ఇంటర్నెట్‌ను ఊపేసిన ఈ బాలుడు గుర్తున్నాడా? ఇప్పుడు మరోసారి.. | meme boy whose laugh took over the internet Arun Kumar is back in the spotlight | Sakshi
Sakshi News home page

ఇంటర్నెట్‌ను ఊపేసిన ఈ బాలుడు గుర్తున్నాడా? ఇప్పుడు మరోసారి..

Mar 7 2026 1:13 PM | Updated on Mar 7 2026 6:01 PM

meme boy whose laugh took over the internet Arun Kumar is back in the spotlight

అరుణ్ కుమార్ అనే బాలుడు చేతిలో చాయ్‌ కప్‌ పట్టుకుని నవ్విన వీడియో సామాజిక మాధ్యమాలను ఊపేసింది. ఈ బాలుడి వీడియోను మీరు కూడా ఇప్పటికే మీమ్స్‌లో లెక్కలేనన్ని సార్లు చూసి ఉంటారు. 15 సెకన్ల అతడి చిన్న వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేసింది. 

ఇప్పుడు అతడిని అందరూ గుర్తు పడుతున్నారు. ఆ వీడియోను అతని యజమాని ట్రక్ డ్రైవర్ నెహ్రూ ప్రయాణం మధ్యలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో తీసి, పోస్ట్ చేశాడు. అరుణ్ నవ్వు అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంటర్నెట్‌లో అత్యధికంగా షేర్లు వచ్చిన మీమ్‌లలో ఒకటిగా మారింది. లక్షల మంది ఆ క్లిప్ చూశారు. కానీ, ఆ వీడియోలో కనిపించిన బాలుడి కథ చాలా మందికి తెలియదు.

‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ తెలిపిన సమాచారం ప్రకారం.. అరుణ్ చిన్నప్పటి నుంచే తీవ్రమైన కష్టాలు ఎదుర్కొన్నాడు. పేదరికం కారణంగా చదువును మధ్యలో ఆపాల్సి వచ్చింది. అరుణ్ 10 సంవత్సరాల వయసులోనే 4వ తరగతి చదువుతున్న సమయంలో పాఠశాల చదువును మానేశాడు. అతడి కుటుంబం పేదరికంతో పోరాడుతోంది. చదువు కొనసాగించడం సాధ్యం కాలేదు. పని చేయడం తప్ప మరో మార్గం అతనికి లేదు.

ఆ సమయంలో డ్రైవర్‌ నెహ్రూ అతనిని ట్రక్ క్లీనర్‌గా పనికి పెట్టుకున్నాడు. రోజువారీ పనుల్లో నెహ్రూకి అతడు సాయం చేశాడు. వింత ఏమిటంటే అతని వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతుండగా ప్రజలు అతని గురించి రాసిన కామెంట్లు చదవడం కూడా అరుణ్‌కు సాధ్యం కాలేదు. లక్షల మంది అతని నవ్వును ప్రశంసిస్తున్నా ఆ ప్రశంసలను చదవలేడు.. అర్థం చేసుకోలేడు.

క్లీనర్‌ జీవితాన్ని మార్చుతున్న డ్రైవర్‌

అరుణ్‌ గురించి నెహ్రూ బాగా ఆలోచించాడు. అతని భవిష్యత్తు మార్చాలని నిర్ణయించాడు. నెహ్రూ కూడా ఒకప్పుడు తన కుటుంబాన్ని పోషించేందుకు కాలేజీ చదువును మధ్యలో ఆపాల్సి వచ్చింది. ప్రజలు ఆన్‌లైన్‌లో అరుణ్‌ను ప్రశంసించడం చూసి ఆ బాలుడి భవిష్యత్తు గురించిహ్రూ బాగా ఆలోచించాడు. అరుణ్‌కు పుస్తకాలు కొనిచ్చాడు. పరీక్ష ఫీజులు చెల్లించాడు. 10వ తరగతి బోర్డు పరీక్షను ప్రైవేట్‌గా రాయించాడు.

ట్రక్‌లో ప్రయాణిస్తున్న సమయంలో చాయ్ విరామం సమయాల్లో అరుణ్‌కు నెహ్రూ అక్షరాలు, గణితం నేర్పించాడు. తనకు లభించిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకున్నాడు అరుణ్. ఈ సంవత్సరం అతని కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది. పదో తరగతి బోర్డు పరీక్షలో అతను ఉత్తీర్ణత సాధించాడు. దీంతో అతడి కథ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. 

Advertisement
 
Advertisement
Advertisement