T20 WC: అతడిని సెలక్ట్‌ చేయలేదు.. అనుభవించారు! | How was Smith not on plane: Vaughan Lambasts AUS Group Stage Exit | Sakshi
Sakshi News home page

T20 WC 2026: అతడిని సెలక్ట్‌ చేయలేదు.. అనుభవించారు!

Feb 18 2026 1:41 PM | Updated on Feb 18 2026 2:37 PM

How was Smith not on plane: Vaughan Lambasts AUS Group Stage Exit

ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీ20 వరల్డ్‌కప్‌-2026 టోర్నీలో కనీస స్థాయి ప్రదర్శన కనబరచలేకపోయారంటూ సొంత అభిమానులే విమర్శిస్తున్నారు. కాగా గ్రూప్‌-బిలో శ్రీలంక, జింబాబ్వే, ఒమన్‌, ఐర్లాండ్‌లతో కలిసి ఉన్న ఆసీస్‌.. పసికూన జింబాబ్వే, శ్రీలంక చేతిలో ఓడింది.

తద్వారా సూపర్‌-8 అవకాశాలు సంక్లిష్టం కాగా.. మంగళవారం నాటి జింబాబ్వే- ఐర్లాండ్‌ మ్యాచ్‌ రద్దు కావడంతో ఆసీస్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆసీస్‌ కంటే మెరుగైన స్థితిలో ఉన్న జింబాబ్వే శ్రీలంకతో పాటు సూపర్‌-8లో అడుగుపెట్టింది.

గాయాల బెడద
కాగా టోర్నీ ఆరంభానికి ముందు నుంచే కంగారూ జట్టును గాయాల బెడద వేధించింది. ప్రధాన పేసర్లు ప్యాట్‌ కమిన్స్‌ (Pat Cummins), జోష్‌ హాజిల్‌వుడ్‌ (Josh Hazlewood) టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ సైతం ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో లేకుండా పోయాడు.

ఇక మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ను తొలుత టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీకి క్రికెట్‌ ఆస్ట్రేలియా ఎంపిక చేయనేలేదు. శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు మాత్రం అతడిని హుటాహుటిన రప్పించారు. అయితే, ఈ మ్యాచ్‌లో స్మిత్‌ను ఆడించలేదు. ఈ మ్యాచ్‌లో ఓడిన ఆసీస్‌.. సూపర్‌-8 చేరకుండానే ఇంటిబాట పట్టింది.

 అతడిని సెలక్ట్‌ చేయలేదు.. అనుభవించారు!
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ ఘాటుగా స్పందించాడు. ‘‘బహుశా స్టీవ్‌ స్మిత్‌ తాను వచ్చిన విమానంలోనే వెనుదిరిగి ఉంటాడు. ఎందుకంటే వీళ్లు (ఆసీస్‌) టోర్నీ నుంచి నిష్క్రమించేశారు కదా!

అసలు అతడిని ముందుగానే ఎందుకు ఎంపిక చేయలేదో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. బిగ్‌బాష్‌ లీగ్‌లో అతడు మెరుగైన ప్రదర్శనలు ఇచ్చాడు. అంతేకాదు అతడు స్పిన్‌ బౌలింగ్‌లో అద్భుతంగా ఆడగలడు. అయినప్పటికీ స్టీవ్‌ స్మిత్‌ను ముందుగానే సెలక్ట్‌ చేయకుండా క్రికెట్‌ ఆస్ట్రేలియా తప్పు చేసింది’’ అని మైకేల్‌ వాన్‌ విమర్శించాడు.

కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి భారత్‌- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పిన్‌కు అనుకూలించే ఉపఖండ పిచ్‌లపై స్మిత్‌ను ఆడించకుండా.. ఆసీస్‌ మూల్యం చెల్లించిందని వాన్‌ అభిప్రాయపడ్డాడు. కాగా ఇటీవల దేశీ టీ20 టోర్నీలో సత్తా చాటిన స్మిత్‌.. బిగ్‌బాష్‌ లీగ్‌లో 299 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. స్మిత్‌ ఆసీస్‌ తరఫున చివరగా 2024 ఫిబ్రవరిలో టీ20 మ్యాచ్‌ ఆడాడు.

చదవండి: IND vs PAK: అసలైన హీరో మీరే: పీసీబీ చైర్మన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement