ట్రంప్‌ టారిఫ్‌లు చెల్లవ్‌! | US Supreme Court Strikes Down Trump Tariffs | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ టారిఫ్‌లు చెల్లవ్‌!

Feb 21 2026 3:08 AM | Updated on Feb 21 2026 3:08 AM

US Supreme Court Strikes Down Trump Tariffs

అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. అధ్యక్షుడు ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ

పన్ను విధింపు అధికారం కాంగ్రెస్‌దే 

రాజ్యాంగం అధ్యక్షుడికి ఆ అధికారమివ్వలేదు 

టారిఫ్‌లకు ఐఈఈపీఏ చట్టాన్ని వాడటం చెల్లదు 

6:3 మెజారిటీతో తీర్పు వెలువరించిన కోర్టు 

దేశాలతో యుద్ధం చేస్తున్నారా అంటూ వ్యాఖ్యలు 

సిగ్గుచేటైన తీర్పు అంటూ ట్రంప్‌ మండిపాటు

న్యూయార్క్‌/వాషింగ్టన్‌: రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటినుంచీ ఎడాపెడా టారిఫ్‌లతో ప్రపంచ దేశాలన్నింటికీ వణుకు పుట్టించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ దేశాలపై ఆయన విధించిన అధిక టారిఫ్‌లను, ప్రతీకార సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ అదనపు టారిఫ్‌ల వడ్డనకు 1977 నాటి ఇంటర్నేషనల్‌ ఎమర్జెన్సీ ఎకనామిక్‌ పవర్స్‌ యాక్ట్‌ (ఐఈఈపీఏ) చట్టాన్ని ట్రంప్‌ ఉపయోగించుకున్నారు.

అది చెల్లబోదంటూ సుప్రీంకోర్టు కుండబద్దలు కొట్టింది. చట్టసభ అయిన కాంగ్రెస్‌ను కాదని అత్యవసర చట్టాన్ని అడ్డుపెట్టుకుని అధ్యక్షుడే ఇలా స్వయంగా ఏకపక్షంగా టారిఫ్‌లు విధించడం, వాటిలో మార్పుచేర్పులు చేయడం రాజ్యాంగవిరుద్ధమని స్పష్టం చేసింది. ‘ఇలా అడ్డగోలు టారిఫ్‌లు విధించేందుకు ప్రపంచంలోని ప్రతి దేశంతోనూ అమెరికా యుద్ధమేమీ చేయడం లేదు!’అంటూ తీవ్రంగా ఆక్షేపించింది. ఈ మేరకు 9 మంది జడ్జీలతో కూడిన బెంచ్‌ 6:3 మెజారిటీతో సుప్రీంకోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది.

ఈ తీర్పుతో గత ఏడాది కాలంగా పలు దేశాలపై ట్రంప్‌ విధించిన టారిఫ్‌లలో చాలావరకు చెల్లకుండా పోయాయి. ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌ (మాగా)’నినాదంతో రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన ట్రంప్, తన ఆర్థిక ఎజెండాకు టారిఫ్‌లనే ప్రధానాంశంగా మార్చుకోవడం తెలిసిందే. టారిఫ్‌లతో పలు దేశాలను బెదిరించి మరీ దార్లోకి తెచ్చుకుంటూ వచ్చారు. ఎమర్జెన్సీ అధికారాలను ఉపయోగించుకుని 2025 ఏప్రిల్‌ నుంచి కెనడా, చైనా, మెక్సికోలతో మొదలుపెట్టి పలు దేశాలపై వరుసగా టారిఫ్‌లు విధిస్తూ వచ్చారు.

దీన్ని సవాలు చేస్తూ డెమొక్రటిక్‌ పార్టీ ఆధిపత్యంలోని పలు రాష్ట్రాలు కోర్టుకెక్కాయి. ఐఏఏపీఏలో టారిఫ్‌ల గురించిన ప్రస్తావనే లేదని, కనుక ట్రంప్‌ చర్యలు పూర్తిగా చట్టవిరుద్ధమని వాదించాయి. పలు వ్యాపార సంస్థలు కూడా వ్యక్తిగత హోదాల్లో సవాలు చేశాయి. వాటివల్ల ధరలు పెరిగి సామాన్యునిపైనే భారం పడుతుందని పేర్కొన్నాయి. వాటన్నింటినీ గత సెపె్టంబర్లో విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.

