ఇరాన్‌పై దాడిని సమర్థించుకోలేక ట్రంప్ తడబాటు
రోజుకో మాట మారుస్తున్న అధ్యక్షుడు, యంత్రాంగం
ఒకటే నోరు. కానీ పూటకో మాట. రోజుకోవైఖరి. ఇరాన్ యుద్ధంపై అమెరికా, ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి విస్మయం గొలుపుతోంది. సహేతుకమైన కారణమేదీ లేకుండానే ఏకపక్షంగా తెర తీసిన ఈ యుద్ధాన్ని ఎలా సమర్థించుకోవాలో తెలియక అగ్ర రాజ్యం కిందా మీదా పడుతోంది. ఫిబ్రవరి 28న శనివారం ఇజ్రాయెల్‌తో కలిసి ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరిట ఇరాన్‌పై అమెరికా భారీ స్థాయి యుద్ధానికి దిగడం తెలిసిందే. ఆ క్రమంలో యుద్ధ కారణాలకు సంబంధించి ట్రంప్ మొదలుకుని ఆయన యంత్రాంగంలోని ఇతర నేతల దాకా పదేపదే మాట మారుస్తూ నవ్వులపాలు అవుతున్నారు.
ఇప్పటికీ కనీసం ఒక్కటంటే ఒక్క ఆమోదయోగ్యమైన కారణం కూడా చూపలేకపోయారు. ఫలితంగా ట్రంప్ సర్కారు సొంత ప్రజల దృష్టిలోనే పలుచన కావడంతో పాటు స్వదేశంలో శరవేగంగా ఆదరణ కోల్పోతోంది. ఇరాన్‌లో నాయకత్వ మార్పే లక్ష్యమని ట్రంప్ తొలుత చెప్పారు. తర్వాత అణు ముప్పును బూచిగా చూపారు. కొన్ని కారణాలైతే పరస్పర విరుద్ధంగా కూడా ఉండటం విశేషం! ఇలా యుద్ధం మొదలైన ఈ 8 రోజుల్లోనే ట్రంప్, ఆయన యంత్రాంగం పదేపదే మాట ఎలా మారుస్తూ వచ్చిందంటే...
ఇరాన్ విముక్తి కోసమే!
ఇరాన్ మత పాలకుల దశాబ్దాల దమననీతికి బదులిచ్చేందుకు, వారి బారినుంచి ఆ దేశాన్ని విముక్తం చేసేందుకే యుద్ధం మొదలు పెట్టినట్టు ఫిబ్రవరి 28న శనివారం ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్ట్ పెట్టారు. ‘‘ఇరాన్ నుంచి ప్రపంచానికి అణు ముప్పు పొంచి ఉంది. దానికి చరమగీతం పాడబోతున్నాం. అలాగే ఇరాన్ క్షిపణి వ్యవస్థను కూడా పూర్తిగా నేలమట్టం చేయబోతున్నాం’’ అని 8 నిమిషాల వీడియోలో చెప్పుకొచ్చారు. అంతేగాక, ‘‘ఈ సువర్ణావకాశాన్ని ఇరాన్‌వాసులు అందిపుచ్చుకోవాలి. దేశాన్ని వారి చేతుల్లోకి తీసుకునే సాహసం ప్రదర్శించాలి’’ అంటూ పిలుపునిచ్చారు! అనంతరం తొలి బాంబులు ఇరాన్‌ను తాకిన కాసేపటికి ఆక్సియోస్ న్యూస్ వెబ్‌సైట్‌తో ట్రంప్ మాట్లాడారు. ‘‘యుద్ధాన్ని దీర్ఘకాలం పాటు కొనసాగిస్తా. లేదంటే రెండు మూడు రోజుల్లోనే ముగించేస్తా. మా దాడి నుంచి కోలుకునేందుకు ఇరాన్‌కు ఎలాగూ ఏళ్లు పడుతుంది’’ అని చెప్పుకొచ్చారు.
స్వీయ రక్షణకే!
