మ‌ద్యం మ‌త్తులో త‌ల్లి.. 12 ఏళ్ల‌ కొడుకుకి వింత‌ శిక్ష‌ | Mother forces child to walk 19 miles to school alone | Sakshi
Sakshi News home page

మ‌ద్యం మ‌త్తులో త‌ల్లి.. 12 ఏళ్ల‌ కొడుకుకి వింత‌ శిక్ష‌

Feb 20 2026 11:18 PM | Updated on Feb 20 2026 11:18 PM

Mother forces child to walk 19 miles to school alone

కన్నతల్లి ప్రేమకు పరిమితులు ఉండ‌వు, ఆమె ప్రేమకు మరేదీ సాటిరాదు. ఎంతటి కష్టమొచ్చినా తాను పస్తులుండైనా కన్న బిడ్డలను ఆకలితీర్చే అమృత మూర్తి అమ్మ. కానీ కొంత‌మంది మహిళలలు అమ్మతనానికే మాయని మచ్చను తీసుకొస్తున్నారు. వివాహేతర సంబంధాలు, ఇతర కారణాలతో కన్న బిడ్డల పట్ల  కర్కషంగా ప్రవర్తిస్తున్నారు. 

తాజాగా ఇలాంటి ఘటనే అమెరికాలోని శాన్ ఆంటోనియోలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఒక తల్లి..  తన 12 ఏళ్ల కుమారుడిని ఏకంగా 19 మైళ్ల (సుమారు 30 కిలోమీటర్లు) దూరంలో ఉన్న పాఠశాలకు ఒంటరిగా నడిచి వెళ్లాలని ఆదేశించింది. లూసియా విక్టోరియా మేరీ క్రూజ్ (35) అనే మహిళ ఈ అమానుషానికి ఒడిగట్టింది.

ఏమి జరిగిందంటే?
విక్టోరియా మేరీ క్రూజ్ భ‌ర్త‌తో విడిపోయి ఒంట‌రిగా ఉంటుంది. ఆమెకు 12 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే ఘటనకు ముందు రోజు రాత్రి లూసియా తన ప్రియుడితో గొడవపడి, పూటుగా మద్యం సేవించి మ‌త్తులోకి వెళ్లిపోయింది.  మరుసటి రోజు ఉదయం బాలుడు ఆమెను నిద్రలేపి స్కూలుకు వెళ్లాలని కోరగా, ఆమె అతడిని ఒంటరిగానే నడిచి వెళ్లమని చెప్పింది. 

దీంతో పిల్లోడు చేసేదేమి లేక 35 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న త‌న స్కూలుకు న‌డిచివెళ్ల‌డం ప్రారంభించాడు. అయితే అత్య‌వ‌స‌ర వాహ‌నాలు వెళ్లే ట్రాఫిక్ లైన్ల పక్కనే ఆ బాలుడు న‌డ‌వ‌డం ఒక‌రు గ‌మ‌నించారు. వెంట‌నే అనుమానం వ‌చ్చి స‌ద‌రు వ్య‌క్తి పోలీసులుకు స‌మాచార‌మందించాడు. వెంట‌నే స్పందించిన పోలీసులు బాలుడిని త‌న చ‌దివే పాఠాశాల‌కు తీసుకువెళ్లారు.

పాఠశాల రిసోర్స్ అధికారి బాలుడిని ప్ర‌శ్నంచిగా అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. త‌న త‌ల్లి సూచ‌న మేర‌కే ఒంటరిగా న‌డిచివ‌చ్చాన‌ని చెప్పాడు.  పోలీసులు లూసియా ఇంటికి వెళ్లి విచారించగా, తన కుమారుడు ఒంటరిగా నడిచి వెళ్తున్న విషయం తనకు తెలుసని ఆమె అంగీకరించింది. దీంతో బిడ్డ ప‌ట్ల నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించినందుకు ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజ‌ర‌ప‌రిచారు. అనంత‌రం 15,000 డాలర్ల (సుమారు రూ. 12.5 లక్షలు) వ్యక్తిగత బాండ్ సమర్పించడంతో ఆమెకు బెయిల్ ల‌భించింది. 

Advertisement
 
Advertisement
Advertisement