ట్రంప్‌ అధిక టారిఫ్‌ల కారణంగా గత డిసెంబర్‌ నాటికే సుంకాల రూపంలో అమెరికాకు 133 బిలియన్‌ డాలర్ల మేరకు అధిక ఆదాయం లభించినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి! తీర్పు నేపథ్యంలో దేశాలన్నీ ఈ అధిక టారిఫ్‌ మొత్తాలను తిరిగివ్వాల్సిందిగా అమెరికాను డిమాండ్‌ చేయవచ్చు. అందుకోసం అంతర్జాతీయ న్యాయస్థానం మెట్లెక్కే అవకాశం కూడా ఉంది. ఈ విషయమై పలు కంపెనీలు తీర్పుకు ముందే వ్యక్తిగత హోదాలో దావాలు వేశాయి కూడా. అవన్నీ తాజా తీర్పు పట్ల హర్షం వెలిబుచ్చాయి. వసూలు చేసిన అధిక మొత్తాలను తిరిగివ్వకపోతే కోర్టు తీర్పుకు అర్థమే ఉండదని సదరు కంపెనీలు అభిప్రాయపడ్డాయి.

అయితే అధిక టారిఫ్‌ వసూళ్లను ఆయా దేశాలకు తిరిగి చెల్లించాలా, లేదా అన్న అంశంపై మాత్రం సుప్రీంకోర్టు తీర్పులో ఏమీ పేర్కొనలేదు. ఇది ట్రంప్‌కు కాస్త ఉపశమనం కలిగించే అంశమేనని భావిస్తున్నారు. కోర్టు తీర్పుపై వైట్‌హౌస్‌ ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే, ఐఏఏపీఏ కాకుండా ఇతర చట్టాల కింద సుంకాలు విధించకుండా ట్రంప్‌ను తాజా తీర్పు నిరోధించబోదు. ఈ నేపథ్యంలో టారిఫ్‌ల విధివిధానాలను ఇతర చట్టాల కిందకు బదలాయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ట్రంప్‌ యంత్రాంగం శుక్రవారం సంకేతాలిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు అమెరికా స్టాక్‌మార్కెట్లో జోష్‌ నింపింది. తీర్పు నేపథ్యంలో పలు కీలక సూచీలు శుక్రవారం సానుకూలంగా స్పందించాయి. అమెరికాకు చెందిన పలు చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలు కూడా తీర్పు పట్ల హర్షం వెలిబుచ్చాయి. 

వాదోపవాదాలు 
టారిఫ్‌లపై సుప్రీంకోర్టులో దాఖలైన ఈ కేసు విచారణకు ట్రంప్‌ చాలా ప్రాధాన్యమిస్తూ వచ్చారు. దీనిపై వెలువరించే తీర్పు అమెరికా చరిత్రలోనే అత్యంత ముఖ్యమైనదని కానుందని ఆయన పలుమార్లు చెప్పుకొచ్చారు. ‘‘సుంకాలకు వ్యతిరేకంగా తీర్పు వస్తే దేశానికి ఆర్థికంగా కోలుకోలేని దెబ్బే! దేశ ఆర్థిక వ్యవస్థే పూర్తిగా పట్టాలు తప్పుతుంది’’అని హెచ్చరించారు కూడా. కానీ అమెరికాలో ప్రజాభిప్రాయం కూడా ట్రంప్‌ టారిఫ్‌లకు అంత సానుకూలంగా లేదని పలు సర్వేల్లో వెల్లడవుతూ వచ్చింది. 1977 నాటి చట్టం ప్రకారం అత్యవసర సమయాల్లో దిగుమతులపై అదనపు పన్నులు విధించే అధికారం అధ్యక్షునికి ఉందన్నది ట్రంప్‌ యంత్రాంగం వాదన.

