ట్రంప్‌తో కయ్యానికి దిగిన బ్రిటన్‌.. అసలుకే ఎసరు? | Keir Starmer blocks Trump Swindon base Decision chagos deal May Affect | Sakshi
Sakshi News home page

ట్రంప్‌తో కయ్యానికి దిగిన బ్రిటన్‌.. అసలుకే ఎసరు?

Feb 20 2026 1:36 PM | Updated on Feb 20 2026 1:45 PM

Keir Starmer blocks Trump Swindon base Decision chagos deal May Affect

అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఏ క్షణంలోనైనా అమెరికా దళాలు.. ఇరాన్‌పై విరుచుకుపడే అవకాశం ఉంది. అధ్యక్షుడు ట్రంప్‌.. ఇరాన్‌ను టార్గెట్‌ చేసి దాడులు చేసేందుకు ఉన్న అన్ని మార్గాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రపంచంలోనే అత్యంత శక్తి వంతమైన యుద్ధ నౌకలను అరేబియా సముద్రానికి తరలించారు. ఇంతలో యూకే రూపంలో ట్రంప్‌ వ్యూహానికి ఎదురుదెబ్బ తగిలింది.

ఇరాన్‌పై దాడి చేసే ప్లాన్‌లో భాగంగా బ్రిటన్‌కు చెందిన RAF Fairford (స్విండన్ దగ్గర), హిందూ మహాసముద్రంలో ఉన్న డియాగో గార్షియా ఎయిర్‌బేస్‌ను ఉపయోగించుకునేందుకు అమెరికా ప్రత్యేక అనుమతి కోరింది. ఇరాన్‌పై దాడి సమయంలో అవసరమైతే ఉమ్మడి ఎయిర్‌బేస్ వాడుకునేందుకు ట్రంప్‌‌ సర్కార్‌.. బ్రిటన్‌ పర్మిషన్ అడిగింది. కానీ, ట్రంప్‌ అభ్యర్థనకు ఝలక్‌ ఇస్తూ.. యూకేలోని కీర్ స్టార్మర్ ప్రభుత్వం అందుకు నిరాకరించింది. అటువంటి దాడిలో పాల్గొని అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించబోమని తేల్చి చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని పేర్కొంది.

దీంతో, ఈ వ్యవహారమే అమెరికా-బ్రిటన్‌ మధ్య ఉద్రిక్తతలు తలెత్తేలా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఉద్రిక్తతలు ఇప్పుడు చాగోస్ దీవులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే.. డియెగో గార్షియాలో అమెరికా-యూకేకు ఉమ్మడి సైనిక స్థావరం ఉంది. ఇది హిందూ మహాసముద్రంలో ఉన్న ఒక కీలకమైన వ్యూహాత్మక స్థావరం. ఇక్కడే చాగోస్ దీవులు ఉన్నాయి. ఇది రెండు దేశాలకు సంబంధించిన వ్యవహారం. అయితే, బ్రిటన్ చాగోస్ దీవుల పరిపాలనా హక్కులను మారిషస్‌కు అధికారికంగా బదిలీ చేసే ఒప్పందానికి అంగీకరించింది. ఈ ఒప్పందం కింద మారిషస్‌కు బ్రిటన్ ఏటా సుమారు 101 మిలియన్ పౌండ్లు (రూ. 1,160 కోట్లకు పైగా) చెల్లిస్తూ.. డియాగో గార్షియా దీవిలోని కీలక సైనిక స్థావరాన్ని 99 సంవత్సరాల పాటు లీజుకు తీసుకోవాలని నిర్ణయించింది. నిఘా సమాచార సేకరణ, తీవ్రవాద వ్యతిరేక చర్యల్లో ఈ ప్రాంతం కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో బ్రిటన్‌ నిర్ణయంపై పెద్ద తప్పుగా ట్రంప్‌ అభివర్ణించారు. మారిషస్‌తో బ్రిటన్ ఒప్పందం చేసుకోవడంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. చాగోస్‌ దీవులను వదుకోవద్దని బ్రిటన్‌ను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌తో కంటే బ్రిటన్‌తోనే ఉద్రిక్తతలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి.

