భారత్‌ బాధ్యతాయుతంగా వ్యవహరించింది: అమెరికా | "Indians Have Been Good Actors": Trump Aide On Russian Oil Waiver | Sakshi
Sakshi News home page

భారత్‌ బాధ్యతాయుతంగా వ్యవహరించింది: అమెరికా

Mar 7 2026 11:46 AM | Updated on Mar 7 2026 12:01 PM

"Indians Have Been Good Actors": Trump Aide On Russian Oil Waiver

వాషింగ్టన్‌: పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న వేళ చమురు కొనుగోళ్ల విషయంలో భారత్‌ బాధ‍్యతాయుతంగా వ్యవహరించిందంటూ అమెరికా ట్రెజరీ శాఖ కార్యదర్శి స్కాట్ బెసెంట్ కామెంట్లు చేశారు. పశ్చిమాసియాలో యుద్ధం వేళ.. ఇప్పటికే సముద్ర మార్గాల్లో ప్రయాణిస్తున్న రష్యా చమురును కొనుగోలు చేయటానికి భారత్‌కు అనుమతి ఇచ్చినట్టు అమెరికా తెలిపిన విషయం తెలిసిందే. అయితే, అమెరికా మనకు అనుమతి అనుమతి ఇవ్వడం ఏంటని భారత్‌లో విపక్షాలు మండిపడుతున్నాయి. ఇటువంటి సమయంలో స్కౌట్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

“ప్రపంచానికి చమురు సరఫరా బాగానే కొనసాగుతోంది. ఇప్పటికే సముద్ర మార్గంలో ఉన్న రష్యా చమురు కొనుగోలును ప్రారంభించటానికి మా మిత్ర దేశం భారత్‌కు నిన్న అమెరికా ట్రెజరీ శాఖ అనుమతి ఇచ్చింది” అని స్కాట్ బెసెంట్ శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

“భారత్‌ చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించింది. ముందుగా ఆంక్షలు ఉన్న రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపాలని మేము కోరాం.. భారత్‌ ఆపింది. దాని స్థానంలో అమెరికా నుంచి చమురు కొనాలని భారత్‌ నిర్ణయించింది. కానీ, ప్రపంచ చమురు సరఫరాలో ఏర్పడ్డ తాత్కాలిక లోటును తగ్గించటానికి ఇప్పుడు రష్యా చమురును కొనడానికి మేము భారత్‌కు అనుమతి ఇచ్చాం. రష్యా చమురుపై ఉన్న మరికొన్ని ఆంక్షలను కూడా తొలగించవచ్చు” అని ఆయన తెలిపారు. పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుండడంతో మార్కెట్‌కు ఉపశమనం ఇవ్వటానికి చర్యలు ప్రకటించే ప్రక్రియ కొనసాగుతుంది” అని తెలిపారు.

ట్రంప్ పరిపాలనలోని మరికొంతమంది అధికారులు కూడా రష్యా చమురును కొనుగోలు చేయడానికి  భారత్‌కు అనుమతి ఇచ్చామని చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కొన్ని నెలల క్రితం రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై 25 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడేమో రష్యా నుంచి చమురు కొనుగోలుకు తాత్కాలికంగా అనుమతి ఇచ్చామని అమెరికా అంటోంది.

అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై యుద్ధం చేస్తున్న సమయంలో చమురు సరఫరాకు ఆటంకాలు లేకుండా చేయడం, మార్కెట్లో ఒత్తిడి తగ్గించడమే లక్ష్యమని అమెరికా అధికారులు చెప్పారు. హోర్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న పరిస్థితుల వల్ల చమురు ధరలు పెరుగుతున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement