టీ20 ప్రపంచకప్ 2026లో గత ఎడిషన్ రన్నరప్ సౌతాఫ్రికా జైత్రయాత్ర కొనసాగుతోంది. ప్రొటీస్ జట్టు వరుసగా నాలుగో గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లోనూ గెలిచి అజేయ జట్టుగా సూపర్-8లోకి ప్రవేశించింది. యూఏఈతో ఇవాళ (ఫిబ్రవరి 18) జరిగిన తమ చివరి గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన సౌతాఫ్రికా యూఏఈని 122 పరుగులకే (6 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. కార్బిన్ బాష్ (4-0-12-3), అన్రిచ్ నోర్జే (4-0-28-2), జార్జ్ లిండే (4-0-17-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. యూఏఈ ఇన్నింగ్స్‌లో అలీషాన్ షరాఫు (45) టాప్ స్కోరర్‌గా కాగా.. మరో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. వీరిలో కెప్టెన్ ముహమ్మద్ వసీం 22, ఆర్యాంశ్ శర్మ 13, ముహమ్మద్ అర్ఫాన్ 11 పరుగులు చేశారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని సౌతాఫ్రికా 13.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. డెవాల్డ్ బ్రెవిస్ (36), ర్యాన్ రికెల్టన్ (30), కెప్టెన్ మార్క్రమ్ (28), డికాక్ (14), స్టబ్స్ (6 నాటౌట్), జేసన్ స్మిత్ (3 నాటౌట్) తలో చేయి వేసి ప్రొటీస్‌ను గెలిపించారు. యూఏఈ బౌలర్లలో హైదర్ అలీ, జవాదుల్లా, అర్ఫాన్, ఫరూఖ్ తలో వికెట్ తీశారు. ఈ ఓటమితో ప్రపంచకప్‌లో యూఏఈ పోరాటం ముగిసింది. ఈ జట్టు కెనడాపై మాత్రమే గెలిచి న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా జట్ల చేతుల్లో ఓడింది.