దీవుల చరిత్ర ఇదే.. 
1814లో నెపోలియన్ యుద్ధాల తర్వాత బ్రిటన్ ఈ దీవులను ఫ్రాన్స్ నుంచి స్వాధీనం చేసుకుంది. 1965లో మారిషస్‌కు స్వాతంత్ర్యం ఇవ్వడానికి ముందు దీవులను వేరు చేసింది. అనంతరం, 1968–73 మధ్య స్థానిక ప్రజలను బలవంతంగా తరిమేశారు. 2019లో అంతర్జాతీయ కోర్టు దీవులను విడగొట్టడం చట్టవిరుద్ధమని.. వాటిని వెనక్కి ఇచ్చేయాల్సిందే అని తీర్పు వెల్లడించింది. అందుకే బ్రిటన్‌.. దీవులను మారిషస్‌కి తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ఈ ఒప్పందానికి వెళ్తున్నారు.

యూకేలో వ్యతిరేకత.. 
యూకే పౌరుల నుంచి భారీ వ్యతిరేకత నేపథ్యంలోనే బ్రిటన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు అంచనా వేస్తున్నారు. అయితే, ఖచ్చితమైన ఖర్చుల వివరాలను ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు. మరోవైపు, మారిషస్‌కు చైనాతో ఉన్న బలమైన వాణిజ్య సంబంధాల నేపథ్యంలో జాతీయ భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలు కెమీ బడెనాక్ ఈ నిర్ణయాన్ని విమర్శించారు. ప్రధాని కియర్ స్టార్మర్ నేతృత్వంలోని ప్రభుత్వం ‘బ్రిటిష్ భూభాగాన్ని అప్పగించడమే కాకుండా ప్రజలపై భారీ ఆర్థిక భారం మోపుతోంది’ విమర్శించారు. మరోవైపు.. అధికారికంగా ఈ ఒప్పందంలో చైనా ప్రస్తావన లేదు. కానీ చైనా.. హిందూ మహాసముద్రంలో తన పట్టు పెంచేందుకు పోర్టులు, లీజులు, అప్పుల వ్యూహాన్ని ఉపయోగిస్తోంది. ఇదే సమయంలో మారిషస్‌తో చైనాకు బలమైన ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. రేపటి రోజున మారిషస్‌పై చైనా ప్రభావం ఇంకా పెరిగితే? డియాగో గార్షియాపై ఒత్తిడి వస్తే? పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

చాగోసియన్ల ఉద్యమం..
1968–1973 మధ్య బ్రిటన్, అమెరికా ఒత్తిడితో చాగోస్‌ దీవుల ప్రజలను బలవంతంగా తరలించారు. డియాగో గార్షియాలో అమెరికా సైనిక స్థావరం ఏర్పాటుకు ఇది ప్రధాన కారణంగా అని చెప్పుకోవచ్చు. దీంతో, సుమారు 2,000 మంది చాగోసియన్లు మారిషస్‌, సెషెల్స్‌, యుకేలో స్థిరపడ్డారు. అయితే, చాగోసియన్లు దశాబ్దాలుగా తమ స్వదేశానికి తిరిగి వెళ్లే హక్కు కోసం పోరాడుతున్నారు.

యూఎస్‌ యుద్ధ విమానాలు.. 
ఇదిలా ఉండగా.. హిందూ మహాసముద్రంలో 60 దీవుల సముదాయం చాగోస్‌. ఈ దీవులు భౌగోళికంగా చిన్నవే అయినా, వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనవి. ఇవి అంతర్జాతీయంగా ముఖ్యంగా అమెరికా–బ్రిటన్–మారిషస్ సంబంధాల్లో ఒక ప్రధాన అంశంగా మారాయి. డియాగో గార్షియాకు అమెరికా ఇటీవలే ఆరు బీ-2 స్టెల్త్‌ బాంబర్‌ విమానాలను తరలించింది. అమెరికాకు మొత్తం 20 బీ-2 బాంబర్లు ఉండగా, వాటిలో ఆరింటిని ఇక్కడే మోహరించడం దీని ప్రాధాన్యం తెలియజేస్తోంది. హిందూ మహాసముద్రంలో తమ పట్టు నిలబెట్టుకునేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో బ్రిటన్‌ నిర్ణయంపై ట్రంప్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ మొదలైంది. బ్రిటన్‌ను టార్గెట్‌ చేస్తారా? అని ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement