హెయిర్‌కట్‌ తప్పిదానికి..రూ. 5 కోట్ల పరిహారం! | Woman Seeks Rs 5.2 Crore Compensation From A Reputed Salon For Bad Haircut, Supreme Court Gives Shocking Verdict | Sakshi
Sakshi News home page

హెయిర్‌కట్‌ తప్పిదానికి..రూ. 5 కోట్ల పరిహారం! చివరిలో సుప్రీం కోర్టు గట్టి ఝలక్‌

Mar 5 2026 5:40 PM | Updated on Mar 5 2026 5:53 PM

For bad haircut lady asks for Rs 5.2 crore compensation from a reputed salon

హెయిర్‌కట్‌ తప్పిదానికి ఓ మహిళ ఏకంగా కోట్లలో నష్టపరిహారం కోరింది. సరిగ్గా హెయిర్‌ కటింగ్‌ చేయకపోవడం వల్ల ఉద్యోగంలో ఉన్నతి పదవిని కోల్పోయానని, అధిక వేతనం పొందలేకపోయానంటూ కోర్టుని ఆశ్రయించింది. చిన్నపాటి తప్పిదాన్ని పెద్దగా చేసి చూపించి వినియోగదారుల కేసులో కోట్లలో నష్టపరిహారం పొందింది. పాపం సదరు సెలూన్‌ సెంటర్‌ ఇంత చిన్నతప్పిదానికి అంత భారీ పరిహారమా అని సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే..మళ్లీ అమాంతం పరిహారం పెంచేసింది. చివరికి ఆమెకు ధర్మాసనం ఊహించని దిమ్మతిరిగిపోయే ఝలక్‌ ఇచ్చింది. 

అసలేం జరిగిందంటే..ఏప్రిల్ 12, 2018న, ఆమె హెయిర్ కట్ కోసం ఒక ఫైవ్ స్టార్ హోటల్ బ్యూటీ సెలూన్‌కి వెళ్లింది. కానీ వాళ్లు పొరపాటున తప్పుగా కట్‌చేశారు. దాంతో వాళ్ల సేవకు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. జూలై 2018లో వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. సెప్టెంబర్ 21, 2021న, వినియోగదారుల కమిషన్ బ్యూటీ సెలూన్‌ను తప్పుపడుతూ బాధిత మహిళకు ఏకంగా రూ. 2 కోట్లు నష్టపరిహారం చెల్లించమని ఆదేశించింది. 

వినియోగదారుల కమిషన్ ఆదేశంతో అసంతృప్తి చెందిన బ్యూటీ సెలూన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే పరిహారం మొత్తం అంచనా వేసేందుకు ఆ కేసుని తిరిగి వినియోగదారుల కమిషన్‌కు పంపింది ధర్మాసనం. దాంతో ఆ మహిళ తన క్లైయిమ్‌ను అమాంతం రూ.2 కోట్లు నుంచి రూ. 5.2 కోట్లుకు పెంచేసింది. పైగా అందుకోసం కమిషన్‌ ముందు పలు పత్రాలను కూడా సమర్పించింది. వినియోగదారుల కమిషన్‌ ఆ పత్రాలను పరిశీలించి ఆమె ఫిర్యాదు దాఖలు చేసిన తేదీ నుంచి చెల్లింపు జరిగే రోజుకి రూ. 9 వడ్డీతో కలిపి మళ్లీ రూ. 2 కోట్లు పరిహారంగా మంజూరు చేసింది. 

దాంతో మనస్తాపం చెంది బ్యూటీ సెలూన్‌ మళ్లీ సుప్రీంకోర్టులో మరో అప్పీల్‌ దాఖలు చేసింది. దీంతో ఆ మహిళ సుప్రీంకోర్టు ముందు, ఆమె తాను ఉన్నత విద్యావంతురాలైన మహిళనని, కలకత్తాలోని ఐ.ఐ.ఎం. నుంచి మేనేజ్‌మెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని, మాస్ కమ్యూనికేషన్‌లో డిప్లొమా కూడా చేశానని పేర్కొంది. ఆ సెలూన్‌లో హెయిర్‌ కటింగ్‌ చేసుకోకముందు తనకు మంచి కెరీర్‌ ఉందని చెప్పింది. కానీ బ్యూటీ సెలూన్‌ దానిని ఖండించింది. 

హెయిర్‌ అనేది ఆత్మవిశ్వాసంతో ముడిపడి ఉన్న అంశంగా వాదించింది. పైగా ఎగ్జిక్యూటివ్‌ పదవుల్లో ఉన్నవాళ్లు సినీ సెలబ్రిటీలు లేదా మోడలింగ్‌ వాళ్ల మాదిరిగా జుట్టు కత్తిరించుకోకూడదని వాదించింది. అందువల్ల జాబ్‌ కెరీర్‌ పాడైందని, ఉన్నతి పదవులు కోల్పోయానని, భారీ వేతనం అదుకోవాల్సిన తాను తక్కువ మొత్తంలో జీతం పొందుతున్నానని తన గోడును వినిపించింది. అంతేగాదు హెయిర్ కట్ కోసం వెళ్ళినప్పుడు, మార్కెటింగ్ రీసెర్చ్ కంపెనీలో పనిచేస్తున్నానని, కానీ జూన్ 2018లో తన ఉద్యోగాన్ని ఈ కారణంగా కోల్పోయానని పేర్కొంది. 

అయితే ఈ సంఘటనకు ముందు, తర్వాత ఆదాయ పన్ను రిటర్న్‌లను సమర్పించడంలో విఫలమైందని సెలూన్‌ తరుపు న్యాయవాది వాదించారు. అలాగే అంత భారీ మొత్తంలో నష్ట పరిహారం పొందేలా సరైన ప్రామాణిక పత్రాలు ఏమి సమర్పించ లేదని కోర్టు గుర్తించింది. దాంతో కోర్టు కేవలం బాధతురాలి అంచనాలు, ఆమె ఇష్టాఇష్టాలను అనుసరించి పరిహారం ఇవ్వరని స్పష్టం చేసింది. 

అలాగే ఈ న్యాయపోరాటంలో గతంలో సదరు సెలూన్‌ 25 లక్షలు కోర్టులో డిపాజిట్‌ చేసిందని గుర్తుచేస్తూ..అంతమొత్తం మీరు సమర్పించిన పత్రాలకు అనుగుణంగా సరిపోతుందని స్పష్టం చేసింది. అంతేగాదు ఓ వ్యక్తి పెద్ద మొత్తంలో పరిహారం పొందాలంటే..అతనికి జరిగిన నష్ట తీవ్రతను అంచనా వేస్తారు. అందుకు తగిన డాక్యుమెంట్స్‌, సాక్షాధారాలు కూడా ఉండాలంటూ సదరు మహిళకు చురకలు అంటించింది.

(చదవండి: అర్జున్‌-సానియా వివాహంలో పుత్తడి బొమ్మలా నీతా స్టైలిష్‌ లుక్‌..!)

 

Advertisement
 
Advertisement
Advertisement