ఫిబ్రవరి 28న యుద్ధం మొద లైన కాసేపటికే ఐక్యరాజ్య సమితిలో యూఎన్ మిషన్ మరో వైఖరి తీసుకుంది. స్వీయరక్షణ కోసమే ఇరాన్‌పై దాడికి దిగాల్సి వచ్చిందంటూ భిన్న స్వరం వినిపించింది! ‘‘ఇరాన్ క్షిపణి పాటవం, అణ్వాయుధ ఆకాంక్షలు గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలకు పెను ముప్పుగా మారాయి. అందుకే దానిపై దాడులు తప్పలేదు’’ అని చెప్పుకొచ్చింది. శాంతియుత పరిష్కారం కోసం ఎంతగా సంప్రదింపులు జరిపినా లాభం లేకపోయిందంటూ ఐరాసలో అమెరికా రాయబారి వైక్ వాల్జ్ మొసలి కన్నీరు కార్చారు. ‘‘కనుక ఇజ్రాయెల్‌తో కలిసి దాడులకు దిగక తప్పలేదు. యూఎన్ చార్టర్‌లోని ఆర్టికల్ 51 ప్రకారం మా చర్య పూర్తిగా చట్టబద్ధమే’’ అంటూ వాదించారు. తమ చర్యను స్వాగతిస్తూ ఇరాన్ ప్రజలంతా వీధుల్లోకి వచ్చి మరీ పండుగ చేసుకుంటున్నారని
అదేమీ లేదు!
ఐరాసలో అమెరికా వినిపించిన స్వరాన్ని పెంటగాన్ వర్గాలు ఆ మర్నాడే ఖండించడం విశేషం! యుద్ధం మొదలైన మర్నాడు మార్చి 1న తాజా పరిస్థితిని అవి కాంగ్రెస్‌కు నివేదించాయి. ఆ క్రమంలో, ‘‘గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై గానీ, సిబ్బందిపై గానీ తొలుత దాడులకు దిగే ఉద్దేశం ఇరాన్‌కు ఏమాత్రమూ లేదు. దానిపై ఇజ్రాయెల్ తొలుత దాడి చేస్తే తప్ప ఇరాన్ నాయకత్వం అలాంటి ఆలోచన కూడా చేయబోదు’’ అని స్పష్టం చేశాయి!
రూబియోను ఖండించిన ట్రంప్!
రూబియో వ్యాఖ్యలను ఆ మర్నాడే ట్రంప్ ఖండించారు. ఇరాన్‌పై సైనిక చర్యకు దిగాలన్న నిర్ణయం పూర్తిగా తనదేనని మార్చి 3న స్పష్టం చేశారు. ‘‘ఇజ్రాయెల్ మమ్మల్ని ఒత్తిడి చేయడమేమిటి? అయితే గియితే మేమే ఇజ్రాయెల్‌ను ఒత్తిడి చేశామని చెప్పాలి’’ అని కూడా అన్నారు. ఇరాన్ దురుద్దేశాలే సైనిక చర్యకు కారణం తప్ప ఇజ్రాయెల్ కాదన్నారు. దాంతో రూబియో కంగుతిన్నారు. ముందు రోజు తాను చేసిన వ్యాఖ్యలను మీడియానే సందర్భరహితంగా చూపించి దురుద్దేశాలు ఆపాదించిందంటూ నాలిక మడతేశారు.– సాక్షి, నేషనల్ డెస్క్
రూబియో భిన్న స్వరం
పెంటగాన్ వర్గాల వ్యాఖ్యలు చేసిన మర్నాడే, అంటే మార్చి 2న అందుకు పూర్తి భిన్నంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడారు. ‘‘ఇరాన్ ఏ క్షణంలోనైనా గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై దాడి చేయొచ్చు. ఇరాన్ సైనిక ఫీల్డ్ కమాండర్లకు ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఇజ్రాయెల్ ఇప్పటికే ఇరాన్‌పై దాడి యోచనలో ఉన్నట్టు నాకు కచ్చితమైన సమాచారముంది. అప్పుడు మన స్థావరాలకూ ముప్పు తప్పదు. కనుక మనమే ముందస్తు దాడులకు దిగడం తప్ప మరో మార్గం లేదు. లేదంటే భారీగా నష్టపోతాం’’ అని క్యాపిటల్ హిల్ భవనంలో జరిగిన ఉన్నత స్థాయి రహస్య భేటీలో చెప్పుకొచ్చారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ మాత్రం తమ మిత్రదేశమైన ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడికి దిగుతుండటంతో తమకూ మరో మార్గం లేకపోయిందనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు!
ట్రంప్‌ను చంపాలనుకున్నారు!
మార్చి 4న పెంటగాన్ బ్రీఫింగ్‌లో అమెరికా రక్షణ మంత్రి ఇరాన్‌పై యుద్ధానికి సరికొత్త కారణాన్ని తెరపైకి తెచ్చారు. ‘‘ట్రంప్‌ను హత్య చేసేందుకు ఇరాన్ కుట్ర పన్నింది. ఇరాన్ ఐఆర్‌జీసీ సైనిక యూనిట్ కమాండర్‌కు ఈ మేరకు బాధ్యతలు కూడా అప్పగించింది. కానీ (ఖమేనీ హత్య ద్వారా) వారిపై ట్రంపే పై చేయి సాధించారు’’ అని చెప్పుకొచ్చారు!


