న్యూయార్క్‌ మేయర్‌ మమ్దాని ఇంటి వద్ద కలకలం | Explosion Attempt At New York Mayor Residence During Anti Islamization Protest, More Details Inside | Sakshi
Sakshi News home page

న్యూయార్క్‌ మేయర్‌ మమ్దాని ఇంటి వద్ద కలకలం

Mar 8 2026 12:22 PM | Updated on Mar 9 2026 2:21 PM

Explosive Devices Thrown Outside Mamdani’s New York Home

వాషింగ్టన్‌: న్యూయార్క్‌ మేయర్‌ జోహ్రాన్ మమ్దాని ఇంటి వద్ద కలకలం చెలరేగింది. మామ్దానికి చెందిన గ్రేసీ మాన్షన్ ఇంటి ముందు ఓ వ్యక్తి పేలుడు పదార్థాలను విసిరాడు. ఫార్‌ రైట్‌ ఇన్‌ప్లుయెన‍్సర్‌ జేక్ లాంగ్.. గ్రేసీ మాన్షన్ ముందు "ఇస్లామీకరణ"కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. న్యూయార్క్‌లో ప్రజలు తిరిగే ప్రాంతాల్లో ముస్లింలు ప్రార్థనలు నిలిపివేయాలని జేక్ లాంగ్ డిమాండ్ చేశారు.

న్యూయార్క్ పోలీస్ శాఖ కమిషనర్ జెసికా టిష్ తెలిపిన వివరాల ప్రకారం.. నిరసనకారుడు విసిరిన పరికరంలో నట్స్, బోల్ట్స్, స్క్రూలు, ఫ్యూస్ ఉన్నాయి. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు, ఇరాన్‌పై అమెరికా చేస్తున్న యుద్ధానికి సంబంధం లేదని అధికారులు చెప్పారు. ముస్లిం మేయర్ అయిన మమ్దానిపై “ఇస్లామీకరణ” ఆరోపణలు చేస్తూ ఈ నిరసన తెలిపారని అన్నారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. సుమారు 20 మంది నిరసనలో పాల్గొన్నారు.  

నలుపు రంగు హుడ్ స్వెట్షర్ట్, బేజ్ కార్గో ప్యాంట్ ధరించిన వ్యక్తికి మరొక కార్యకర్త టేప్ చుట్టిన, పొగ వస్తున్న పరికరం ఇచ్చాడు. ఆ వ్యక్తి పోలీసుల దగ్గర ఆ పరికరం వదిలి, వెంటనే అక్కడి బారికేడ్‌ను దాటి వెళ్లాడు.

అదే వ్యక్తి లాంగ్ చుట్టూ నిలిచిన నిరసనకారుల దగ్గర ఇలాంటి మరొక పరికరం విసిరాడు. “ఆ పరికరం నుంచి మంటలు, పొగ వచ్చాయి. అది పోలీసుల దగ్గర కొన్ని అడుగుల దూరంలో ఉన్న బారికేడ్‌ను కూడా తాకింది” అని అధికారులు తెలిపారు. అనుమానితుడు 18 ఏళ్ల అమీర్ బాలట్ అని అన్నారు. నిరసన జరిగిన ప్రదేశంలో భారీగా మోహరించిన పోలీసులు వెంటనే నిందితుడిని, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

“బాంబు స్క్వాడ్ అక్కడికి చేరుకుంది. ప్రాథమిక పరీక్షలు, ఎక్స్‌రే పరిశీలన తర్వాత ఆ పరికరాలు ఫుట్‌బాల్ కంటే కొద్దిగా చిన్న పరిమాణంలో ఉన్న సీసాల్లా  కనిపించాయి. వాటిపై నల్ల టేప్ చుట్టి, లోపల నట్స్, బోల్ట్స్, స్క్రూలు, హాబీ ఫ్యూస్ అమర్చారు” అని అధికారులు చెప్పారు. ఆ పరికరాల్లో నిజంగా పేలుడు పదార్థం ఉందా అనే విషయం ఇంకా తెలియరాలేదు. జేక్‌ లాంగ్ టీమ్‌ నుంచి ఒక నిరసనకారుడు పెప్పర్ స్ప్రే వాడాడని, ఆ ఘటనలో పోలీసులు అతనిని కూడా అరెస్ట్ చేశారని అధికారులు తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement