ఇంగ్లండ్ కల చెదిరింది. టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో అడుగుపెట్టాలనుకున్న బ్రూక్ బృందాన్ని టీమిండియా గట్టి షాకిచ్చింది. ముంబై వేదికగా గురువారం నాటి సెమీ ఫైనల్లో ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి భారత్ ఫైనల్‌కు దూసుకువెళ్లింది.
ఆఖరి వరకు పోరాడినా ఇంగ్లండ్‌కు చేదు అనుభవమే మిగిలింది. ఇక టీమిండియా గెలుపులో అక్షర్ పటేల్ (Axar Patel)దీ కీలక పాత్రే. సంజూ శాంసన్ బ్యాట్‌తో రాణించగా.. జస్‌ప్రీత్ బుమ్రా బంతితో అదరగొట్టాడు. వీరిద్దరికి తోడు అక్షర్ అందుకున్న క్యాచ్‌లే గెలుపును టీమిండియా వైపు తిప్పాయి.
ఇంగ్లండ్ హెడ్‌కోచ్ బ్రెండన్ మెకల్లమ్ (Brendon McCullum) కూడా ఇదే మాట అంటున్నాడు. తమ ఓటమికి గల కారణాలు విశ్లేషిస్తూ.. అక్షర్ అందుకున్న అద్భుత క్యాచ్‌లే మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకున్నాయని పేర్కొన్నాడు. స్కై స్పోర్ట్స్ క్రికెట్‌తో మాట్లాడుతూ..
అద్భుత రీతిలో క్యాచ్‌లు అందుకుని
‘‘నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్‌లో అక్షర్ అందుకున్న ఆ రెండు క్యాచ్‌ల గురించి మాట్లాడాలి. వాంఖడే మైదానంలో ఇలాంటి క్యాచ్‌లు అంత సులువేమీ కాదు. ఈ మ్యాచ్‌లో టీమిండియా తమ ప్రణాళికలను పక్కాగా అమలు చేసింది.
ముఖ్యంగా అక్షర్ అద్భుత రీతిలో క్యాచ్‌లు అందుకుని మ్యాచ్‌ను టీమిండియా వైపు తిప్పేశాడు. కీలక సమయంలో అతడు రాణించాడు. నిజానికి చాన్నాళ్లుగా వాళ్ల ఫీల్డింగ్ అంత గొప్పగా ఏమీ లేదు.. ఈ రోజు మా వాళ్లే ఇంకాస్త మెరుగ్గా ఆడి ఉండే బాగుండేది. ఏదేమైనా వాళ్లకి (టీమిండియా) క్రెడిట్ ఇవ్వాల్సిందే’’ అని మెకల్లమ్ చెప్పుకొచ్చాడు.
𝗕𝗮𝗽𝘂 𝗯𝗮𝘁𝘁𝗲𝗿𝘀 𝗸𝗲 𝗹𝗶𝘆𝗲 𝗵𝗮𝗻𝗶𝗸𝗮𝗿𝗮𝗸 𝗵𝗮𝗶. 🥵
ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | SUN, 8th MAR, 5:30 PM pic.twitter.com/4e06e0SYAv— Star Sports (@StarSportsIndia) March 5, 2026
అక్షర్ ఫీల్డింగ్.. భారత్ విజయానికి బాటలు
కాగా ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో అక్షర్ పటేల్ రెండు క్యాచ్‌లు అందుకున్నాడు. తొలుత హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఫిల్ సాల్ట్ (5) ఇచ్చిన సులువైన క్యాచ్‌ను అందుకున్నాడు. అయితే, కెప్టెన్, డేంజరస్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ బుమ్రా బౌలింగ్‌లో బంతిని గాల్లోకి తరలించగా.. పాయింట్ నుంచి చాలా దూరం పరిగెత్తి అక్షర్ బంతిని అందుకున్నాడు.
అయితే, అన్నింటికంటే విల్ జాక్స్ (35) ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ వద్ద అద్భుత రీతిలో అందుకున్నా పట్టు కోల్పోయినట్లు అనిపించగా.. అక్కడే ఉన్న దూబే వైపు విసరగా అతడు బంతిని క్యాచ్ పట్టాడు. ఇలా మ్యాచ్‌ను మలుపుతిప్పిన కీలక క్యాచ్‌లోనూ అక్షర్ భాగమయ్యాడు.


