భారత ప్రీమియం ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా ఓ చరిత్రాత్మక మైలురాయిని తాకాడు. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో నిన్న (మార్చి 5) జరిగిన రెండో సెమీఫైనల్లో హ్యారీ బ్రూక్ వికెట్ తీయడంతో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత అరుదైన 500 వికెట్ల క్లబ్‌లో చేరాడు. ఈ మ్యాచ్‌లో తన స్పెల్ తొలి బంతికే ఈ ఘనత సాధించాడు.
32 ఏళ్ల బుమ్రా ఇప్పటివరకు 52 టెస్ట్‌ల్లో 234 వికెట్లు.. వన్డేల్లో 89 మ్యాచ్‌ల్లో 149.. టీ20ల్లో 94 మ్యాచ్‌ల్లో 117 వికెట్లు తీశాడు.
2016 జనవరి 23న అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బుమ్రా.. అతి తక్కువ వ్యవధిలోనే 500 వికెట్ల మైలురాయిని తాకాడు. ఈ ఘనత సాధించిన ఎనిమిదవ భారత బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. బుమ్రాకు ముందు అనిల్ కుంబ్లే, అశ్విన్, హర్భజన్, కపిల్ దేవ్, రవీంద్ర జడేజా, జహీర్ ఖాన్, జవగల్ శ్రీనాథ్ ఈ ఘనత సాధించారు.
ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో సామర్థ్యం మేరకు సత్తా చాటుతున్న బుమ్రా.. నిన్న ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో అత్యంత కీలకపాత్ర పోషించాడు. 254 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ గెలుపు దిశగా పయనిస్తున్న వేల ఓ పొదుపైన ఓవర్‌తో మ్యాచ్‌ను భారత్‌వైపు మల్లించాడు.
18 బంతుల్లో 45 పరుగులు చేయాల్సిన తరుణంలో ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన బుమ్రా కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లండ్ లక్ష్యాన్ని మరింత దూరం చేశాడు. 19వ ఓవర్ బంతిని అందుకున్న హార్దిక్ ప్రమాదకరంగా కనినిస్తున్న సామ్ కర్రన్‌ను ఔట్ చేయడంతో పాటు ఆ ఓవర్‌లో 9 పరుగులు మాత్రమే ఇవ్వడంతో భారత్‌కు గెలుపుపై ధీమా వచ్చింది.
చివరి ఓవర్ వేసిన దూబే తొలి బంతికే విధ్వంసకర సెంచరీతో (48 బంతుల్లో 105; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) వీరంగం సృష్టించిన బేతెల్‌ను ఔట్ చేయడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. ఆతర్వాత రెండు బంతులకు సింగిల్స్ మాత్రమే ఇచ్చిన దూబే... చివరి మూడు బంతులకు సిక్సర్లు ఇచ్చినప్పటికీ (ఆర్చర్) అప్పటికే ఇంగ్లండ్ ఓటమి ఖరారైపోయింది. ఈ మ్యాచ్‌లో బుమ్రా అత్యంత పొదుపైన బౌలర్‌గా నిలవడంతో పాటు మ్యాచ్ మలుపు తిప్పే ఓవర్ వేసి అత్యంత కీలకమైన హ్యారీ బ్రూక్ వికెట్ తీశాడు.
ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా.. గ్రూప్ దశలో పాకిస్తాన్, సూపర్-8లో విండీస్.. సెమీస్‌లో ఇంగ్లండ్‌పై కీలక ప్రదర్శనలు చేసి మొత్తం 10 వికెట్లు తీశాడు.
వరుసగా రెండో మ్యాచ్‌లో సంజూ హిట్
ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సంజూ శాంసన్ వరుసగా రెండో మ్యాచ్‌లో ఇరగదీయడంతో (89) నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్ (39), శివమ్ దూబే (43), హార్దిక్ పాండ్యా (27), తిలక్ వర్మ (21) సైతం మెరుపు ఇన్నింగ్స్‌లతో అలరించారు. కాగా, భారత్ మార్చి 8న జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది.


