T20 WC Final: పిచ్‌ ఎలా ఉండబోతోంది?.. ఎర్ర మట్టితోనా? | T20 WC Final Pitch: Mixed Soil Used After India Intervention Means | Sakshi
Sakshi News home page

T20 WC Final: పిచ్‌ ఎలా ఉండబోతోంది?.. ఎర్ర మట్టితోనా?

Mar 7 2026 10:40 AM | Updated on Mar 7 2026 11:28 AM

T20 WC Final Pitch: Mixed Soil Used After India Intervention Means

టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌

టీమిండియా చరిత్రకు అడుగుదూరంలో ఉంది. వరుసగా రెండుసార్లు టీ20 ప్రపంచకప్‌ గెలిచిన తొలి జట్టుగా అవతరించాలని పట్టుదలగా ఉంది. ఇందుకోసం ఇప్పటికే సన్నాహకాలు మొదలుపెట్టింది సూర్యకుమార్‌ సేన.

సొంతగడ్డపై టీ20 వరల్డ్‌కప్‌-2026 ఆడుతున్న భారత జట్టు లీగ్‌ దశలో అజేయంగా నిలిచింది. సూపర్‌-8లో తొలుత తడబడినా.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించి సెమీస్‌ చేరింది. ఇక సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌తో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లోనూ ఏడు పరుగుల తేడాతో గెలిచి.. టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది.

వరుసగా రెండుసార్లు
తద్వారా వరుసగా రెండుసార్లు ప్రపంచకప్‌ టోర్నీ ఫైనల్‌కు చేరిన జట్టుగా నిలిచింది. ఇక ట్రోఫీ కోసం న్యూజిలాండ్‌తో ఆదివారం అమీతుమీ తేల్చుకోనుంది. అయితే, ఫైనల్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కావడం సెంటిమెంట్‌ పరంగా టీమిండియాకు కాస్త ఇబ్బందికరంగా మారింది. ఇదే వేదికపై 2023 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో భారత్‌ ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది.

ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో తాజా ఫైనల్‌కు సంబంధించిన పిచ్‌ విషయంలో కూడా టీమిండియా తీవ్రంగా ఆలోచిస్తోంది. నిజానికి పిచ్‌ ఎంపిక, తయారీ ఐసీసీ పరిధిలోని అంశం. కానీ ఎర్ర మట్టితో చేసిన పిచ్‌పై ఆడాలనే తమ ఉద్దేశాన్ని భారత జట్టు  వెల్లడించినట్లు తెలుస్తోంది. ఎర్రమట్టితో చేసిన పిచ్‌ బ్యాటింగ్‌కు బాగా అనుకూలిస్తోంది. ముంబైలో ఇదే జరిగింది.

టీమిండియా కోరుకుంది ఇదే
ఇక అహ్మదాబాద్‌లో నల్లరేగడి మట్టితో చేసిన పిచ్‌పై సౌతాఫ్రికా జట్టుతో ‘సూపర్‌–8’ మ్యాచ్‌ ఆడిన సూర్యకుమార్‌ సేన‌ దారుణంగా ఓడిపోయింది. అది పునరావృతం కాకుండా టీమిండియా బ్యాటింగ్‌ పిచ్‌నే కోరుకుంటోంది.  ఈ విషయం గురించి జట్టు సన్నిహిత వర్గాలు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ..

ఎర్ర మట్టితోనే
‘‘నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియాకు మిశ్రమ మట్టితో తయారైన పిచ్‌ లభించనుంది. స్పోర్టింగ్‌ పిచ్‌నే రూపొందిస్తున్నారు. అయితే, ఎక్కువ మటుకు ఇది ఎర్ర మట్టితోనే తయారు చేస్తారు. కాస్త బౌన్సీగా ఉండటంతో పాటు.. బ్యాటర్లకు కూడా అనుకూలిస్తుంది’’ అని పేర్కొన్నాయి.

కాగా టీ20 ప్రపంచకప్‌-2026లో భాగంగా అహ్మదాబాద్‌లో జరిగిన తొలి ఐదు మ్యాచ్‌లలో పేస్‌ బౌలింగ్‌లో 762 బంతుల్లో బ్యాటర్లు 1062 పరుగులు సాధించారు. ఫాస్ట్‌ బౌలర్లకు 45 వికెట్లు దక్కాయి. ఇక స్పిన్‌ బౌలింగ్‌లో 421 బంతుల్లో బ్యాటర్లు 617 పరుగులు రాబట్టగా.. బౌలర్ల ఖాతాలో 20 వికెట్లు చేరాయి. 

చదవండి: T20 WC Final: బుమ్రా మనిషే.. తనకూ చెడ్డరోజు ఉంటుంది: కివీస్‌ స్టార్‌

Advertisement
 
Advertisement
Advertisement