దాన్ని పలువురు అధ్యక్షులు చాలాసార్లు ఉపయోగించుకున్నారని అధికారులు చెబుతూ వచ్చారు. సుప్రీంకోర్టులో న్యాయ శాఖ కూడా తాజాగా ఇదే వాదన వినిపించింది. దానితో కోర్టు ఏకీభవించలేదు. సుంకాల విధింపుకు ఆ చట్టాన్ని ఉపయోగించుకున్న తొలి అధ్యక్షుడు ట్రంపే కావడాన్ని ప్రధాన న్యాయమూర్తి రాబర్ట్స్‌ తన మెజారిటీ తీర్పులో ఉటంకించారు. ‘‘గతంలో ఏ అధ్యక్షుడూ ఐఈఈపీఏ కింద సుంకాలను విధించలేదు. ఆ చట్టం ప్రకారం అధ్యక్షునికి అలాంటి అధికారం లేదనేందుకు ఇదే నిదర్శనం’’అని ఆయన పేర్కొన్నారు. పన్నుల విధింపు అధికారాన్ని అమెరికా రాజ్యంగం కాంగ్రెస్‌కు దఖలు పరిచిందని రాబర్ట్స్‌ పేర్కొన్నారు. అంతే తప్ప అధ్యక్షుని సారథ్యంలోని కార్యనిర్వాహక విభాగానికి ఆ అధికారాన్ని రాజ్యాంగ రూపకర్తలు ఎప్పుడూ అప్పగించలేదని స్పష్టం చేశారు.

టారిఫ్‌లు పన్ను విధింపు కిందకే వస్తాయని గుర్తు చేశారు. ఏకపక్షంగా టారిఫ్‌ల విధింపు ద్వారా అమెరికా ఫెడరల్‌ చట్టాలను ట్రంప్‌ ఉల్లంఘించారని ఆయన తేల్చారు. ఈ మేరకు బెంచ్‌ తరఫున రాబర్ట్స్‌ మెజారిటీ తీర్పు రాశారు. ముగ్గురు న్యాయమూర్తులు శామ్యూల్‌అలిటో, క్లారెన్స్‌ థామస్, బ్రెట్‌ కవనా మాత్రం మెజారిటీ తీర్పుతో విభేదించారు. టారిఫ్‌ల విధింపు సబబేనని పేర్కొన్నారు. వారి తరఫున కవనా తీర్పు వెలువరించారు. ‘‘టారిఫ్‌లు తెలివైన విధానం కావచ్చు, కాకపోవచ్చు.

కానీ చరిత్రను చూసినా, గత ఉదంతాలను బట్టి చూసుకున్నా వాటి విధింపు పూర్తిగా చట్టబద్ధమే’’అని ఆయన స్పష్టం చేశారు. ఆయా దేశాలు, కంపెనీల నుంచి వసూలు చేసిన అధిక టారిఫ్‌లను వాటికి తిరిగి చెల్లించాలా అన్నది చాలా సంక్లిష్టమైన అంశమని జడ్జి కవనా అభిప్రాయపడ్డారు. మెజారిటీ తీర్పులో దాని గురించి ఏమీ పేర్కొనకపోవడాన్ని తన తీర్పులో ఎత్తిచూపారు. అది అతి పెద్ద గందరగోళానికి దారితీయవచ్చని కూడా అభిప్రాయపడ్డారు. 

వారిని నియమించింది ట్రంపే 
తనకు వ్యతిరేకంగా మెజారిటీ తీర్పు వెలువరించిన ఆరుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఇద్దరిని నియమించింది ట్రంపే కావడం విశేషం. నీల్‌ గోర్సెచ్, అమీ కొనీ బారెట్‌లను ట్రంప్‌ తొలిసారి అధ్యక్షునిగా ఉండగా నియమించారు. వీరితో పాటు, టారిఫ్‌ల విధింపు చట్టబద్ధమేనంటూ మైనారిటీ తీర్పు రాసిన జస్టిస్‌ బ్రెట్‌ కవనాను నియమించింది కూడా ట్రంపే. 

