా మాట్లాడుతూ, ఈ గౌరవాన్ని తన తల్లి, అమ్మమ్మలకు అంకితం ఇస్తూ.. అడ్డంకులను అధిగమించిన వైనాన్ని వివరించారు.

కార్యక్రమ ప్రారంభంలో దివంగత అవార్డు గ్రహీత రాధా సుబ్రమణ్యం జ్ఞాపకార్థం మౌనం పాటించారు. రిద్ది పారిఖ్ పటేల్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కార్యక్రమం ముగింపులో FIA ప్రధాన కార్యదర్శి సృష్టి కౌల్ నరులా ధన్యవాదాలు తెలిపారు. FIA జనరల్ సెక్రటరీ సృష్టి కౌల్ నరుల వందన సమర్పణతో వేడుకలను ముగిశాయి.

ఎఫ్ఐఏ సంస్థ 1970 నుండి భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. భారతీయ సంస్కృతి, సేవా కార్యక్రమాలు, సామాజిక అవగాహన కార్యక్రమాల ద్వారా అమెరికాలోని భారతీయ సమాజాన్ని బలోపేతం చేస్తూ, ఇండో–అమెరికా సంబంధాలను మరింత బలపరుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement