టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో వెస్టిండీస్ ఫర్వాలేదనిపించగా.. సౌతాఫ్రికా సెమీస్ వరకు ప్రయాణం కొనసాగించింది. లీగ్ దశలో అదరగొట్టిన విండీస్ జట్టు.. సూపర్-8లో కీలక మ్యాచ్‌లో టీమిండియా చేతిలో ఓడి నిష్క్రమించింది.
మరోవైపు.. సౌతాఫ్రికా లీగ్ దశలో అజేయంగా నిలవడంతో పాటు.. సూపర్-8లోనూ హ్యాట్రిక్ విజయాలతో సెమీస్‌లో అడుగుపెట్టింది. అయితే, కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడి మరోసారి ‘చోకర్స్’ అన్న బిరుదును సార్థకం చేసుకుంది. ఇక ఈ రెండు జట్లు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించినా.. ఇంకా ఇంటికి చేరుకోలేదు.
భారత్‌లోనే చిక్కుకుపోయారు
ఇందుకు మధ్య ప్రాచ్యంలోని యుద్ధ వాతావరణం కారణం. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తుండగా.. అందుకు ఇరాన్ కూడా గట్టిగానే బదులిస్తోంది. దీంతో గల్ఫ్ దేశాల్లో గగనతలం మూసివేశారు. దీంతో వెస్టిండీస్, జింబాబ్వే, సౌతాఫ్రికా జట్ల ఆటగాళ్లు భారత్‌లోనే చిక్కుకుపోయారు. అయితే, జింబాబ్వే జట్టును ప్రత్యేక విమానంలో ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)తరలించినట్లు సమాచారం.
ప్రత్యేక విమానం ఏర్పాటు చేసినా..
ఇక వెస్టిండీస్ జట్టు కోసం కూడా ప్రత్యేక విమానం ఏర్పాటు చేయగా.. ఎయిర్ ట్రాఫిక్ అధికారుల నుంచి ఇంత వరకు ఆమోదం లభించనట్లు తెలుస్తోంది. దీంతో ఆటగాళ్లలో మరోసారి ఆందోళన నెలకొంది. కాగా ఇప్పటికే వెస్టిండీస్ హెడ్‌కోచ్ డారెన్ సామీ (Daren Sammy).. తమను స్వదేశానికి చేర్చమంటూ దీనంగా అర్థించిన విషయం తెలిసిందే.
ఇక బౌలర్ అకీల్ హొసేన్ సైతం క్రిస్టియాన్ రొనాల్డోనే ఈ పరిస్థితులలో తమను ఆదుకోగలడంటూ ట్వీట్ చేశాడు. అయితే, ఐపీఎల్‌లో భాగమైన షెర్ఫానే రూథర్‌ఫర్డ్, రోవ్‌మన్ పావెల్, షిమ్రన్ హెట్‌మైర్ తదితరులు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
సౌతాఫ్రికానూ వీడని చిక్కులు
ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా ఆటగాళ్లు కూడా మరికొన్నాళ్లు భారత్‌లోనే ఉండాల్సి రావొచ్చు. అయితే, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో దాదాపు నలుగురు ఆటగాళ్లు నేరుగా కివీస్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. సెమీస్ మ్యాచ్‌లలో సౌతాఫ్రికాను న్యూజిలాండ్.. ఇంగ్లండ్‌ను టీమిండియా ఓడించి ఫైనల్‌కు అర్హత సాధించాయి. ఇరుజట్ల మధ్య ఆదివారం నాటి టైటిల్ పోరుకు అహ్మదాబాద్ వేదిక.
చదవండి: T20 WC Final: బుమ్రా మనిషే.. తనకూ చెడ్డరోజు ఉంటుంది: కివీస్ స్టార్


