ఢిల్లీ: ఎన్‌సీఈఆర్టీ 8వ తరగతి పాఠ్యాంశంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో కేంద్రం చర్యలకు సిద్ధమైంది. సిలబస్ రూపొందించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం తెలిపింది. ఇలాంటి సిలబస్‌తో పిల్లలపై చెడు ప్రభావం పడుతుందని కేంద్రం పేర్కొంది.
కాగా, సుప్రీం వార్నింగ్‌తో ఎన్సీఈఆర్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. "న్యాయవ్యవస్థలో అవినీతి" అనే సెక్షన్‌ను ఎనిమిదో తరగతి పాఠ్యాంశం నుంచి ఎన్సీఈఆర్టీ తొలగించనుంది. న్యాయవ్యవస్థపై ప్రతికూల అంశాల కంటే, స్ఫూర్తిదాయక అంశాలు రాయాలని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
న్యాయ వ్యవస్థలో అవినీతి అనే పాఠ్యాంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. న్యాయ వ్యవస్థను కించపరిచే ప్రయత్నాలను సహించమంటూ ఆయన హెచ్చరించారు. ఈ అంశంపై తగ్గిన చర్యలు తీసుకుంటామని సీజేఐ వెల్లడించారు. న్యాయవ్యవస్థకు ఉన్న అతిపెద్ద సవాళ్లు అవినీతి, న్యాయమూర్తుల ఖాళీలంటూ ఎన్సీఈఆర్టీ ఎనిమిదవ తరగతి పాఠ్యపుస్తకం పేర్కొంది.
న్యాయ వ్యవస్థను అవినీతి మయమని పేర్కొనడం ఆందోళనకరమంటూ సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింగ్వి.. సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశాన్ని సుమోటో కేసుగా విచారించాలని విజ్ఞప్తి చేశారు. న్యాయవ్యవస్థను కించపరిచేందుకు ఉద్దేశపూర్వకంగా చేశారని, తీవ్రంగా పరిగణిస్తున్నానని.. తగిన చర్యలు తీసుకుంటామని సీజేఐ తెలిపారు.


