T20 WC: జోరు మీదున్న శ్రీలంకకు భారీ షాక్‌! | Major Blow For Sri Lanka Matheesha Pathirana to miss rest of T20 WC 2026 | Sakshi
Sakshi News home page

T20 WC: జోరు మీదున్న శ్రీలంకకు భారీ షాక్‌!

Feb 18 2026 2:34 PM | Updated on Feb 18 2026 2:59 PM

Major Blow For Sri Lanka Matheesha Pathirana to miss rest of T20 WC 2026

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌కు భారత్‌తో కలిసి ఆతిథ్యం ఇస్తోంది శ్రీలంక. సొంతగడ్డపై అటు టీమిండియా.. ఇటు శ్రీలంక జట్టు సత్తా చాటుతూ ఇప్పటికే సూపర్‌-8కు అర్హత సాధించాయి. గ్రూప్‌-ఎలో భాగంగా మూడింట మూడు గెలిచి భారత్‌.. గ్రూప్‌-బి నుంచి హ్యాట్రిక్‌ విజయాలతో శ్రీలంక ఆయా గ్రూపు టాపర్లుగా కొనసాగుతున్నాయి.

దసున్‌ షనక సారథ్యంలో
ఇక పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన శ్రీలంక.. కెప్టెన్‌గా తిరిగి వచ్చిన దసున్‌ షనక సారథ్యంలో అదరగొడుతోంది. తొలుత ఐర్లాండ్‌ను.. రెండో మ్యాచ్‌లో ఒమన్‌ను అలవోక​గా ఓడించింది లంక. చివరగా ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించి.. సూపర్‌-8 బెర్తును అధికారికంగా ఖరారు చేసుకుంది.

లీగ్‌ దశలో తమ ఆఖరి మ్యాచ్‌లో జింబాబ్వేతో లంక తలపడనుంది. ఇరుజట్ల మధ్య గురువారం కొలంబోలో ఈ మ్యాచ్‌కు షెడ్యూల్‌ ఖరారైంది. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు శ్రీలంక శిబిరంలో ఆందోళన నెలకొంది.

మతీశ పతిరణకు గాయం
స్టార్‌ పేసర్‌ మతీశ పతిరణ గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమైనట్లు సమాచారం. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ సందర్భంగా పతిరణకు తొడ కండరాలు పట్టేశాయి. దీంతో అతడు కుంటుతూనే మైదానం వీడాడు. నొప్పి ఎక్కువగా ఉండటంతో.. అతడికి దాదాపు మూడు వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది.

శ్రీలంక జర్నలిస్టు అందించిన వివరాల ప్రకారం.. పతిరణ గాయం వల్ల మూడు వారాల పాటు ఆటకు దూరం కానున్నాడు. అతడి స్థానంలో బినుర ఫెర్నాండో లేదంటే దిల్షాన్‌ మధుషాంక జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. 

నువాన్‌ తుషార, మిలాన్‌ రత్ననాయకే రూపంలో మరో రెండు ఆప్షన్లు కూడా ఉన్నాయి. కాగా ఆసీస్‌తో మ్యాచ్‌లో పతిరణ కేవలం నాలుగు బంతులే బౌల్‌ చేసి మైదానం వీడాడు. కాగా ఇప్పటికే వనిందు హసరంగా టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే.

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి శ్రీలంక జట్టు
పాతుమ్‌ నిస్సాంక, కుశాల్‌ పెరీరా, కుశాల్‌ మెండిస్‌ (వికెట్‌ కీపర్‌), పవన్‌ రత్ననాయకే, దసున్‌ షనక (కెప్టెన్‌), కమిందు మెండిస్‌, దుషాన్‌ హేమంత, దునిత్‌ వెల్లలగే, దుష్మంత చమీర. మహీశ్‌ తీక్షణ, మతీశ పతిరణ, కమిల్‌ మిశారా, చరిత్‌ అసలంక, ప్రమోద్‌ మధుషాన్‌, జనిత్‌ లియనగే.

చదవండి: IND vs PAK: అసలైన హీరో మీరే: పీసీబీ చైర్మన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement