నాయకి.. | Women seeking leadership roles | Sakshi
Sakshi News home page

నాయకి..

Mar 8 2026 4:47 AM | Updated on Mar 8 2026 4:47 AM

Women seeking leadership roles

లీడర్‌షిప్‌ రోల్స్‌ కోరుకుంటున్న మహిళలు 

సమాన పనికి సమాన వేతనానికి డిమాండ్‌ 

సౌకర్యవంతమైన పనివేళలు కల్పించాలని వినతి 

నౌకరీ ‘వాయిస్‌@ వర్క్‌’ నివేదికలో వెల్లడి

దేశంలో మహిళా నిపుణులు నాయకత్వ స్థానం కోసం ఎక్కువగా ఆకాంక్షిస్తున్నారు. అంతేకాదు పని ప్రదేశంలో సమానత్వాన్ని సైతం కోరుకుంటున్నారు. నియామకాల్లో వివక్ష, వేతన వ్యత్యాసాలు ఇప్పటికీ అడ్డంకులుగా ఉన్నప్పటికీ.. వారు తమ హక్కుల కోసం గళం విప్పుతున్నారు. ‘మహిళా నిపుణులు ఏమి కోరుకుంటున్నారు’పేరుతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జాబ్‌ పోర్టల్‌ నౌకరీ.కామ్‌ తన రెండవ ’వాయిస్‌ ఃవర్క్‌’ వార్షిక నివేదికను విడుదల చేసింది. 

దేశవ్యాప్తంగా 50కిపైగా పరిశ్రమలకు చెందిన 50,000 మందికిపైగా మహిళా ఉద్యోగుల అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. ఎటువంటి కారణం లేకుండా ఉద్యోగుల మధ్య ఉన్న వేతన వ్యత్యాసాలను గుర్తించడానికి, వాటిని సరిదిద్దడానికి క్రమబద్ధమైన విశ్లేషణ (ఈక్వల్‌ పే ఆడిట్‌) జరగాలని కోరుకుంటున్నారు. అంటే సమాన పనికి సమాన వేతనం కోసం డిమాండ్‌ భారీగా పెరిగిందని ఈ అధ్యయనం వెల్లడించింది. అలాగే మెన్‌స్ట్రువల్‌ లీవ్‌కు అదే స్థాయిలో ప్రాధాన్యత ఇస్తున్నారు. – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

టాప్‌లో హైదరాబాద్‌..
సర్వేలో పాలుపంచుకున్న వారిలో దాదాపు 83% మంది తాము నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి కావాల్సిన ప్రోత్సాహం లభిస్తోందని తెలిపారు. గత ఏడాది జరిపిన సర్వేలో మూడింట రెండొంతుల మంది ఈ అభిప్రాయాన్ని వెల్లడించారు. మహిళా నాయకత్వానికి అత్యధిక స్థాయిలో ప్రోత్సాహాన్ని అందించడంలో హైదరాబాద్‌ (86%) టాప్‌లో నిలిచింది. అయితే కార్యాలయాల్లో వివక్ష ఇప్పటికీ ప్రధాన ఆందోళనగా కొనసాగుతోంది. 

దాదాపు ఇద్దరు మహిళల్లో ఒకరు తమ వివాహం లేదా మాతృత్వ ప్రణాళికల గురించి ఉద్యోగ ఇంటర్వ్యూలలో వెల్లడించడానికి సంకోచిస్తున్నారు. వివక్ష ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం ఇందుకు కారణం. ఫ్రెషర్స్‌లో 29% మంది, 10–15 ఏళ్ల పని అనుభవం ఉన్న నిపుణులలో 40% మంది ఈ విషయాన్ని వెల్లడించారు. తమ కార్యాలయాల్లో వేతన సమానత్వం లేదని మూడింట ఒక వంతు మంది భావిస్తున్నారు. నియామకాలు, పదోన్నతుల్లో పక్షపాతం చూపిస్తున్నారని 42% మంది తెలిపారు.

మహిళలు నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి ప్రోత్సాహాన్ని పొందుతున్నారని  భావిస్తున్నారా?
అవును 83%
కాదు 17%  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement