అభిషేక్ శర్మ.. తొలిసారి ప్రపంచకప్ టోర్నీ ఆడుతున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ దారుణంగా విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లలో అతడు చేసిన స్కోర్లు వరుసగా.. 0 (1), 0 (4), 0 (3), 15 (12), 55 (30), 10 (11), 9 (7).
విఫలమైనా..
లీగ్ దశలో మూడు మ్యాచ్‌లు ఆడి డకౌట్ అయినా యాజమాన్యం అభిషేక్ శర్మ (Abhishek Sharma)ను ఓపెనర్‌గా కొనసాగించిది. అయితే, అతడి ఆట తీరు మాత్రం మారలేదు. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో కీలక సెమీ ఫైనల్లోనూ ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ తేలిపోయాడు. తొందరపడి వికెట్ పారేసుకుని తొమ్మిది పరుగులకే నిష్క్రమించాడు.
సంజూ మెరుపు ఇన్నింగ్స్
మరో ఓపెనర్ సంజూ శాంసన్ (Sanju Samson) మెరుపు ఇన్నింగ్స్ (42 బంతుల్లో 89) తో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం ఈ ఓపెనింగ్ బ్యాటర్ వైఖరిని తప్పుబట్టాడు.
తలతిక్క బ్యాటింగ్
‘‘ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో అతడు తలతిక్కగా బ్యాటింగ్ చేశాడు. నిజానికి అభిషేక్ గేమ్‌ప్లాన్‌కు నేను వీరాభిమానిని. విల్ జాక్స్ బౌలింగ్‌లో అతడు ఎనిమిది పరుగులు రాబట్టాడు. కానీ ఈ తర్వాత అతడి ఓవర్లోనే 30 పరుగులు తీయాలి అన్నట్లు తొందరపడ్డాడు.
నీకంత దూకుడు ఎందుకు?
కొన్నిసార్లు బాల్‌ను వదిలేయాల్సి ఉంటుంది. ఓవైపు సంజూ శాంసన్ కుదురుగా ఆడుతున్నాడు కదా!.. నీకు కష్టంగా అనిపిస్తే ఒక సింగిల్ తీసి మరో ఎండ్‌కు వెళ్లిపోవాల్సింది. ఆ తర్వాత మళ్లీ అవకాశం వస్తుంది కదా!.. ఏదేమైనా అంత దూకుడు పనికిరాదు’’ అని అశ్విన్ అభిషేక్‌పై మండిపడ్డాడు.
అదే విధంగా.. న్యూజిలాండ్‌తో ఫైనల్ నేపథ్యంలో.. ‘‘అభిషేక్ మంచి బ్యాటర్. న్యూజిలాండ్‌తో ఇటీవలి సిరీస్‌లో సూపర్ ఫామ్ కనబరిచాడు. మిచెల్ సాంట్నర్, మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో గతంలో అదరగొట్టాడు.
ఒత్తిడిలో ఉన్నాడు
అయితే, ఇప్పుడు అతడు ఒత్తిడిలో ఉన్నాడు. కెప్టెన్, హెడ్‌కోచ్ అతడితో మాట్లాడాలి. తనకు వ్యతిరేకంగా ప్రత్యర్థి జట్టు వద్ద ఉన్న ప్రణాళికలను వివరించాలి. అతడిలో గొప్ప ప్రతిభ ఉంది. కానీ ఎందుకో తడబడుతున్నాడు.
ఇలాంటి తరుణంలో అతడిపై మరింత ఒత్తిడి చేసే విధంగా మేనేజ్‌మెంట్ ఉండకూడదు. మానసికంగా దృఢంగా తయారయ్యేలా తీర్చిదిద్దాలి’’ అని టీమిండియా యాజమాన్యానికి అశూ సూచనలు ఇచ్చాడు.
కాగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆ జట్టు కెప్టెన్ హ్యారీ బ్రూక్.. అభిషేక్ కోసం లెగ్‌సైడ్‌లో ఒకే ఒక్క ఫీల్డర్‌ను ఉంచాడు. అతడికి క్యాచ్ ఇచ్చి అభిషేక్ పెవిలియన్ చేరాడు. ఇదిలా ఉంటే.. మార్చి 8న భారత్- న్యూజిలాండ్ మధ్య టీ20 ప్రంచకప్-2026 ఫైనల్‌కు షెడ్యూల్ ఖరారైంది.
చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్


