అన్నింటా 'ఆమె' | Special article on International Womens Day | Sakshi
Sakshi News home page

అన్నింటా 'ఆమె'

Mar 8 2026 4:07 AM | Updated on Mar 8 2026 4:07 AM

Special article on International Womens Day

రక్షణ మొదలు క్రీడల వరకు అన్ని రంగాల్లోనూ అతివల ముద్ర 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం

అడ్డంకులను అధిగమిస్తూ.. అవహేళనలు, అవమానాలను దాటుకుంటూ నేడు అన్ని రంగాలనూ ఆమె జయిస్తోంది. దేశ రక్షణ మొదలు క్రీడల వరకు.. ప్రభుత్వ కొలువుల నుంచి ప్రైవేటు ఉద్యోగాల దాకా అన్నింటా తనదైన ముద్ర వేస్తోంది. పంచాయతీ నుంచి పార్లమెంట్‌ వరకు నిర్ణయాలు తీసుకోవడంలో ఆమె మార్క్‌ స్పష్టంగా కనిపిస్తోంది. 

ఇంటి బడ్జెట్‌ తయారు చేయడం నుంచి దేశ బడ్జెట్‌ రూపొందించే స్థాయి దాకా అతివ హవా కొనసాగుతోంది. దేశంలో నారీ శక్తి ఇప్పుడు కేవలం నినాదానికే పరిమితం కాకుండా అదొక నిరంతర ప్రవాహంగా మారింది. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లోని మహిళామణుల సమాహారం. – సాక్షి, హైదరాబాద్‌

దేశ రక్షణకు పాటుపడుతూ.. 
దేశ రక్షణ రంగంలోనూ అతివలు చురుగ్గా రాణిస్తున్నారు. స్క్వాడ్రన్‌ లీడర్‌ భావన కాంత్‌ (పోరాటంలో మొదటి మహిళా యుద్ధ పైలట్‌), కల్నల్‌ సోఫియా ఖురేషి (విదేశాలలో ఆర్మీ బృందానికి నాయకత్వం వహించిన మొదటి మహిళ) ఉన్నారు. భారత నావికాదళ యుద్ధనౌకకు మొదటి మహిళా కమాండర్‌గా ప్రేరణ దేవస్థలీ గుర్తింపు పొందారు. రక్షణ రంగం (డిఫెన్స్‌) లో భావనా కాంత్‌తోపాటు అవని చతుర్వేది మోహనా సింగ్‌ దేశ తొలితరం ఫైటర్‌ పైలట్లుగా ఖ్యాతిగాంచారు. 

అంతరిక్షం రంగంలో రీతూ కరిధాల్‌ (రాకెట్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఇండియా) మంగళయాన్, చంద్రయాన్‌–2 మిషన్లలో కీలకపాత్ర పోషించారు. గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పారామిలిటరీ దళాల్లో పూర్తిగా పురుషులతో కూడిన సీఆర్‌పీఎఫ్‌ బృందానికి సిమ్రాన్‌ బాలా నాయకత్వం వహించారు. ‘భారత క్షిపణి మహిళ’గా పేరుగాంచిన డాక్టర్‌ టెస్సీ థామస్‌ డీఆర్‌డీవోలో కీలకమైన క్షిపణి ప్రాజెక్టులను ముందుండి నడిపించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో 20–30% మంది మహిళలు పనిచేస్తున్నారు.

ఆటల్లో ఐకాన్‌లుగా..
క్రీడారంగంలో మేరీ కోమ్‌ (బాక్సింగ్‌) మిథాలీ రాజ్‌ (క్రికెట్‌) వంటి క్రీడల్లో ఐకాన్‌లుగా మారారు. పి.వి. సింధు (బ్యాడ్మింటన్‌) రెండు ఒలింపిక్‌ పతకాలు సాధించిన మొదటి భారతీయ  మహిళగా చరిత్ర సృష్టించారు.  

వివిధ రంగాల్లో ముందంజ...
దేశంలో 20% స్టార్టప్‌ సంస్థలకు మహిళలు నాయకత్వం వహిస్తున్నారు. 2022 నాటికి అగ్రశ్రేణి కంపెనీలలో సీఈవో/ఎండీ పాత్రలలో మహిళా ప్రాతినిధ్యం 55% పెరిగింది. ప్రముఖ వ్యక్తులలో ఫల్గుణి నాయర్‌ (నైకా), కిరణ్‌ మజుందార్‌–షా (బయోకాన్‌) అగ్రభాగాన కొనసాగుతున్నారు. 

ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలో 30% మంది, వ్యవసాయ శ్రామికశక్తిలో దాదాపు 42% మంది అతివలు ఉన్నారు. జార్ఖండ్‌లోని ‘రాణి మిస్త్రీలు’(క్వీన్‌ మేస్త్రీలు) భవన నిర్మాణ రంగంలోకి ప్రవేశించడం ద్వారా సంప్రదాయ పాత్రలకు మించి ముందుకు సాగుతున్నారు. 

ఇంకా సవాళ్లు.. : అనేక రంగాల్లో మహిళలు పురోగతి సాధిస్తున్నప్పటికీ మహిళలు ఇప్పటికీ గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా లింగ వేతన అంతరం ఎక్కువగా కనిపిస్తోంది. పురుషులతో పోలిస్తే ఒకే రకమైన పనికి మహిళలకు తక్కువ వేతనం లభిస్తోంది. ప్రధానంగా వ్యవసాయ రంగంలో లింగ వేతన అంతరం ఎక్కువగా ఉంటోంది. గ్రామీణ మహిళలు పెద్ద సంఖ్యలో వ్యవసాయంలో జీతం లేని కుటుంబ కార్మికులుగా పనిచేస్తున్నారు. కార్పొరేట్, సైన్స్, టెక్నాలజీ రంగాల్లో మహిళలు ఉన్నతస్థాయి నాయకత్వ స్థానాలకు వెళ్లడానికి కష్టపడుతున్నారు, సీనియర్‌ స్థాయిల్లో వారి ప్రాతినిధ్యం తగ్గుతోంది.  

‘బోర్డు’ల్లోనూ ఆమె
ప్రైవేట్‌ సంస్థల్లో 29% బోర్డు డైరెక్టర్‌ పదవులను, ప్రభుత్వ సంస్థల్లో 20% డైరెక్టర్ల పోస్టుల్లో మహిళలు కొనసాగుతున్నారు. ఈ ఏడాది జనవరి నాటికి దేశంలోని మొత్తం సంస్థల డైరెక్టర్ల పదవుల్లో 32 శాతం అతివలు ఉన్నారు. బోర్డులో కనీసం ఒక మహిళ ఉన్న ప్రైవేట్‌ కంపెనీలు మొత్తం పురుష బోర్డుల కంటే సగటున 16% నుంచి 29% ఎక్కువ నిధులను సేకరించాయి. 

2015 తర్వాత స్థాపించిన కంపెనీలు పాత సంస్థల కంటే (16%) ఎక్కువ వైవిధ్యాన్ని (20% మహిళలు) కలిగి ఉన్నాయి. బోర్డులో కనీసం ఒక మహిళ ఉన్న ప్రైవేట్‌ కంపెనీలు, పూర్తిగా పురుషుల బోర్డులు ఉన్న వాటి కంటే ఏడాదిలోగా పబ్లిక్‌గా ఇష్యూకు వెళ్లే అవకాశం 10 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement