T20 WC 2026: పాక్‌ మాజీ కెప్టెన్‌ సంచలన వ్యాఖ్యలు | T20 WC 2026: Pakistan Former Coach Levels Serious Allegations Against His Players After India Match | Sakshi
Sakshi News home page

T20 WC 2026: పాక్‌ మాజీ కెప్టెన్‌ సంచలన వ్యాఖ్యలు

Feb 18 2026 4:17 PM | Updated on Feb 18 2026 4:38 PM

T20 WC 2026: Pakistan Former Coach Levels Serious Allegations Against His Players After India Match

టీ20 ప్రపంచకప్‌ 2026 గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లో భారత్‌ చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న పాక్‌ జట్టుపై ఆ దేశ దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్‌ మొహమ్మద్‌ యూసఫ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2021 టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌ను తొలిసారి ఓడించిన తర్వాత స్టార్లుగా చెప్పుకునే కొందరు పాక్‌ ఆటగాళ్లకు అహంకారం పెరిగిందని ఆయన అన్నాడు. 

వారి అతి విశ్వాసమే పాక్‌ పతనానికి దారి తీసిందని అభిప్రాయపడ్డాడు. ఒక్క విజయంతోనే కళ్లు నెత్తికెక్కితే పరిస్థితి ఇలానే ఉంటుందంటూ పరోక్షంగా బాబర్‌ ఆజమ్‌, షాహీన్‌ అఫ్రిదిని ఉద్దేశిస్తూ చురకలంటించాడు.

ప్రస్తుత పాక్‌ జట్టు దుస్థితిపై యూసఫ్‌ స్పందిస్తూ.. 2021లో భారత్‌పై గెలిచిన తర్వాత చాలా మంది ఆటగాళ్లు మేము ఎవరికీ తగ్గం అనే భావనలో మునిగిపోయారు. కోచ్ మాట్లాడుతున్నప్పుడు ఫోన్‌లో గేమ్స్ ఆడటం వంటి నిర్లక్ష్యపు ప్రవర్తన అప్పటి నుంచి మొదలైంది. స్టార్లుగా చెప్పుకునే కొందరి అహంకారం వల్లే పాక్‌ క్రికెట్‌ నష్టపోతుందని అన్నాడు.

యూసుఫ్ రాజీనామా వెనుక కారణం ఇదేనేమో..!
యూసఫ్‌ 2025లో కేవలం మూడు నెలల పాటు పాక్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా వ్యవహరించాడు. ఆతర్వాత అనూహ్యంగా ఆ పదవి నుంచి వైదొలిగాడు. అప్పట్లో యూసఫ్‌ తన అనూహ్య రాజీనామాకు గల కారణాలు వెల్లడించలేదు. తాజా వ్యాఖ్యలను బట్టి చూస్తే, జట్టులో స్టార్లుగా చెప్పుకునే కొందరి ప్రవర్తన అతనికి నచ్చలేదన్న విషయం బయటపడింది. ఇదే అతని ఆకస్మిక రాజీనామాకు కారణమై ఉండొచ్చనే భావన కలుగుతోంది.

కాగా, టీమిండియా చేతిలో తాజా పరాభవం తర్వాత పాక్‌ జట్టుపై ఆ దేశాని​కి చెందిన చాలామంది మాజీలు దుమ్మెత్తిపోస్తున్నారు. షోయబ్‌ అక్తర్‌, షాహిద్‌ అఫ్రిది వంటి వారైతే కొందరు పాక్‌ ఆటగాళ్లపై తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రస్తుత పాక్‌ జట్టు దుస్థితికి స్టార్లుగా చెప్పుకునే ఒకరిద్దరు ఆటగాళ్లే కారణమన్నది వారి అభిప్రాయం కూడా.  

భారత్‌ చేతిలో వరుస పరాభవాల నేపథ్యంలో పాక్‌ అభిమానులు కూడా పాక్‌ జట్టుపై విసుగెత్తిపోయారు. ఇన్నాళ్లు వెనకేసుకొచ్చిన నోళ్లతో దుర్భాషలాడుతున్నారు. భారత్‌ చేతిలో తాజా పరాభవం తర్వాత పాక్‌ జట్టుకు ఇంట కూడా మర్యాద లేకుండా పోయింది. పాక్‌ దుస్థితికి స్టార్‌ ఆటగాళ్లు కారణమని కొందరంటుంటే, మరికొందరేమో పాక్‌ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు నఖ్వీ కారణమని ఆరోపిస్తున్నారు. నఖ్వీ పాక్‌ క్రికెట్‌ను సర్వనాశనం చేశాడన్న అభిప్రాయం చాలామంది పాక్‌ జాతీయుల్లో ఉన్నట్లు తెలుస్తుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement