డిప్యూటీ సీఎంకు తప్పిన హెలికాప్టర్‌ ప్రమాదం | Deputy CM Helicopter makes emergency landing at Lucknow Airport | Sakshi
Sakshi News home page

డిప్యూటీ సీఎంకు తప్పిన హెలికాప్టర్‌ ప్రమాదం

Mar 7 2026 1:21 PM | Updated on Mar 7 2026 1:28 PM

Deputy CM Helicopter makes emergency landing at Lucknow Airport

లక్నో: ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సాంకేతిక లోపం కారణంగా లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. గాలిలో ఉండగానే హెలికాప్టర్ క్యాబిన్‌లో ఒక్కసారిగా పొగలు రావడంతో పైలట్ అప్రమత్తమై,  హెలికాప్టర్‌ను వెనక్కి మళ్లించారు. ఈ ఘటనలో డిప్యూటీ సీఎం సహా అందులోని వారంతా క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

అధికారిక వర్గాల సమాచారం ప్రకారం కేశవ్ ప్రసాద్ మౌర్య శనివారం ఉదయం లక్నో నుంచి కౌశాంబి జిల్లా పర్యటనకు హెలికాప్టర్‌లో బయలుదేరారు. అయితే, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే హెలికాప్టర్ లోపల పొగలు  రావడం పైలట్ దృష్టికి వచ్చింది. ఈ ఆకస్మిక పరిణామంతో అప్రమత్తమైన ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా లక్నో విమానాశ్రయ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులకు సమాచారం అందించారు. తక్షణమే హెలికాప్టర్‌ను వెనక్కి మళ్లించి, విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యగా అధికారులు రన్‌వే వద్ద అన్ని భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనలో మౌర్యతో పాటు ఉన్న సిబ్బంది, పైలట్లకు ఎలాంటి గాయాలు కాలేదని, అందరూ క్షేమంగా ఉన్నారని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం.. కేశవ్ ప్రసాద్ మౌర్య ఉదయం 11:30 గంటల ప్రాంతంలో కౌశాంబి చేరుకోవాల్సి ఉంది. అక్కడ శీతలా దేవి గెస్ట్ హౌస్ సమీపంలో నిర్వహించే ప్రతిష్టాత్మక 'సరస్ మహోత్సవం'ను ఆయన ప్రారంభించాల్సి ఉంది. ఈ పండుగతో పాటు జిల్లాలోని పార్టీ శ్రేణులతో కీలక సమావేశం నిర్వహించడం, వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష జరపడం వంటి కార్యక్రమాలు ఆయన పర్యటనలో భాగంగా ఉన్నాయి. అయితే ఈ అనూహ్య ఘటనతో పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.

హెలికాప్టర్‌లో పొగలు రావడానికి గల అసలు కారణాలపై పౌర విమానయాన శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇంజిన్ వైఫల్యమా లేక విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో నిపుణులు విచారణ చేపట్టనున్నారు. వీఐపీల ప్రయాణానికి వాడే హెలికాప్టర్లలో ఇటువంటి సాంకేతిక లోపాలు తలెత్తడంపై ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ  వార్త తెలియగానే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు నేతలు మౌర్యకు ఫోన్ చేసి, క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement