అ‘భద్రతా’ సదస్సు! | Sakshi Editorial On America and European countries Issues | Sakshi
Sakshi News home page

అ‘భద్రతా’ సదస్సు!

Feb 18 2026 1:08 AM | Updated on Feb 18 2026 1:08 AM

Sakshi Editorial On America and European countries Issues

అమెరికా, యూరప్‌ దేశాలు భిన్న ధ్రువాలని మరోసారి రుజువైంది. భూగోళం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యలపై ఆ రెండు పక్షాల అధినేతలూ పరస్పరం అభిప్రాయాలు పంచుకునే వార్షిక మ్యూనిక్‌ భద్రతా సదస్సు (ఎస్‌సీఓ) మరోసారి దీన్ని చాటింది. ఏడాదిగా అవకాశం దొరికినప్పుడల్లా యూరప్‌ దేశాలను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఏకిపారేస్తున్నారు. అయినా తిరిగి జవాబివ్వలేని నిస్సహాయత వాటిని ఆవరించింది. మేల్కొనాల్సిన సమయం ఆసన్నమైందంటూ ఈ సదస్సుకు ముందు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమానియేల్‌ మెక్రాన్‌ పిలుపునిచ్చారు. జర్మనీ చాన్సలర్‌ ఫ్రెడరిక్‌ మెర్జ్‌ యూరప్‌ రాజ్యాలు స్వతంత్ర పంథాను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. 

నిరుడు జరిగిన సదస్సుకు హాజరైన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ‘మీరు పాటిస్తున్న విలువలేమిటి... స్వేచ్ఛాయుత గళాలను అణిచేస్తారా?’ అంటూ నిప్పులు చెరిగినప్పుడు సదస్సులోని యూరప్‌ దేశాల అధినేతలు నిర్ఘాంతపోయారు. సమాజ సామరస్యతకు భంగం కలిగిస్తున్న అతి మితవాద పక్షాలను యూరప్‌ దేశాలు అదుపు చేస్తుండటం వాన్స్‌కు నచ్చలేదు. అలాగే తమ మాదిరే యూరప్‌ దేశాలు కూడా వలస నిబంధనలు కఠినం చేయాలన్నది ఆయన ఉద్దేశం. ఈసారి సదస్సుకు అమెరికా ప్రతి నిధిగా వచ్చిన విదేశాంగ మంత్రి మార్కో రుబియో... వాన్స్‌ మాదిరి గద్దిస్తూ మాట్లాడక పోయినా అవే అభిప్రాయాలను ప్రకటించారు. ‘మీతో మాకు గాఢమైన అనుబంధం ఉంది. మన ఇద్దరి భవితవ్యాలూ పెనవేసుకుని ఉన్నాయి. అవి కొనసాగాలనే మా ఆకాంక్ష కూడా! కానీ అవసరమైతే ఒంటరి ప్రయాణానికి మేం సిద్ధం’ అంటూ మెత్తగా హెచ్చరించారు.   

ఒకప్పుడు మ్యూనిక్‌ భద్రతా సదస్సు అంటే అమెరికా డాబూ దర్పం ప్రదర్శించే సందర్భం. స్వేచ్ఛాయుత ప్రపంచాధినేతగా అమెరికా అధ్యక్షుడికి నీరాజనాలు పట్టే వారు. పెద్దన్నగా భావించి సలహాలూ, సూచనలూ స్వీకరించేవారు. తొలి సదస్సు నాటి నుంచీ ఇదే స్థితి. కానీ ట్రంప్‌ ఆగమనంతో అంతా తలకిందులైంది. ఈ సదస్సులకు అమెరికా ప్రతినిధుల సభలోని పాలక, విపక్ష సభ్యులు కూడా హాజరవుతారు. తాము అధికారంలోకొస్తే విదేశాంగ విధానంలో చేసే మార్పులేమిటో విపక్ష ప్రతినిధులు ఏకరవు పెడతారు. వీరిలో మున్ముందు అమెరికా అధ్యక్ష  పదవికి పోటీపడదల్చుకున్నవారే అధికంగా వస్తారు. ఈసారి కూడా ఇరుపక్షాల సెనెటర్లూ వచ్చారు. కానీ వామపక్ష భావా లున్న డెమాక్రటిక్‌ పార్టీ సెనెటర్‌ ఒకాసియో కోర్టెజ్‌ తప్ప ఇతరులెవరూ ట్రంప్‌ ప్రవచిస్తున్న విధానాలను నిర్ద్వంద్వంగా వ్యతిరేకించలేకపోయారు. 

డెమాక్రాట్ల అయోమయానికి కారణం ఉంది. 2016లో తొలిసారి ట్రంప్‌ ఎన్నికై నప్పుడు అది యాదృచ్ఛిక ఘటనగా ఆ పార్టీ భావించింది. యూరప్‌ అధినేతల అంచనా కూడా అదే! కానీ రెండో దఫా ఎన్నిక వారిలో జ్ఞానోదయాన్ని కలిగించింది. అందుకే ఇది మొత్తంగా అమెరికన్‌ సమాజ ధోరణిలో వచ్చిన మార్పునకు సంకేతం కావొచ్చన్న నిర్ణయానికొచ్చారు. ట్రంప్‌ అనంతరం ఎవరు అధికారంలోకొచ్చినా కొంత హెచ్చు తగ్గులతో ఈ విధానాలే తప్పక పోవచ్చని డెమాక్రాట్లు భావిస్తున్నారు. ట్రంప్‌ కారణంగా విచ్ఛిన్నమైన అమెరికా–యూరప్‌ బంధాన్ని ఏదో మేరకు మరమ్మతు చేయగలిగినా పూర్వపు స్థితి రావటానికి కొన్ని తరాలు పడుతుందని అరిజోనా సెనెటర్‌ మార్క్‌ కెల్లీ వ్యాఖ్యానించటంలోని అంతరార్థం అదే.

ఈసారి భద్రత మాట అటుంచి... మ్యూనిక్‌ సదస్సు యూరప్‌ దేశాల అరణ్య రోదనగా మిగిలింది. ఉక్రెయిన్‌ యుద్ధంపై నిర్వహించిన చర్చకు రుబియో గైర్హాజరయ్యారు. ఆ దేశానికి అమెరికా నుంచి అదనంగా వచ్చిపడేదేమీ లేదని ఉక్రెయిన్‌ అధ్య క్షుడు జెలెన్‌స్కీకి అర్థమై ఉండాలి. ‘నాటో సభ్యత్వం వద్దు... కనీసం రెండు దశాబ్దాల పాటు మా భద్రతకు పూచీ పడతామని అమెరికా హామీ ఇస్తే రష్యాతో రాజీ పడతామని ఆయనన్నారు. కానీ వినేవారేరి? యూరప్‌దీ అదే స్థితి. గ్రీన్‌ల్యాండ్‌ విషయంలో రుబియోతో ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం వచ్చినా డెన్మార్క్, గ్రీన్‌ల్యాండ్‌ అధి నేతలకు ఎలాంటి హామీ దొరకలేదు. మొత్తానికి తమది ఇకపై ఒంటరి పయనమేనని తెలి సింది గనుక స్వీయ ప్రయోజనాలపై యూరప్‌ దృష్టి సారించాలి. అమెరికా కీలుబొమ్మగా వ్యవహరించటం విరమించుకోవాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement