ట్రంప్‌కు ఖమేనీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ | Iran US tensions Strait of Hormuz matters | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కు ఖమేనీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Feb 18 2026 9:13 AM | Updated on Feb 18 2026 9:42 AM

Iran US tensions Strait of Hormuz matters

టెహ్రాన్‌: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకంగా భావించే హార్ముజ్ జలసంధి(ఇరాన్‌) వద్ద యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికాతో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరిన సమయంలో ఇరాన్ తన రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ఆధ్వర్యంలో భారీ ‘లైవ్-ఫైర్’ సైనిక విన్యాసాలను ప్రారంభించి, హార్ముజ్ జలసంధిలోని కొన్ని భాగాలను తాత్కాలికంగా మూసివేసింది.

అమెరికా తన అతిపెద్ద విమాన వాహక నౌక ‘యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్. ఫోర్డ్’ను ఈ ప్రాంతానికి తరలించడంపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తీవ్రంగా స్పందించారు. అమెరికా నౌకాదళాన్ని సముద్ర గర్భంలో ముంచేయగల క్షిపణులు తమ వద్ద ఉన్నాయని, అగ్రరాజ్య సైన్యం కోలుకోలేనంతగా దెబ్బతినడం ఖాయమని ఆయన అధ్యక్షుడు ట్రంప్‌ను హెచ్చరించారు.

1980లలో ఇరాన్-ఇరాక్ యుద్ధం సమయంలో ఇరు దేశాలు ట్యాంకర్లే లక్ష్యంగా దాడులు చేసుకున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితులు మరింత భిన్నంగా కనిపిస్తున్నాయి. గత ఏడాది ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు జరిగినప్పుడు కూడా జలసంధిని తాకని ఇరాన్, ఇప్పుడు అమెరికా సైనిక బెదిరింపులకు ప్రతిస్పందనగా నేరుగా రంగంలోకి దిగింది. ఇది కేవలం హెచ్చరిక మాత్రమే కాదు, క్షేత్రస్థాయిలో యుద్ధానికి సిద్ధమనే సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ జలసంధి కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు ఉన్నప్పటికీ, ప్రపంచ చమురు రవాణాలో సుమారు 20 శాతం వాటా దీని ద్వారానే సాగుతుండటం విశేషం. సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, యూఏఈ తదితర దేశాల నుండి వచ్చే చమురు ట్యాంకర్లకు ఇదే ప్రధాన మార్గం. ఒకవేళ ఇరాన్ ఈ మార్గాన్ని పూర్తిగా అడ్డుకుంటే, అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతాయని, ముఖ్యంగా చైనా లాంటి ఆసియా మార్కెట్లు తీవ్రంగా దెబ్బతింటాయని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు అణు ఒప్పందం చర్చల ప్రక్రియ కొనసాగుతున్నా, మరోవైపు యుద్ధ విన్యాసాలు సాగుతుండటంతో ప్రపంచ దేశాలు ఈ పరిస్థితిని ఊపిరి బిగబట్టి గమనిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: ‘నేషనల్ ఏఐ ప్లాన్‌’తో దూకుడు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement