T20 WC 2026 Final: అభిషేక్‌పై వేటు పడుతుందా..? | Will India drop Abhishek Sharma in T20 World cup 2026 final against New Zealand? | Sakshi
Sakshi News home page

T20 WC 2026 Final: అభిషేక్‌పై వేటు పడుతుందా..?

Mar 6 2026 2:03 PM | Updated on Mar 6 2026 2:08 PM

Will India drop Abhishek Sharma in T20 World cup 2026 final against New Zealand?

టీ20 ప్రపంచకప్‌ 2026 ఫైనల్‌కు ముందు టీమిండియాను ఓ విషయం తెగ కలవరపెడతుంది. విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఎన్ని అవకాశాలు ఇచ్చినా గాడిలో పడలేకపోవడంతో యావత్‌ భారతం ఆందోళన చెందుతుంది. ఈ టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌట్లైన అతను.. సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌తో జరిగిన కీలక సమరాల్లోనూ చేతులెత్తేశాడు. టోర్నీ మొత్తంలో జింబాబ్వే మ్యాచ్‌ మినహాయించి ఒక్క మ్యాచ్‌లో కూడా కనీస ప్రదర్శనలు చేయలేకపోయాడు. మొత్తంగా 7 ఇన్నింగ్స్‌ల్లో 12.71 సగటున 89 పరుగులు మాత్రమే చేశాడు.

వరుస వైఫల్యాల నేపథ్యంలో మార్చి 8న న్యూజిలాండ్‌తో జరుగబోయే ఫైనల్‌ మ్యాచ్‌లో అభిషేక్‌కు ఆడించాలా వద్దా అన్న చర్చ భారత క్రికెట్‌ సర్కిల్స్‌లో జోరుగా సాగుతుంది. మేనేజ్‌మెంట్‌ అభిషేక్‌ను వెనకేసుకొస్తున్నప్పటికీ.. అభిమానులు మాత్రం  వేటు వేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. భారత దేశ పరువు సమస్య కాబట్టి, ఛాన్స్‌లు తీసుకోవద్దని సూచిస్తున్నారు.

క్లిష్ట సమయంలో మేనేజ్‌మెంట్‌తో పాటు సహచరులు, కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ అభిషేక్‌కు అండగా నిలుస్తున్నారు. తాజాగా మరో ఓపెనర్‌ సంజూ శాంసన్‌ మాట్లాడుతూ.. భారత జట్టు అభిషేక్‌పై నమ్మకం కోల్పోలేదని అన్నాడు. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చాలా పాజిటివ్‌గా ఉంది. ప్రతి ఆటగాడికి ఎత్తుపల్లాలు సహజమే అని వెనకేసుకొచ్చాడు. ఒకట్రెండు మంచి షాట్లు ఆడితే ఫామ్‌ తిరిగి వస్తుంది. ఫైనల్‌ అతని రోజు కావచ్చని సహచరుడికి పూర్తి స్థాయి మద్దతు తెలిపాడు.

వాస్తవానికి అభిషేక్‌ వరుస వైఫల్యాలకు అతనిపై ఉన్న అధిక అంచనాలే కారణమని నిపుణులు అంటున్నారు. ఒత్తిడి అధికం కావడం వల్ల అభిషేక్‌ తడబడుతున్నాడని అభిప్రాయపడుతున్నారు. అతనికి ఫ్రీ హ్యాండ్‌ ఇస్తే సత్ఫలితాలు రావచ్చని అంటున్నారు. 

పరుగులు రాబట్టేందుకు కష్టపడుతున్న మాట కూడా వాస్తమే అయినప్పటికీ.. ఒక్కసారి లైన్‌లోకి వచ్చాడంటే, అతన్ని ఆడపం కష్టమని అంటున్నారు. ఆఫ్‌ స్పిన్‌ను ఎదుర్కోవడంలో లోపాలు సరిదిద్దుకుంటే రాణించగలడని అంచనా వేస్తున్నారు. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా, కీలకమైన ఫైనల్లో రాణిస్తే మాత్రం అభిషేక్‌ భారత క్రికెట్‌లో చిరస్థాయిగా గుర్తుండిపోతాడు.

ప్రస్తుత ప్రపంచకప్‌లో అభిషేక్‌ ప్రదర్శనలు..
యూఎస్‌ఏపై 0 (1)
నమీబియాపై ఆడలేదు
పాకిస్తాన్‌పై 0 (4)
నెదర్లాండ్స్‌పై 0 (3)
సౌతాఫ్రికాపై 15 (12 బంతులు; 2 ఫోర్లు, సిక్స్‌)
జింబాబ్వేపై 55 (30 బంతులు; 4 ఫోర్లు, 4 సిక్సర్లు)
వెస్టిండీస్‌పై 10 (11 బంతులు; 2 ఫోర్లు)
ఇంగ్లండ్‌పై 9  (7 బంతులు; 2 ఫోర్లు)

కాగా, టీ20 ప్రపంచకప్‌ 2026 తుది అంకానికి చేరింది. భారత్‌, న్యూజిలాండ్‌ ఫైనల్స్‌కు చేరాయి. న్యూజిలాండ్‌ సౌతాఫ్రికాను.. భారత్‌ ఇంగ్లండ్‌ను మట్టికరిపించి తుది పోరులో అమీతుమీకి సిద్దమయ్యాయి. ఈ సమర​​ం మార్చి 8న అహ్మదా​బాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం​ వేదికగా జరుగనుంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement