టెహ్రాన్: ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) బిగ్ షాక్ తగిలింది. యూరోపియన్ యూనియన్(EU) ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌ను అధికారికంగా ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. దీంతో, ఐఆర్‌జీసీకి చెందిన నిధులు, ఆస్తులు.. ఈయూ సభ్య దేశాల్లో స్థంభించిపోనున్నాయి.
అయితే, 2026 జనవరి 29న యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రుల మండలి (Foreign Affairs Council) సమావేశం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)ను EU అధికారికంగా ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, సౌదీ అరేబియా, బహ్రెయిన్, పరాగ్వే, ఈక్వడార్, ఉక్రెయిన్ సహా పలు దేశాలు ఇందుకు అనుకూలంగా ఓటు వేయగా.. ఇజ్రాయెల్, అర్జెంటీనా రెండు దేశాలు మాత్రమే వ్యతిరేకంగా ఉన్నాయి. దీంతో, ఉగ్రవాద సంస్థల జాబితాలోకి ఐఆర్‌జీసీ వెళ్లిపోయింది.
కాగా, ఐఆర్‌జీసీ ఉగ్రవాద సంస్థగా గుర్తింపు కావడంతో దీనికి చెందిన నిధులు, ఆస్తులు ఈయూ సభ్య దేశాల్లో స్తంభింపజేయబడతాయి. అలాగే, ఈయూలోని వ్యక్తులు, సంస్థలు.. ఐఆర్‌జీసీకి ఆర్థిక వనరులు అందించకూడదు. ఇదిలా ఉండగా.. మొత్తం 13 మంది వ్యక్తులు, 23 సంస్థలు ప్రస్తుతం ఈయూ ఉగ్రవాద జాబితాలో ఉన్నాయి. ఇప్పటివరకు ఈయూ ఉగ్రవాద జాబితాలో ప్రధానంగా అల్‌ఖైదా, ఐసిస్ వంటి అప్రభుత్వ మిలిటెంట్ గ్రూపులు మాత్రమే ఉండేవి. ఐజీఆర్‌ఎసీ చేరడం ద్వారా ఒక దేశానికి చెందిన సైనిక బలగాన్ని ఈయూ ఉగ్రవాద జాబితాలో చేర్చిన మొదటి గ్రూపుగా రికార్డుల్లో చేరింది. మొత్తంగా, ఈయూ ఆంక్షలు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను బలహీనపరచడమే కాకుండా, ఐఆర్‌జీసీ అంతర్జాతీయ నెట్‌వర్క్‌లను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈయూ, ఇతర దేశాలు విధించిన ఆంక్షలు కేవలం ప్రభుత్వాన్ని మాత్రమే కాకుండా, సాధారణ ప్రజల జీవితాలను కూడా గణనీయంగా ప్రభావితం చేయనున్నాయి.
IRGC స్థాపన, ఉద్దేశ్యం..
ఐఆర్‌జీసీ 1979 ఇరాన్ ఇస్లామిక్ విప్లవం తర్వాత ఏర్పడింది. దీని ప్రధాన లక్ష్యం.. విప్లవాన్ని రక్షించడం, ఇస్లామిక్ వ్యవస్థను కాపాడటం. ఇది నేరుగా ఇరాన్ సుప్రీం లీడర్‌కు మాత్రమే జవాబుదారీగా ఉంటుంది. ఇది ఇరాన్‌లో రాజకీయ, ఆర్థిక, సైనిక రంగాల్లో అత్యంత శక్తివంతమైన సంస్థ. ఐఆర్‌జీసీ.. ఇరాక్, లెబనాన్ (హిజ్బుల్లా), సిరియా, యెమెన్, పాలస్తీనా ప్రాంతాల్లో మిలిటెంట్ గ్రూపులకు మద్దతు ఇస్తుంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థలో పెద్ద భాగం IRGC నియంత్రణలో ఉంది. మరోవైపు.. అమెరికా దాడి హెచ్చరికల నేపథ్యంలో ఈనెలలోనే IRGC హోర్ముజ్ జలసంధిలో భారీ సైనిక విన్యాసాలు నిర్వహించింది.