సిగ్గుచేటైన తీర్పు: ట్రంప్‌ 
సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. సుంకాల విధింపు కొట్టివేతను ‘సిగ్గుచేటు’గా అభివరి్ణంచారు. శుక్రవారం ఉదయం పలువురు గవర్నర్లు తదితరులతో ఆయన భేటీ అయ్యారు. అదే సమయంలో తీర్పు వెలువడింది. ఆ విషయాన్ని అధికారులు ట్రంప్‌ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.  
ఆ టారిఫ్‌లు కొనసాగుతాయి 
1962 నాటి వర్తక విస్తరణ చట్టంలోని 232 సెక్షన్‌ ప్రకారం పలు దేశాలపై ట్రంప్‌ విధించిన టారిఫ్‌లకు సుప్రీంకోర్టు తాజా తీర్పు వర్తించదు. అవి యథాతథంగా కొనసాగుతాయి. ఈ చట్టం ప్రకారం పలు దేశాలపై స్టీలు, అల్యుమినియం, కలప, ఆటోమోటివ్‌ రంగం తదితరాలపై విధించిన టారిఫ్‌లపై తీర్పు ప్రభావం ఉండబోదు. 

ట్రంప్‌ ముందు మరిన్ని... టారిఫ్‌ మార్గాలు! 
సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలినా, దేశాలపై టారిఫ్‌ల విధింపుకు అధ్యక్షుడు ట్రంప్‌ ముందు ఇతర మార్గాలు లేకపోలేదు. ఇంటర్నేషనల్‌ ఎమర్జెనీ ఎకనామిక్‌ పవర్స్‌ యాక్ట్‌ (ఐఏఏపీఏ) చట్టం ప్రకారం టారిఫ్‌ల విధింపుకు ట్రంప్‌ ఉపయోగించుకున్నారు. దీనిప్రకారం టారిఫ్‌లు విధించేందుకు తనకు అపరిమితమైన అధికారముందని ఆయన వాదించారు. దాన్ని కోర్టు తోసిపుచ్చినా, ఇతర దేశాలపై టారిఫ్‌ల విధింపుకు ట్రంప్‌కు మరిన్ని మార్గాలు లేకపోలేదు.  

అసమంజసమైన, వివక్షాపూరిత వ్యాపార విధానాలు అవలంబించే దేశాలపై 1974 నాటి వరక్త చట్టంలోని సెక్షన్‌ 301 ప్రకారం అమెరికా ఎప్పటినుంచో అదనపు టారిఫ్‌లు విధిస్తూ వస్తోంది. ట్రంప్‌ తొలిసారి అధ్యక్షునిగా ఉండగా ఈ సెక్షన్‌ కింద చైనా దిగుమతులపై భారీ టారిఫ్‌లు విధిస్తానంటూ బెదిరించారు కూడా. 

అదే చట్టంలోని సెక్షన్‌ 122 తదితరాల ప్రకారం ఇతర దేశాలపై 150 రోజుల పాటు 15 శాతం దాకా టారిఫ్‌లు విధించవచ్చు. 

జాతీయ భద్రతకు ముప్పుగా పరిగణించే పక్షంలో 1962 నాటి వర్తక విస్తరణ చట్టంలోని సెక్షన్‌ 232 కూడా టారిఫ్‌ల విధింపుకు వీలు కల్పిస్తోంది. ట్రంప్‌ తన తొలి హయాంతో పాటు ఇప్పుడు కూడా ఈ అధికారాలను విస్తారంగా ఉపయోగించారు. 

1930 నాటి టారిఫ్‌ చట్టం ప్రకారం అమెరికా దిగుమతులపై వివక్ష చూపే దేశాలపై ఏకంగా 50 శాతం దాకా సుంకాలు విధించే అవకాశం ట్రంప్‌కు ఉంది. వీటని స్మూత్‌–హావ్లే టారిఫ్‌లుగా పిలుస్తారు. 1930 నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యాన్ని మరింత తీవ్రతరం చేశాయంటూ ఈ టారిఫ్‌లు చెడ్డపేరు మూటగట్టుకున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement