ముంబై: టి20 వరల్డ్ కప్‌ను నిలబెట్టుకునే ప్రయత్నంలో భారత జట్టు ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచింది. వరుసగా రెండోసారి మన టీమ్ తుది పోరుకు అర్హత సాధించింది.
గురువారం వాంఖెడే మైదానంలో హోరాహోరీగా సాగిన రెండో సెమీఫైనల్ సమరంలో 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి భారత్ ఫైనల్లోకి అడుగు పెట్టింది.
టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా, ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సంజు సామ్సన్ (42 బంతుల్లో 89; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగగా... శివమ్ దూబే (25 బంతుల్లో 43; 1 ఫోర్, 4 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించారు.
అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు చేసి ఓడిపోయింది.
ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడుతుంది. భారత్, కివీస్ మధ్య టి20 వరల్డ్ కప్ ఫైనల్ జరగడం ఇదే తొలిసారి.


