టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్తాన్ ఎట్టకేలకు సూపర్-8కు అర్హత సాధించింది. పసికూన నమీబియాతో ఇవాళ (ఫిబ్రవరి 18) జరిగిన మ్యాచ్‌లో 102 పరుగుల భారీ తేడాతో గెలిచి చివరి సూపర్-8 బెర్త్ దక్కించుకుంది. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు పసికూనలపై ప్రతాపం చూపించారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చెలరేగి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. పాక్ సూపర్-8కు అర్హత సాధించడంతో అప్పటిదాకా పోటీలో ఉన్న యూఎస్‌ఏ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ (58 బంతుల్లో 100 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. పాక్ ఇన్నింగ్స్‌లో షాదాబ్ ఖాన్ (22 బంతుల్లో 36 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు), కెప్టెన్ సల్మాన్ అఘా (23 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లతో రాణించగా.. సైమ్ అయూబ్ (12 బంతుల్లో 14; 2 ఫోర్లు), ఖ్వాజా నఫాయ్ (5) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.
నమీబియా బౌలర్లలో బెర్నాల్డ్ స్కోల్జ్ (4-0-33-0), రూబెన్ ట్రంపల్మెన్ (4-0-36-0) పొదుపుగా బౌలింగ్ చేయగా.. జాక్ బ్రస్సెల్ (4-0-48-2) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నా, వికెట్లు తీశాడు. కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ (3-0-25-1), జేజే స్మిట్ (3-0-28-0) పర్వాలేదనిపించారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నమీబియా పాక్ స్పిన్నర్ల ధాటికి చేతులెత్తేసింది. ఉస్మాన్ తారిఖ్ (3.3-1-16-4), షాదాబ్ ఖాన్ (4-0-19-3), మొహమ్మద్ నవాజ్ (4-0-22-1) దెబ్బకు 17.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌటైంది. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ సల్మాన్ మీర్జా కూడా ఓ వికెట్ తీశాడు. నమీబియా ఇన్నింగ్స్‌లో ఓపెనర్ లారెన్ స్టీన్‌కాంప్ (23), మిడిలార్డర్ బ్యాటర్ అలెగ్జాండర్ (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ ఓటమితో నమీబియా ఒక్క గెలుపు కూడా లేకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.


