పంజాబ్‌లో ఎన్‌కౌంటర్ల పరంపర.. 8 నెలల్లో 924 మంది మృతి! | Pakistans Elite Crime Unit Exposed As Death Squad In Disguise | Sakshi
Sakshi News home page

PAK: పంజాబ్‌లో ఎన్‌కౌంటర్ల పరంపర.. 8 నెలల్లో 924 మంది మృతి!

Feb 21 2026 2:07 AM | Updated on Feb 21 2026 7:13 AM

Pakistans Elite Crime Unit Exposed As Death Squad In Disguise

పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో నేరాల‌ను అడ్డుక‌ట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన క్రైమ్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ (CCD)పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ క్రైమ్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ చేపట్టిన ఎన్‌కౌంటర్లపై మానవ హక్కుల సంఘం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. బూట‌క‌పు ఎన్‌కౌంట‌ర్ల పేరిట అమాయకులను బ‌లితీసుకుంటున్నారని ప్రజా సంఘాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. 

వ్యవస్థీకృత, హింసాత్మక నేరాలను ఎదుర్కోవడానికి ఈ ఎలైట్ ఫోర్స్‌ను పంజాబ్ స‌ర్కార్ గ‌తేడాది ఏర్పాటు చేసింది. అయితే ఈ స్పెష‌ల్ ఫోర్స్ కేవ‌లం ఎనిమిది నెల‌ల వ్య‌వధిలో 670 ఎన్‌కౌంటర్లు చేసింది. మొత్తంగా 924 మంది మ‌ర‌ణించారు. కేవ‌లం ఇద్ద‌రు పోలీసులు మాత్ర‌మే ప్రాణాలు కోల్పోయారు.

అత్యధికంగా లాహోర్‌లో 139 ఎన్‌కౌంట‌ర్ల ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. మరణించిన వారిలో ఎక్కువ మంది దొంగతనాలు, హత్యలు, ఇతర తీవ్రమైన నేరాల్లో నిందితులుగా ఉన్నార‌ని పోలీసులు చెబుతున్నారు. అయితే చట్టబద్ధంగా విచారణ జరపకుండానే నిందితులను చంపేయడం రాజ్యాంగ విరుద్ధమని మానవ హక్కుల సంఘం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. 

చ‌నిపోయిన వారి కుటుంబాలను పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని హెచ్ఆర్‌సీపీ ఆరోపించింది. కానీ ప్ర‌భుత్వ వ‌ర్గాలు మాత్రం ఈ ఆరోప‌ణ‌లు తోసి పుచ్చాయి. ఈ ప్రత్యేక విభాగం  వల్ల రాష్ట్రంలో దొంగతనాలు 60శాతం తగ్గాయని చెప్పుకొచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement